చిన్నారిని రక్షించేందుకు 241 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా పరిగెత్తిన రైలు..
posted on Oct 27, 2020 @ 10:38AM
ఒక చిన్నారిని కిడ్నాపర్ బారి నుండి కాపాడేందుకు ఆ రైలు ఏకంగా 241 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా పరుగులు పెట్టింది. ఇదేమి బాలీవుడ్ సినిమా క్లైమాక్స్ సీన్ కాదు.. నిజంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని లలిత్ పూర్ రైల్వే స్టేషన్ లోని రైల్వే పోలీసుల వద్దకు ఒక మహిళ పరుగుపరుగున వచ్చి తన కూతురు కనిపించడంలేదని.. ఎవరో అపహరించారని ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ లోని సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ చిన్నారిని తీసుకుని ఒక కిడ్నాపర్ రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు లో ఎక్కినట్లు గుర్తించారు. అయితే అప్పటికే ఆ రైలు స్టేషన్ నుండి బయలుదేరిపోయింది. దీంతో ఆ రైలును ఎక్కడైనా ఆపితే కిడ్నాపర్ తప్పించుకుపోయే అవకాశం ఉందని పోలీసులు తమ పై అధికారులకు అలాగే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఆ రైలును దారిలోని ఏ స్టేషన్ లోను ఆగకుండా క్లియరెన్స్ ఇస్తూ 241 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత భోపాల్ స్టేషన్ లో నిలిపివేశారు. ఐతే అప్పటికే స్టేషన్ లో భారీ ఎత్తున పోలీసులు ఆ రైలును రెండు వైపులా చుట్టుముట్టి కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకుని ఆ చిన్నారిని క్షేమంగా ఆమె తల్లికి అప్పగించారు. అయితే మధ్యలో ఉన్న స్టేషన్లలో ఆగకుండా రైలు వెళ్లిపోతుండడంతో ప్రయాణికులు భయపడి గందరగోళానికి గురయ్యారు. అయితే కిడ్నాపర్ ను పట్టుకోవడానికి రైల్వే అధికారులు.. పోలీసులు ఇంతటి సాహసం చేసారని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.