గోమూత్రం తో కరోనాకు మందు.. ఐసిఎంఆర్ కోర్టులో బంతి
posted on Jul 28, 2020 @ 12:26PM
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక పక్క వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి శాస్త్రవేత్తలు కాలంతో పాటు పరుగులు పెడుతుంటే మరో పక్క ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సరైన మందు కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేరళలో కరోనా కు విరుగుడుగా గోమూత్రంతో మందులు తయారుచేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన కేసు కేరళ హైకోర్టుకు చేరింది. దీనిపై కేరళ హైకోర్టు స్పందిస్తూ ఈ మందుపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)ని ఆదేశించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే కరోనా ట్రీట్‌మెంట్‌కి తాము గోమూత్రం తో తయారుచేసిన ఆయుర్వేద మందును వాడేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కోజికోడ్ జిల్లా తిరువంబడికి చెందిన వెల్నెస్ కన్సల్టెంట్, సోషల్ వర్కర్ సన్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. కొన్నిఆమోదం పొందిన ఆయుర్వేద మందులతో పాటు గోమూత్రం కలిపి తాము తయారుచేసిన ఔషధం అటు కరోనా అంతు చూడడమే కాక ఈ వైరస్ వ్యాప్తిని కూడా అరికడుతుందని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది.
అంతే కాకుండా "ఈ మందు కరోనా పీడితులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని దీంతో కరోనా వైరస్‌తో పోరాడేలా చేస్తుందని" కోర్టులో వేసిన పిటిషన్‌లో తెలిపారు. పిటిషనర్ తరపున లాయర్ నందకుమార్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ తమ మందుకు అనుమతి ఇవ్వాలని ఐసిఎంఆర్ ను అభ్యర్ధించగా ఇంతవరకూ స్పందించలేదని కోర్టుకు తెలిపారు. గోమూత్రం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అందుకే దాన్ని ఆయుర్వేద మందుల తయారీలో వాడతారని అయన కోర్టులో వివరించారు. ఇంకా ఈ మందులో హిమాలయాలలో దొరికే బెర్రీ మూలికతో పాటు మరి కొన్ని వనమూలికలు, గోమూత్రాన్ని కలిపి మందుగా తయారుచేశామని అయన కోర్టుకు తెలిపారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో కూడా వివరించారని అయన కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా మెడికల్ ప్రాక్టీషనర్ అధ్వర్యంలోనే ఈ మందును తయారుచేసినట్లు అయన కోర్టుకు వివరించారు.
ఇప్పటికే కొన్ని అల్లోపతి మందులను కరోనా పేషెంట్లకు వాడేందుకు అధికారుల అనుమతులు లభించిన నేపథ్యంలో తమ ఆయుర్వేద మందుకు అనుమతి ఎందుకు ఇవ్వరన్నది పిటిషనర్ వాదన. దీంతో ఇపుడు బంతి ఐసిఎంఆర్ కోర్టుకు చేరింది. మరి దీనిపై ఐసిఎంఆర్ ఏ విధంగా స్పందిసుందో వేచి చూడాలి.