డ్రాగన్ కంట్రీ ఎత్తులకు కౌటిల్యతో చెక్
posted on Jul 27, 2020 @ 7:01PM
భారత్ చైనా సరిహద్దుల వెంట మోహరిస్తున్న చైనా సైన్యం కదలికలను మన దేశానికి చెందిన నిఘా ఉపగ్రహాం ఎమిశాట్ పసికట్టింది. జమ్ము సరిహద్దుల్లో ఒకవైపు సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూనే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో సైనిక దళాలను మోహరిస్తున్న డ్రాగన్ కంట్రీ కుటిల యత్నాలను భారతీయ నిఘా ఉపగ్రహాం గుర్తించింది.
భారత రక్షణ నివేదిక 2013-14లలో ప్రాజెక్టు కౌటిల్య గురించి వివరించారు. దేశ సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు గత సంవత్సరం ఏప్రిల్ 10 పీఎస్ఎల్వీ - సీ 45 రాకెట్ ద్వారా భారత ఉపరితల కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెట్టారు. భూమి ఉపరితలం నుండి 749 కిలోమీటర్ల కక్ష్యలో తిరిగే ఈ చిన్న ఉపగ్రహాన్ని ఇస్రో, డీఆర్‌డీవోలు సంయుక్తంగా తయారు చేశాయి. 436 కేజీల బరువు ఉండే అత్యంత శక్తివంతమైన ఎమిశాట్ ఈ ఉపగ్రహాం మనదేశ తొలి ఎలక్ట్రానిక్ నిఘా ఉపగ‌్రహాం. ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటెలిజనెన్స్ ప్యాకేజ్ కౌటిల్యను డీఆర్ డివో ఆపరేట్ చేస్తుంది. దేశ సరిహద్దుల వెంట నిఘా పెంచుతూ సరిహద్దుల్లోని శత్రుదేశాల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి సైనిక దళాలకు అందించేలా దీన్ని డిజైన్ చేశారు. తాజాగా చైనా, పాకిస్తాన్ లతో ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఎమిశాట్ సేకరించే ఆధారాలు అత్యంత కీలకంగా మారనున్నాయి.
టిబెట్ సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా సైనిక దళాల కదలికలు ఉన్నాయన్న అనుమానాలను కౌటిల్య తన నిఘా వ్యవస్థతో నిజమని గుర్తించింది. సైనిక దళాల ఉనికిని కౌటిల్య ట్రాక్ చేసింది. డ్రాగన్ కంట్రీ చడీచప్పుడు కాకుండా దేశ సరిహద్దులను సమీపిస్తుంది అన్న సమాచారాన్ని సైనిక దళాలకు అందించింది.
సరిహద్దుల్లో శత్రు దేశాల రాడార్ల వ్యవస్థను పసి గట్టి సరిహద్దుల్లో కదలికలను గురించిన వివరాలను కూడా ఇది చెప్పగలదు.