ప్రధాని మోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరస్థులు
posted on Sep 3, 2020 @ 9:45AM
ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను ఈ తెల్లవారుజామున సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా నిర్ధారించింది. narendramodi_in పేరుతొ ఉన్న ఈ అకౌంట్ ను గురువారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ అకౌంట్ నుండి వరుసగా రెండు ట్వీట్లు చేసి కలకలం రేపారు. మొదటి ట్వీట్ లో "కరోనా కట్టడి కోసం అందరూ ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు అదించండి. ఇండియాలో కూడా బిట్ కాయిన్ రూపంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ప్రారంభమయ్యాయి.'' అని మొదట ఓ ట్వీట్ చేశారు. ఇక రెండో ట్వీట్ లో ''అవును ఈ అకౌంట్ ను జాన్ విక్ బృందం హ్యాక్ చేసింది. మేమేమి పేటీఎం మాల్‌ను హ్యాక్ చేయలేదు.'' అని పేర్కొన్నారు. అయితే హ్యాకర్ల బారినపడిన narendramodi_in ట్విటర్ అకౌంట్ ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ కి సంబంధించినదే కానీ అది ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ కాదు. ఐతే దీనిపై వెంటనే దర్యాప్తు మొదలు పెట్టినట్లు ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు. హ్యాక్ అయిన మోదీ ఖాతాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన ట్విటర్ టీమ్ హ్యాకర్లు పెట్టిన ఆ రెండు ట్వీట్లను తొలగించింది. ప్రస్తుతం ఆ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకుంది.
గత జులైలో కూడా ఇలాగె ప్రపంచంలోని పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్‌కు గురవడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం మరింత కలకలం రేపుతోంది. జులైలో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్ కు గురయ్యాయి. అంతేకాకుండా ఆ మధ్య ఉబెర్, యాపిల్ కంపెనీలకు చెందిన అధికారిక అకౌంట్లు కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అయితే ఇలాంటి ఘటనలు వరుసగా జరగుతుండడంతో ట్విటర్ టెక్నికల్ టీమ్ దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టింది.