దూసుకువస్తున్న రాఫెల్
posted on Jul 27, 2020 @ 4:46PM
భారత్ ఆధునిక అంబులపొదిలో ప్రపంచంలోనే అతిశక్తి వంతమైన యుద్ధవిమానాలుగా భావించే రాఫెల్ యుద్ధవిమానాలు చేరే సమయం అతి సమీపంలోనే ఉందని భారత వైమానిక దళం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. భారత్ చైనా, భారత్ పాకిస్తాస్ సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకుంటున్న వేళ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధవిమానాలు గగనతలంలోకి ఎగిసి భారత్ దిశగా పయనిస్తున్నాయి. 7364 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరో రెండు రోజుల్లో భారత్ ను చేరుతాయి.
ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. వీటిలో ఐదు యుద్ధ విమానాలు ఈ రోజు ఫ్రాన్స్ మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయ్యాయి. మార్గ మధ్యంలో అబుదాబి సమీపంలోని అల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఫ్యూయల్ ఫిల్ చేసుకుని తిరిగి బయలుదేరి ఈ నెల 29న హర్యానాలోని అంబాలా వద్ద ఉన్న ఎయిర్ బేస్ కు చేరుకుంటాయి. తొలిదశలో ఐదు యుద్ధ విమానాలు రాగా మిగతా 31 విమానాలు 2021 చివరి నాటికి భారత వైమానికదళంలో చేరుతాయి. ఇందులో 28 యుద్ద విమానాలకు సింగిల్ సీటు ఉంటే మిగతా 8 విమానాలకు డబుల్ సీటు సదుపాయం ఉంటుంది.
ఫ్రాన్స్ లోని డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ యుద్ధవిమానం ఇంజన్లు అత్యంత శక్తివంతమైనవి. గంటకు 1912 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఇది మిసైల్స్ ను తీసుకుపోగల సామర్ధ్యంతో ఉంటే ఈ మల్టీ రోల్ ఫైటర్ భూ, గగన తలాల్లో దాడి చేయగల శక్తివంతమైన యుద్ధవిమానం ఇది.
అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధ విమానాలను నడిపేందుకు పైలట్లకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే భారత వైమానికదళంలోని 12మంది పైలట్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మరో 28మందికి శిక్షణ ఇవ్వనున్నారు.