ట్రాక్టర్ సాయం పొందిన రైతు రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు?
posted on Jul 27, 2020 @ 9:00PM
చిత్తూరు జిల్లాకు చెందిన వీరదల్లు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి పొలం దున్నడం చూసి చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్‌ను కొనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పూటకో మలుపు తిరుగుతోంది. నాగేశ్వరరావు రైతు కాదని, స్థానికంగా అంతో ఇంతో పేరుందని, 2009 లో లోక్ సత్తా తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారని.. అలాంటి వ్యక్తిని పేద రైతుగా చిత్రీకరించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పలువురు పోస్టులు కూడా పెడుతున్నారు.
అయితే, తాజాగా ఈ వ్యవహారంపై నాగేశ్వరరావు స్పందించారు. తమపై తప్పుడు ప్రచారం చేసి రోడ్డు పాలు చేయొద్దని వేడుకున్నారు. తన నిజ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే మహల్రాజపురానికి రావాలని అన్నారు. తన కూతుళ్లను చంద్రబాబు చదివిస్తానని చెప్పడంతో తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని తెలిపారు. తన పేదరికాన్ని గుర్తించి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ మహానుభావుడు ట్రాక్టర్ ను గిఫ్ట్‌గా ఇస్తే ఇలా దుష్ప్రచారం చేయడమేంటని వాపోయారు. దుష్ప్రచారం చేసే వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. "నేను దళితుడిని, మానవ హక్కుల కార్యకర్తని. 2009 ఎన్నికల్లో లోక్‌సత్తా తరపున పోటీ చేశాను. కానీ, ఆ ఎన్నికల్లో అసలు అభ్యర్థిని నేను కాదు. స్థానికంగా ఉండే మరో వ్యక్తికి పార్టీ టికెట్ వచ్చింది. ఆయన దగ్గర నెలకు 6వేల జీతంతో నేను పనిచేసే వాడిని. అసలు అభ్యర్థిగా ఆయనే నామినేషన్ వేశాడు. కానీ ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ఓట్లు పడవని ఆయనకు అర్థమైంది. దీంతో, డమ్మీ అభ్యర్థినైన నాకు ప్రచారం ఖర్చులకు 50వేలు డబ్బులిచ్చి, పోటీకి నిలబెట్టాడు.'' అన్నారు.