సీఎం జగన్ కూతురు చదివే చోటా అదే తీరు.. ఇప్పటికైనా ఆయన మారాలి

జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. సీఎం వైఎస్ జగన్‌ ను కోరారు. ప్రాథమిక విద్యను ఆంగ్ల భాషలో నిర్బంధంగా బోధించాలని సీఎం నిర్ణయించడం సమంజసం కాదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనైనా సీఎం తీరు మారాలన్నారు.  ప్రపంచమంతా ఒక దారైతే, నాదో దారి అన్నట్టున్న జగన్‌ వైఖరి మారాలని సూచించారు. ఆంగ్ల భాషలోనే బోధించాలన్న ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఆయన.. చిన్న రాష్ర్టాలు సైతం మాతృభాషకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని గుర్తు చేశారు. ''నాకు తెలిసి మన సీఎం వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతున్నట్లుంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో వేల్స్ అనే ప్రాంతముంది. గ్రేట్ బ్రిటన్ అధికారిక భాష ఇంగ్లీషే అయినప్పటికీ, వేల్స్ ప్రాంతంలో మాతృభాష అయిన 'వేల్ష్' అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం 20 శాతంగా ఉన్న మాతృభాష బోధనను 50 శాతానికి పెంచే ప్రణాళికలు చేశారు. అంత చిన్న కమ్యూనిటీకే సొంత భాషపై అంతగా ప్రేముంటే, గొప్పగా చెప్పుకునే తెలుగు కోసం మనము ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలి? అయినా, యునెస్కో దగ్గర్నుంచి దేశాదేశాలన్నీ మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుంటే, మన సీఎం మాత్రం 151 సీట్లు వచ్చాయి కదాని ఇష్టమొచ్చినట్లు వెళతానంటే కుదురుతుందా?'' అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష చైనీయులు మాట్లాడే మాండరిన్ అని, రెండో స్థానంలో స్పానిషన్ ఉందని, ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లీష్, హిందీ వస్తాయని, కేవలం ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనతోనే అన్నీ లభిస్తాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఎంపీ అన్నారు. మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మాతృభాష గురించి మాట్లాడేవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుతున్నారని, సీఎం జగన్ ఎదురు ప్రశ్నలు వేయడం మానుకోవాలని సూచించారు. ఎల్లాప్రగడ సుబ్బారావు, సీవీ రామన్ సహా గొప్ప గొప్ప వాళ్లంతా మాతృభాషలోనే చదువుకున్నారని, ఏపీ కంటే అభివృద్ధిలో ఎంతో మందున్న జపాన్, చైనా, కొరియాలోనూ మాతృభాషలోనే బోధన సాగుతుందని, ఇవన్నీ తెలిసి కూడా జగన్ తప్పుడు విధానాలను అనుసరించడం, ఏకంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుండం శోచనీయమని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి బహిష్కరించే దిశగా తనకు జారీ చేసిన నోటీసులు, తనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చిన ఫిర్యాదులోనూ భాషకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఉందని ఎంపీ గుర్తుచేశారు. ఏపీ సర్కారు తలపెట్టిన ఇంగ్లీషు మీడియంపై వ్యతిరేకంగా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారని అన్నారు. మాతృభాషను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమన్న తన వాదన ఎంత సరైందో.. నూతన విద్యావిధానం ఆమోదంతోనే అర్థమవుతున్నదని, ఆ లెక్కన పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు కూడా రాజ్యాంగ విరుద్ధమైనవిగానే భావించాలని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

రాఫెల్ రఫ్పాడిస్తే

రాఫెల్, జె 20, ఎఫ్ 16 దేని సామర్ధ్యం ఎంత 28 జూలై 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు. సరిగ్గా అదే రోజు మరో యుద్ధానికి సిద్ధం అంటూ రాఫెల్ ఫైటర్ జెట్స్ గగనతలంలో భారత్ దిశగా దూసుకువచ్చాయి. యుద్దం అంటేనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం. ఈ సారి యుద్ధం అంటూ వస్తే అది మూడో ప్రపంచయుద్దమే అవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భారత్ అమ్ములపొదిలో చేరిన రాఫెల్ తో చైనాను గెలవడం సాధ్యమా అంటూ విమర్శిస్తున్నారు. అయితే తన సైన్యాన్ని సరిహద్దుల వెంట మోహరించడంతోపాటు పాకిస్తాన్ ను కూడా ఉసికొల్పుతోంది డ్రాగన్ కంట్రి. ఈ రెండు దేశాల వెన్నులో రాఫెల్ వణుకు పుట్టించిన సంగతి వాస్తవమే అయినా అది ఒప్పుకోవడానికి, ఆ దేశాలకు, వాటికి వత్తాసు పలికే మరికొందరికీ సాధ్యం కావడం లేదు. మరి యుద్ధం అంటూ వస్తే మన వైమానిక దళంలో చేరిన రాఫెల్ జెట్ ను ధీటుగా ఎదుర్కోగల యుద్ధ విమానాలు చైనాతో, పాక్ తో ఉన్నాయా వారి వద్ద ఉన్న అత్యంత ఆధునిక యుద్ధ విమానాల గురించి తెలుసుకుంటూ రాఫెల్ తో వాటిని పోల్చిచూస్తే మన సత్తా ఎంటో స్పష్టమవుతుంది. రాఫెల్ వచ్చిన తరువాత, భారత వైమానిక దళం బలం అమాంతం పెరుగుతుందని, పాకిస్తాన్ ఎఫ్ -16 , చైనా జె -11 కన్నా రాఫెల్ మరింత శక్తి వంతమైనదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ కలిసి యుద్ధానికి వచ్చినా మన రాఫెల్ ను ఎదిరించే సత్తా వారికి లేదని నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన రాఫల్ ఒకేసారి 8 శత్రు స్థావరాలపై నిఘా ఉంచగలదు. అంతేకాదు శత్రు స్థావరాలను కనిపెట్టి  వాటిపై దాడి చేసి నామరూపాలు లేకుండా చేస్తుంది. అమెరికా నుంచి పాకిస్తాన్‌ గతంలో కొనుగోలు చేసిన ఎఫ్ 16 యుద్ధ విమానాలు రెండు ఒక రాఫెల్ కు సమానమని ఒక అంచనా. ఈ మూడు యుద్ధ విమానాల గురించి తెలుసుకుంటే యుద్ధంమంటూ వస్తే  ఎవరిది పై చేయి అవుతుందో స్పష్టంగా తెలుస్తుంది. రాఫెల్ ఫ్రాన్స్ తయారు చేసిన యుద్ద విమానం. ట్విన్ ఇంజన్, 4.5 జనరేషన్, స్పీడ్ 2130, సర్వీస్ సీలింగ్ 15,235 మీటర్లు, అత్యంత ఆధునిక రాడార్ వ్యవస్థ ఇందులో ఏర్పాటు చేశారు. శత్రు కదలికలను ట్రాక్ చేస్తూ, వాటిని ట్రేస్ చేయడంతో పాటు నాశనం చేయడంలో అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. రాఫెల్ నిర్మాణ ఖర్చులో 30శాతం రాడార్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ కోసమే ఖర్చు చేశారు. ఈ ఫైటర్ జెట్ లో సాంకేతిక వ్యవస్థ అత్యంత ఆధునికం. 360 యాంగిల్స్ లో శత్రు కదలికలపై కన్నేసి ఉంచుతుంది. రెండు మిస్సైల్స్ ను 150,200 మీటర్ల లక్ష్యంతో ప్రయోగించగలదు. 33ఎంఎం కానోన్ తో 125రౌండ్స్ ఆయుధాలను ప్రయోగిస్తుంది. మిస్సైల్స్ ను  4220రేంజ్ లక్ష్యాన్నిఛేదిస్తుంది. అన్నింటికి మించి ఇది మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్.   ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ ల్యాండ్, ఎయిర్ టూ సర్పెస్ పైకి ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఆత్మరక్షణ వ్యవస్థతో పనిచేసే సెన్సార్ టెక్నాలజీ ఇందులో ఏర్పాటుచేశారు.  చెంగ్డూ జె-20 చైనాతయారు చేసిన యుద్ధ విమానం. అధికారికంగా చైనా ప్రకటించకపోయినా ఈ విమానం అమెరికా ఎఫ్ 22 నుంచి ఇన్ స్పైర్ అయి తయారు చేసినట్లు అంచనా. 5జెనరేషన్ అని చైనా చెబుతోంది. సింగిల్ ఇంజన్, స్పీడ్ 2,223,  సర్నీస్ సీలింగ్ 20వేల మీటర్లు, చాలా శక్తివంతమైన రాడార్ వ్యవస్థ ఇందులో ఉందని చైనా చెపుతున్నా అందుకు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవు. అయితే చైనా శాటిలైట్స్ ద్వారా వచ్చే సిగ్నల్స్  ఆధారంగా పైలెట్ ముందుకు వెళ్తారట.   ఎఫ్ 16 అమెరికా నుంచి గతంలోనే పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసింది. సింగిల్ ఇంజన్, స్పీడ్ 1500, సర్వీస్ సీలింగ్ 15,240 మీటర్లు, 20 ఎంఎం కానున్,  మిస్సైల్ 3700రేంజ్ లో మాత్రమే స్ట్రైక్ గా ప్రయోగించగలుగుతాయి.  చైనా తయారు చేసిన చెంగ్డూ జె 20 యుద్ధ విమానం ఫిత్త్  జెనరేషన్ అని చెప్తున్నా అందుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాలేదు. అయితే ఇటీవల లాసా వద్ద జె 20ని సుఖాయ్ 30 ట్రాక్ చేసిందని సమాచారం. ఒకవేళ చైనా అమెరికా తయారు చేసిన ఫిత్త్ జెనరేషన్ ఎఫ్ 22 ఇన్సిరేషన్ గా తీసుకుని తయారు చేసింది వాస్తవమే అయితే రాఫెల్ చేతికి చిక్కాల్సిందే. గతంలో ఎఫ్ 22ను రాఫెల్ జెట్ ఫ్లైట్ పిక్ చేయగలిగిందని పరిశోధకులు చెబుతారు. ఇక ఎఫ్ 16 విషయానికి వస్తే పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో బాలాకోట్ వద్ద జరిగిన సంఘటనలో ఎఫ్ 16ను భారత వైమానిక దళం లోని మిగ్ 21 కూల్చివేసిందని అనధికార సమాచారం. అరవై ఏండ్ల కిందట తయారైన మిగ్ 21 దాడిలో నేలకొరిగిన ఎఫ్ 16 రాఫెల్ రఫ్పాడిస్తే తట్టుకుంటుందా.. అన్నింటి కన్నా మరో ముఖ్యమైన విషయం గతంలో జరిగిన ఎన్నో యుద్ధాల్లో రాఫెల్ తన సత్తా నిరూపించుకుంది. ఘనమైన పోరాట చరిత్ర రాఫెల్ సొంతం. గత దశాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా రాఫెల్ కు తిరుగులేదు. భారత్ చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం అంటూ వస్తే శత్రు దేశాలకు కఠినమైన గుణపాఠం చెప్పాలన్న భారత్ ఆశ రాఫెల్ ద్వారా తీరుతుందని ఆశిద్దాం.

మూడు రాజధానుల విషయంలో మేము కలగచేసుకోము: సోము వీర్రాజు

రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు సుజనా వాదనతో విభేదించారు. గతంలో ఏపీ రాజధాని అమరావతి విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు హామీలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని, అలాగే ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అదే సమయంలో, రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందన్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజును బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ లాగా తమది కుటుంబ పార్టీ కాదని, బీజేపీ సకల జనుల పార్టీ అని అన్నారు. అంతే కాకుండా వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీ తమకు చాలా దగ్గరేనని ప్రచారం చేసుకుంటున్నాయని అయితే ఆ రెండు పార్టీలను తాము సమానంగానే చూస్తామని తెలిపారు. తమ పార్టీ జనసేనతో కలిసి అధికారం దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఇళ్ల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని అయన ఆరోపించారు. మొత్తానికి ఒక పక్క సుజనా వచ్చి రాజధాని కేంద్రం పరిధిలోని అంశం అంటే మరో పక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అబ్బే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అంటున్నారు. దీంతో ఈ అంశం పై బీజేపీ స్టాండ్ ఏంటో తెలియక రాష్ట్ర ప్రజలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.

దిగి వచ్చిన జగన్ సర్కార్... ఏపీ ఎన్నికల కమిషనర్ గా మళ్ళీ నిమ్మగడ్డ

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి నియమించింది. గత అర్ధరాత్రి ఈ మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అయన నియామకం సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ మొన్న మార్చ్ లో కరోనా మహమ్మారి కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదించి అయన స్థానం లో జస్టిస్ కనగరాజ్ ను నియమించిన విషయం తెలిసిందే. ఐతే దీనికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లగా ఆయనను తిరిగి నియమించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పై జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించింది. ఈ లోగా హైకోర్టులో నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయగా గవర్నర్ ను కలిసి తమ ఆదేశాల గురించి వివరించాలని నిమ్మగడ్డను ఆదేశించి కేసును ఈ రోజు అంటే 31 వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసు పూర్తి వివరాలు తమకు తెలుసని అసలు గవర్నర్ జోక్యం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా అని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. దీంతో బహుశా అన్ని దారులు మూసుకు పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు.

అనిల్ అంబానీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న యస్ బ్యాంక్

ఒక పక్క ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల లిస్ట్ లో స్థానం సంపాదించగా మరో పక్క అతని సోదరుడైన అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకు పోయాడు. తాజాగా తనకు బాకీ ఉన్న అప్పును తిరిగి చెల్లించక పోవడంతో యస్ బ్యాంక్ ముంబైలోని అనిల్ అంబానీ ఆఫీసును స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ముంబైలోని మరో రెండు ఫ్లాట్ లను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు గా యస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థ తమ కు బాకీ ఉన్న 2,893 కోట్ల బకాయిని చెల్లించాలని మొన్న మేలో నోటీసు ఇచ్చి తాజాగా అనిల్ అంబానీకి చెందిన ఈ మూడు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే యస్ బ్యాంక్ దివాలా తీయడానికి  ఇటువంటి లోన్ లే కారణమని తెలుస్తోంది.

ఏపీలో వరుసగా రెండో రోజు 10 వేలకు పైగా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ ను పరీక్షించగా.. 10,167 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557 కి చేరగా, మరణాల సంఖ్య 1,281 కి చేరింది. ఇప్పటివరకు 60,024 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 69,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,90,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

సీఎం జగన్ కు ఉండవల్లి లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని అన్నారు. కరోనా బారిన పడితే జీవించలేమనే ఆవేదనలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో గెలవడానికి జగన్ కు బలాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తున్నానని అన్నారు.  కరోనా రోగుల కోసం తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు అన్ని ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకుని వాటిని ఎన్జీఓలు, ట్రస్ట్ లకు అప్పగించాలని సూచించారు. ఈ కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని.. ప్రభుత్వం వైపు నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే ఒక కళ్యాణ మండపం అద్దెకు తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కరోనా పరీక్షలకు అనుమతించి, ఫీజును ప్రభుత్వం నిర్ణయించాలని అన్నారు. 

భారత్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కు బ్రేక్ 

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కబళిస్తున్న నేపథ్యంలో మానవాళి ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వ్యాక్సిన్లలో ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్, మోడెర్నా, రష్యా వ్యాక్సిన్ల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇందులో కూడా అన్నిటి కంటే బాగా సక్సెస్ అవుతోందని వార్తలు వస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మన దేశంలో మరి కొద్దీ రోజులలో అంటే ఆగస్టు నెలలో మొదలు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ ట్రయల్స్ నిలిచి పోయాయి. మన దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు ఐన సీరం ఇండియా సంస్థ భారతీయుల పై ట్రయల్స్ కోసం చేసిన అభ్యర్ధన ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. భారత్ లో రెండు మూడు దశల క్లినికల్ ట్రయల్స్ అనుమతి కోసం సీరం ఇండియా సంస్థ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కు అభ్యర్ధన పంపగా దానిని డిసిజిఐ ఒక స్పెషల్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) పరిశీలనకు పంపింది. ఐతే ఈ క్లినికల్ ట్రయల్స్ చేసే విషయం లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసిందిగా సీరం ఇండియా కు ఎక్స్పర్ట్ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. పూణే, ముంబైలలో 1600 మంది వాలంటీర్ల పై తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని గతంలో సీరం ఇండియా సంస్థ ప్రకటించింది. ఐతే ఇదే విషయమై ఎక్స్పర్ట్స్ కమిటీ మాత్రం కొన్ని మార్పులు చేయాలని కోరినట్టుగా సమాచారం. ట్రయల్స్ కేవలం రెండు నగరాలలో కాకుండా దేశ వ్యాప్తంగా చేయాలనీ దీనితో పాటు వ్యాక్సిన్ ప్రభావం పై మరింత లోతైన విశ్లేషణ కూడా చేయాలనీ దీని కోసం సీరం సంస్థ పంపిన అప్లికేషన్ లో మరో ఎనిమిది మార్పులు చేయాలనీ ఎక్స్పర్ట్ కమిటీ సూచించింది. దీంతో సీరం ఇండియా సంస్థ తమ అభ్యర్ధనలో మార్పులు చేసి మళ్ళీ డిసిజిఐ కి పంపవలసి ఉంది. ఆ అభ్యర్ధనను ఎక్స్పర్ట్స్ కమిటీ (SEC) ఆమోదించిన తరువాత మాత్రమే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. దీంతో భారత్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఆలస్యం కావచ్చని సమాచారం.

అయోధ్యకు ఉగ్ర ముప్పు

జమ్మూకశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి ఆగస్టు 5 కి ఏడాది కావస్తున్నందున దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 5న దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కూడా భూమిపూజ జరుగనుండటంతో, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వేడుకలను కూడా టార్గెట్ చేశారని సమాచారం. ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులకు అవకాశమున్న ప్రాంతాల్లో భద్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.

కరోనా నేపథ్యంలో జంతు వధపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చైనా దేశ ప్రజల ఆహారపు అలవాట్ల వల్లనే ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా తో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పాంగోలిన్, గబ్బిలాల వంటి వాటిని తినడం వల్లనే ఈ వ్యాధి మనుషులకు సోకిందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. తాజాగా బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. బక్రీద్ దృష్ట్యా జంతువుల అక్రమ వధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. బక్రీద్ పర్వదినం నేపథ్యంలో ఎవరైనా జంతువుల అక్రమవధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలంటూ దాఖలైన ఒక పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా నిబంధనల ప్రకారమే జంతువధ జరగాలని స్పష్టం చేసింది. ఈ పిల్ విచారణ సందర్భంగా జంతుమాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనాలో గబ్బిలాలు వంటి వాటిని తినడం వల్లే కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించింది. దాంతో, మాంసం దుకాణాలను తనిఖీ చేస్తున్నారా అని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తీ వివరాలతో రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టులో చుక్కెదురు

వైసీపీ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు చుక్కెదురైంది. ఈ కేసులో కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లు రవీంద్ర.. బెయిల్ కోరుతూ కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టేసింది. కొల్లు రవీంద్ర బయటికి వస్తే ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను కోర్టు సమర్థించింది. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసిన రాఫెల్ ప్రత్యేకతలు

భారత వైమానిక దళం బలం పెంచుకోవాలని దశాబ్దాల తరబడి చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా పోరాట చరిత్ర ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలు భారత వైమానిక దళంలోభాగం కావడం చారిత్రక అంశం. భారత్ సరిహద్దు దేశాలతో దోస్తీ చేసిన చైనా లక్ష్యం కేవలం భారత్ భూభాగాలను ఆక్రమించుకోవడమే. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత్ గట్టి గుణపాఠమే చెప్పేందుకు సిద్ధమవుతుంది. సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తున్న డ్రాగన్ కంట్రీ కుట్రలకు, కుతంత్రాలకు చెక్ పెట్టేందుకు సైన్యానికి కావల్సిన పూర్తి మద్దతు భారత ప్రభుత్వం ఇస్తోంది. అందుకు అనుగుణంగా వైమానిక దళాన్ని శక్తివంతం చేసేందుకు భారత దౌత్య రాయబారాలు ఫలించి రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. అంబాల ఎయిర్ స్టేషన్ లో ల్యాండింగ్ అయిన ఈ ఫైటర్ జెట్లకు దేశ రక్షణ శాఖ స్వాగతం పలికింది. ఫ్రాన్స్ నుంచి ఏడువేల కిలోమీటర్లు గగనయానం చేసిన ఈ లోహ విహంగాలు భారత భూభాగం పై వాలాయి. రాఫెల్ రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతమైంది. 50వేల అడుగుల ఎత్తులో ఎగరగల సామర్ధ్యం ఉన్న ఈ యుద్ద విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ వచ్చే దారిలోనే 30వేల అడుగుల ఎత్తులో ఇంధనాన్ని నింపుకోని తన ప్రత్యేకతను రుజువు చేసింది. అణ్యాయుధాలను మోసుకుని వెళ్లగల సత్తా ఉన్న ఈ విమానాల బరువు పది టన్నులు. దాదాపు తొమ్మిది నుంచి 13 టన్నుల బరువు ఇవి మోయగలవు. మొదటి దశలో వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాల్లో రెండు శిక్షణ విమానాలు కాగా మూడు యుద్ధ విమానాలు. ప్రపంచ వ్యాప్తంగా గత పదమూడేండ్లుగా రాఫెల్ ను మించిన యుద్ధ విమానం లేదు. అయితే చైనా వద్ద ఉన్న జె 20 యుద్ద విమానం అంతకు మించిన శక్తిని కలిగి ఉందని ఆ దేశం అంటున్నా అందుకు సరైన ఆధారాలు లేవు.  గాలిలో నుంచి గాల్లోకి, గాలిలోనుంచి భూమిమీదకు, గాలిలో నుంచి సర్ఫేస్ కు ఈ విమానాల ద్వారా క్షిపణులను ప్రయోగించవచ్చు. 4.5 జెనరేషన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ తరహా యుద్ధ విమానాలు ఫ్రాన్స్, ఈజిప్టు, ఖత్తార్  దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, లిబియా పై ఫ్రెంచ్ వైమానిక దళం రాఫెల్ ను ఉపయోగించింది. పోరాటంతో సత్తా చూపించే యుద్ధ విమానంగా రాఫెల్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉఁది. రాఫెల్.. జె 20 కన్నా ఎక్కువ ఇంధనం , ఆయుధాలను కూడా తీసుకెళ్లగలదు. 2016లో ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాలకు 59వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదిరింది. అంటే ఒక్కో యుద్ధ విమానం ఖరీదు దాదాపుగా రూ.1638 కోట్లపైమాటే. వీటి నిర్వాహణకు మరో నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఇందులో సింగిల్ సీటర్ రాఫెల్ డిహెచ్, డబుల్ సీటర్ ను రాఫెల్ ఇహెచ్ గా పిలుస్తారు. రెండు రకాల రాఫెల్ లోనూ డబుల్ ఇంజన్ ఏర్పాటు చేశారు. భారత వైమానిక దళంలో అత్యంత శక్తి వంతమైన యుద్ధ విమానాలుగా ఇవి శత్రుల సైన్యం గుండెల్లో ఫిరంగులు మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాఫెల్ పొడవు 15.30 మీటర్లు, ఎత్తు 5.30 మీటర్లు, రెక్కల పొడవు 10.90 మీటర్లు, గగనతలంలో గంటకు 1.8 మాక్ వేగంతో దూసుకుపోతుంది. రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా అత్యాధునికమైన ఆయుధాలను ప్రయోగించవచ్చు. 9500 కేజీల బరువైన ఆయుధాలను ఈ విమానాలు మోసుకెళ్లగలవు. ఈ యుద్ధ విమానంలో రెండు రకాల క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉన్నది. అందులో ఒకటి 150 కిలోమీటర్ల రేంజ్ కాగా, రెండో రకం క్షిపణులు 300 కిలోమీటర్ల రేంజ్. కంటికి కనిపించని లక్ష్యాలను కూడా అవి ఛేదిస్తాయి. గంటకు 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అంతేకాదు, ఈ యుద్ధ విమానాలలో 360 డిగ్రీస్ లో నిఘా పెట్టగలిగే సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఎటు నుంచి శత్రువులు దాడి చేసినా క్షణాల్లో తప్పించుకునే శక్తి వీటికి ఉన్నది. వీటిలో అమర్చిన రాడార్ శత్రు దేశ కదలికలను పసికట్టండంలో దిట్ట. వందకిలోమీటర్ల రేంజ్ లో కంటికి కనిపించని కదలికలను కూడా ఇవి పసికడతాయి. ఇందులో అమర్చిన ఆధునిక 30ఎంఎం కెనాన్ ఆయుధాలు ఉంటాయి. ఇవి125 రౌండ్ల కాల్పులు జరుపుతాయి. రాఫెల్ లో అమర్చిన అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ చాలా పటిష్టమైనది. సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటూ శత్రు సైన్యంపై విరుచుకుపడే వ్యవస్థ ఇందులో ఉంటుంది.  కాట్ పిట్ డిజైనింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా, సులభంగా ఫైట్ ను టర్న్ చేసేలా కాట్ పిట్ డిజైన్ ఉంటుంది. లైటింగ్, సీటింగ్, టర్నింగ్ మొదలైన అనేక అంశాలు పైలట్ కు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటుచేశారు. ఈ యుద్ధ విమానాలను నడపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం అవుతుంది. ఈ మేరకు ఫ్రాన్స్ పైలట్స్ కు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మొదటి దశలో వచ్చిన ఐదు యుద్ధ విమానాల్లో రెండు శిక్షణ విమానాలే. భారత దేశ వైమానిక దళంలోని ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారత్ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి పైలెట్ గా తన పేరు నమోదు చేసుకున్నారు. భారత్ సరిహద్దుల వెంట మోహరిస్తున్న పాక్, చైనా సైన్యానికి తగిన బుద్ధి చెప్పేందుకు అతి త్వరలోనే సరిహద్దుల్లోని ఎయిర్ బేస్ లకు ఇవి చేరుకోనున్నాయి.

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు షాక్.. ఆగ‌స్టు 5న ఏపీ, తెలంగాణ సీఎంల‌ భేటీ!

ఏపీ ప్ర‌భుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలను జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లొద్దని ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లను పిలవకుండా ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆపాలని తెలంగాణ ప్ర‌భుత్వం రాసిన లేఖను కూడా ఈ మేర‌కు త‌మ లేఖ‌తో జతపరిచారు. మరోవైపు.. కృష్ణా, గోదావరి జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం ఆగ‌స్టు 5న నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంల‌తో ఆగస్టు 5న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రెండు రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశామని, ఆ రోజున ఇద్ద‌రు సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్న స‌మాచారాన్ని తెల‌పాల‌ని లేఖ‌లో కోరారు.

అయోధ్య రామ మందిర పూజారికి కరోనా

అయోధ్య రామ మందిర భూమి పూజకు చకా చకా ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. కరోనా కలంకలం రేగింది. రామ జన్మభూమి పూజారి ప్రదీప్ దాస్‌ కరోనా బారినపడ్డారు. రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ఆయనతో పాటు మరో నలుగురు పూజారులు కూడా ఉంటారు. ఈ నలుగురిలో ఒకరైన ప్రదీప్ దాస్‌ కి కరోనా సోకింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అంతేకాదు, రామ జన్మభూమి వద్ద భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులకు కూడా కరోనా సోకింది. దాంతో వారంతా క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆగస్టు 5న రామ మందిరానికి భూమి పూజ జరగనుండగా, ప్రధాని మోదీ పాటు మరో 200 మంది వీఐపీలకు ఆహ్వానాలు అందాయి. ప్రధాని తదితరులు రానున్న వేళ పూజారికి కరోనా సోకడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పూజారికి కరోనా సోకిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

మరో పది పన్నెండు రోజులలో రష్యా వ్యాక్సిన్

కరోనా వైరస్ విలయతాండవంతో ప్రపంచం మొత్తం వణికి పోతోంది. ఈ పరిస్థితుల్లో ఇటు ప్రజల, అటు ప్రభుత్వాల రోజువారీ కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని మానవాళి ఆశగా ఎదురు చూస్తోంది. కొద్ద్ది రోజులుగా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గురించి కొంత పాజిటివ్ న్యూస్ వస్తుండగా.. తాజాగా రష్యా వ్యాక్సిన్ గురించి ఒక తీపి కబురు అందుతోంది.  కొద్ది రోజుల క్రితం రష్యా కు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో తయారైన వ్యాక్సిన్ తో మనుషుల పైన చేసిన ట్రయల్స్ సత్ఫాలితాలు ఇచ్చాయని వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యాక్సిన్ ను రష్యాలో ఆగస్టు 10, 12 తేదీల మధ్య రిజిస్టర్ చేస్తారని, ఆ తరువాత మూడు నుండి వారం రోజుల లోగా దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సమాచారం.  ఇప్పటికే వ్యాక్సిన్ తయారీనే మా టాప్ ప్రయారిటీ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మనుషుల పై ఈ వ్యాక్సిన్ తో చేసిన రెండు దశల ట్రయల్స్ విజయవంతం కావడం తో ఒక పక్క మూడో దశ ట్రయల్స్ చేస్తూనే మరో పక్క అత్యవసర సర్వీసులలో భాగమైన వైద్య సిబ్బందికి ముందుగా ఈ వ్యాక్సిన్ ను ఇస్తారని తెలుస్తోంది. ఒక సారి మూడో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తైన తరువాత సెప్టెంబర్ నెలలో దీని ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అయితే శాస్త్రవేత్తలు అలాగే వైద్య శాస్త్ర నిపుణులు మాత్రం వ్యాక్సిన్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా హడావిడిగా వ్యాక్సిన్ ను పబ్లిక్ లోకి రిలీజ్ చేస్తే దాని వల్ల అనర్ధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అన్ని ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని వ్యాక్సిన్ త్వరగా వస్తే ఎవరికి వాళ్ళుగా ఇళ్లలోనే బందీలుగా ఉన్న జనం బయటకు వచ్చి మళ్ళీ యధావిధిగా సాధారణ జీవనం సాగించవచ్చు.

క్లైమాక్స్ కి రాజస్థాన్ పొలిటికల్ డ్రామా

ఆగష్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాజస్థాన్ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా అనుమతి ఇచ్చారు. అసెంబ్లీని సమావేశపర్చాలని కోరుతూ అశోక్ గెహ్లాట్ సర్కారు పంపిన మూడు ప్రతిపాదనలను తిరస్కరించిన గవర్నర్‌.. ఎట్టకేలకు నాలుగో ప్రతిపాదనను ఆమోదించారు. అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ కావడంతో.. క్యాంపు రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది.  మరోవైపు, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బీఎస్పీ బుధవారం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశామని, స్పీకర్‌ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్‌ సింగ్‌ బాబా తెలిపారు. ఈ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక, కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ఏం చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ఆమోదించడంతో ఇప్పటికే సచిన్ పైలట్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ తమ శిబిర ఎమ్మెల్యేలు ఉంటున్న రిసార్టులను ఒక్కసారిగా మార్చేశారు. అంతేకాకుండా ఆ 19 మంది ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను కూడా మార్చేశారు. అంతేకాకుండా వీరి రక్షణ కోసం రిసార్టు చుట్టూ ప్రైవేట్ బౌన్సర్లను కూడా నియమించుకున్నారు.

రాఫెల్ విమానాలు.. రాహుల్ గాంధీ మూడు ప్రశ్నలు

ఫ్రాన్స్ నుంచి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం భారత్‌ కు చేరిన విషయం తెలిసిందే. భారత్‌ కొనుగోలు చేసిన 36 యుద్ధ విమానాల్లో భాగంగా తొలివిడత ఐదు యుద్ధ విమానాలు హర్యానాలోని అంబాలకు చేరుకున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాఫెల్ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని మొదటి నుంచి వాదిస్తోన్న రాహుల్.. తాజాగా ట్విట్టర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు.  ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. అలాగే, 126 విమానాలకు బదులు, కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. యుద్ధ విమానాల రూ.30,000 కోట్ల కాంట్రాక్టును దేశీయ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్ఏఎల్) కు కాకుండా, దివాలా తీసిన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు.

రాఫెల్ తొలి పైలట్

భారత వైమానిక దళం శక్తిని పెంచే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ ను చేరాయి. ఏడువేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని రెండురోజుల్లో పూర్తి చేసి విజయవంతంగా ల్యాండింగ్ అయిన ఈ యుద్ధ విమానాలను నడిపిన పైలట్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఫ్రాన్స్ నుంచి భారత్ కు చేరిన ఈ యుద్ధ విమానంలో తొలి భారత్ పైలెట్ ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథర్.  ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధవిమానాల రాకపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫ్రాన్స్ నుంచి యుద్ధవిమానాల రాకలో గానీ...తొలి పైలట్ గా గానీ వ్యవహరించింది అతనే. అందుకే ఇప్పుడతను వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ యుద్ధ విమానాలను నడపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. మన పైలట్స్ కు శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దాంతో భారత్ వైమానిక దళంలో కమాండర్ గా విధులు నిర్వహించే హిలాల్ అహ్మద్ రాథర్ ను ఫ్రాన్స్ పంపించారు. ప్రస్తుతం అతను ఫ్రాన్స్ దేశానికి ఎటాచ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యక్తి. అంతేకాదు రాఫెల్ జెట్స్ ఫ్లైట్స్ భారత్ కు ఇంత త్వరగా రావడానికి కారణం కూడా అతనే. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని బక్షిబాద్‌ హిలాల్ సొంత ప్రాంతం. చిన్నతనంలో ఆ ప్రాంతంలోని సైనిక్ పాఠశాలలో విద్యను పూర్తి చేసి 1988లో వైమానిక దళంలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ ఆనర్‌ను కూడా గెలుచుకున్న హిలాల్ అంచెలంచెలుగా ఎదిగి ఫ్లైట్ లెఫ్టినెంట్ నుండి ఎయిర్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్ లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్ పతకాల్ని కూడా అందుకున్నారు.  భారత దేశ సరిహద్దు పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ విమానంలో మార్పులు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుతం తరుణంలో రాఫెల్ జెట్ ఫ్లైట్స్ త్వరగా భారత్ కు రావడంలో కీలకపాత్ర పోషించారు. రాఫెల్ తొలి యుద్ధవిమానాన్ని నడుపుతున్న తొలి భారతీయ పైలెట్ కూడా తన పేరు నమోదు చేసుకున్నారు.