మనస్సున్న మహారాజు
posted on Jul 27, 2020 @ 1:00PM
కష్టంలో ఆదుకునేవాడు దేవుడైతే అతను నిజంగా వేలాది మందికి దేవుడే
అడగకుండా సహాయం చేసేవాడు ఆపద్భాందవుడైతే వాస్తవంగా ఎన్నో కుటుంబాలకు ఆయన ఆపద్భాందవుడే
సోషల్ మీడియాలో వచ్చే సమస్యలకు స్పందించి తనకు తానుగా సహాయం అందించేవాడు ఎవరూ అంటే మాత్రం సోనూ సూద్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసే సహాయానికి మరెవ్వరూ సాటిరారు. పది రూపాయల సహాయం చేయాలంటేనే నాకేంటీ అంటూ వందసార్లు ఆలోచించే ఈ కాలంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న మనస్సున్న మహారాజు.. సోనూ సూద్.
కరోనా లాక్ డౌన్ సమయంలో వందలాది మందికి అండగా నిలిచిన సోనూ సూద్ మరోసారి వార్తల్లోకి వ్యక్తిగా నిలిచారు. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటూ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన తాజాగా చిత్తూరు జిల్లాలోని చిన్నరైతుకు ట్రాక్టర్ అందింది తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు ఆడపిల్లలు ఎద్దులకు బదులుగా నాగలి లాగుతూ పొలం దున్నడం చూసి 24గంటల్లోనే వారికి ట్రాక్టర్ అందించారు. లీడర్ల నుంచి సామాన్యల వరకు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
సినిమాల్లో ప్రజల కష్టాలను తీర్చడానికి హీరో వస్తాడు. రెండున్నర గంటల సినిమాతో లక్షలాది ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాడు. మరి సినిమాలో విలన్ ను చూస్తే ప్రేక్షకుల్లో చులకనభావం. కానీ, సినిమాలో పాత్ర వేరు నిజజీవితం వేరు అన్నది నిరూపించారు సోనూ సూద్. వెండితెరపై విలన్ పాత్రలు వేసినా.. నిజజీవితంలో మాత్రం హీరోయిజంతో మానవత్వం చాటుకుని హీరో అయ్యారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో ఉన్న సోనూ సూద్ తనూ చేస్తున్న సేవకార్యక్రమాలతో శతాబ్దాలకు సరిపడ ప్రేమాభిమానాలను, పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బి) సంస్థ లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు సేవలు అందించిన ప్రముఖుల గురించి ఒక సర్వే నిర్వహించింది .ఇందులో బాలీవుడ్ నటుడు సోను సూద్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో అక్షయ్ కుమార్ , మూడోస్థానంలో అమితాబ్ బచ్చన్ ఉన్నారు.నటనతోనే కాదు మానవత్వంతోనూ ప్రజల మనసులు గెలవవచ్చని నిరూపించారు.
నిన్ను వదల బొమ్మాళి అంటూ అరంధతి సినిమాలో అద్భుత నటనతో ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందున్న సోనూ సూద్ ఈ సేవా కార్యక్రమాలు వదలను అంటూ ఎందరో మనసులను గెలుచుకున్నారు. కరోనా సమయంలో వలస కార్మికుల కోసం ఆయన చేసిన సేవాకార్యక్రమాలు ఎవరూ చేయలేదు. వలస కార్మికులపై ఇంత ప్రేమ ఎందుకు అని ఎవరైనా అడిగితే నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే అంటారు. ముంబయికి వలస వచ్చిన నన్ను ఇంతవాడిని చేసిన ప్రజలకు చేస్తున్నది కొంతే అంటూ తన గొప్ప మనసు చాటుకుంటారు.
కరోనా మహమ్మారిపై దేశవ్యాప్తంగా జరిగిన సేవాకార్యక్రమాల్లో సినీనటులు, ఎన్జీవోలు, సంస్ఖలు ఎందరో తమ వంతు సాయం చేశారు. అయితే సోనూ సూద్ ప్రత్యేకత ఎంతో ఉంది. కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు వరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి ముంబయిలోని తన హోటల్ ఇచ్చారు. లాక్ డౌన్ తో పనులు లేక పస్తులు ఉంటున్న మురికివాడల్లోని ప్రజలకు నిత్యం ఆహారం అందించారు. అంతేకాదు దేశం నలుమూలల్లో చిక్కుకున్న వలసకూలీలు తమ సొంత గూటికి చేరుకోవడానికి వందలాది కిలోమీటర్ల కాలినడక చూసి చలించి వారి కోసం ప్రత్యేకంగా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తన సొంత ఖర్చులతో వందలాది మందిని సొంతఊరికి చేరుకునేలా చేశారు. వారందరి మనసులో దేవుడయ్యారు.బతుకుదెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చి కాయకష్టం చేసుకుని బతుకుఈడ్చే వలస కార్మికులంటే అందరికే అలుసే. కానీ చివరి వలస కార్మికుడిని ఇంటికి పంపించేవరకు బాధ్యత తీసుకుంటాను అంటూ ఆయన ప్రకటించడం చూసి ఎందరో స్పందించారు. శభాష్ సోనూ అంటూ అభినందించారు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటుచేసిన ఘనత ఆయనదే. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేసే 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి సొంతఇంటికి చేరేవరకు సహాయం చేశారు.
అంతేకాదు విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశం తీసుకువచ్చేందుకు శాయశక్తులు ప్రయత్నాలు చేశారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్‌కేక్‌లోని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. విషయం సోనూ సూద్ దృష్టికి రావడంతో అక్కడి ప్రభుత్వం తో మాట్లాడి ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థులను భారత్ కు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. సోనూసూద్ సాయంతో తెలుగు విద్యార్థులు తమతమ ఇండ్లకు చేరుకున్నారు. తెలుగు విద్యార్థులకు తిరిగి స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి మనసున్న మహారాజుగా ప్రశంసలు అందుకున్నారు.
వలస కార్మికులను ఇండ్లకు చేర్చడంతోనే తన బాధ్యత తీరిందనుకోలేదు. ఇంటికి చేరుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నంలో బిజీగా మారారు సోనూసూద్. దాదాపు నాలుగువందల కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించే పనిలో నిమగ్నమయ్యారు.
వివిధ రాష్ట్రాల అధికారులతో మాట్లాడి చనిపోయిన వారి వివరాలను సేకరించారు. ఉపాధి కోల్పోయి.. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న పేద కుటుంబాల్లో పెద్దకొడుకుగా అండగా నిలుస్తున్నాడు.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా యాప్ ఏర్పాటుచేసి వారికి ఉద్యోగావకాశాలు కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సోనూ సూద్. 'ప్రవాసీ రోజ్‌గార్' పేరుతో రూపొందించిన ఈ ఉచిత ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాల కల్పనలో సహకారం అందించనున్నారు. దాదాపు 500 ప్రసిద్ధ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. దేశంలోని ప్రధాన నగరాల్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాలంటే కావల్సింది అధికారం కాదు ఆదుకునే గుణం
కష్టాల్లో ఉన్నవారిని అక్కున చేర్చుకోవాలంటే కావల్సింది డబ్బు మాత్రమే కాదు మీకు నేనున్నాను అని చెప్పే ధైర్యం
మంచి గుణం, అంతులేని ధైర్యం ఉన్న సోనూ సూద్ నిజంగా రియల్ హీరో... కాదని ఎవరైనా అనగలరా..