నితీశ్ కుమార్ పై చెప్పు! బీహార్ లో బ్యాడ్ పాలిటిక్స్
posted on Oct 27, 2020 @ 3:03PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు షాక్ తగిలింది. ముజఫర్ పూర్ లో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఎన్నికల ర్యాలీని ముగించుకుని హెలికాప్టర్ వద్దకు వస్తుండగా కొందరు నితీశ్ పై చెప్పులు విసిరారు. అయితే అవి ఆయనకు తగలలేదు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాయకులకు ఊహించని పరాభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచార సభల్లో నితీశ్ కుమార్ కు వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. దీంతో, నిరసనకారులపై నితీశ్ మండిపడుతున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ, ఓట్లు వేయకున్నా పర్వేదంటూ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బీహార్ లో సంచలనం రేపాయి.
బీహార్ లో ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఎన్డీఏ కూటమి తరపున సీఎం నితీశ్ కుమార్ తో పాటు బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఇక మహాకూటమి నుంచి ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. మూడు విడతల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.