చైనా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అత్యవసరంగా తరలుతున్న బలగాలు
posted on Sep 2, 2020 @ 7:52PM
భారత చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. దీంతో సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తాజాగా హోం శాఖ భద్రతా బలగాలను ఆదేశించింది. భారత్ కు చైనా, నేపాల్, భూటాన్లతో గల సరిహద్దుల్లో భద్రతా బలగాలు హైఅలర్ట్ లో ఉండాలని హోం శాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మరీ ముఖ్యంగా చైనాకు ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో పెట్రోలింగ్, నిఘాను పెంచాలని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) కు, ఇండో టిబెటెన్ బోర్టర్ పోలీసు (ఐటీబీపీ) కి తాజాగా హోం శాఖ ఆదేశాలు జరీ చేసింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం సరిహద్దుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఐటీబీపీని హోం శాఖ ఆదేశించింది. దీనితో పాటు, ఇదే సమయంలో ఇండో-నేపాల్-చైనా ట్రై జంక్షన్, ఉత్తరాఖండ్‌లోని కాలాపాని ప్రాంతంలో కూడా తమ నిఘా పెంచాలని ఎస్ఎస్‌బీ, ఐటిబిపిలకు హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కాగా కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌బీకి చెందిన పలు కంపెనీల దళాలను భారత్ నేపాల్ సరిహద్దుకు తరలించారు. ఇంతకుముందు జమ్మూకశ్మీర్, ఢిల్లీలో మోహరించిన ఈ బలగాలను తాజాగా బోర్డర్ కు తరలించారు. అంతేకాకుండా ఎల్ఏసీ వెంట మన భూభాగంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న భద్రతా బలగాలను అక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ కదలవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. తాజాగా చైనా సరిహద్దు ప్రాంతాలను మార్చేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని "వ్యూహాత్మక ప్రదేశాల్లో" మన సైన్యాన్ని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ లేక్ చుట్టూ ఉన్న కీలక ప్రాంతాల్లో మరిన్ని అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఓ వైపు మిలటరీ చర్చలు జరుగుతుండగానే నిన్న(మంగళవారం) చైనా మరోసారి బోర్డర్ లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.