ప్రచారంలో కనిపించని జోష్! దుబ్బాకలో 'చేతు'లెత్తేసినట్టేనా?
posted on Oct 27, 2020 @ 11:40AM
తెలంగాణలో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారిపోతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించినా.. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొది సీన్ మారిపోతోంది. త్రిముఖ పోరు కాస్త ఇప్పుడు హోరాహోరీ పోరుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక సమరంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా సిద్ధిపేట, దుబ్బాకలో హాట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. పోలీసుల సోదాలు, నేతల పరస్పర సవాళ్లతో నియోజకవర్గం హోరెత్తుతోంది. ఇంత జరుగుతున్నా ఎక్కడా కాంగ్రెస్ కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను కలవరపెడుతోంది. పీసీసీ ముఖ్య నేతలంతా ప్రచారం చేస్తున్నా హస్తం పార్టీలో జోష్ రాలేదని, ఉప ఎన్నిక రేస్ నుంచి పార్టీ త్పపుకున్నట్లేనన్న చర్చ దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతోంది.
నిజానికి దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకుంది. రాష్ట్ర కొత్త ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ కూడా దుబ్బాకనే మొదటి టార్గెట్ గా పెట్టుకున్నారు. విజయం కోసం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకే టికెటిచ్చారు. నియోజకవర్గంలో పట్టున్న చెరుకు చేరికతో కాంగ్రెస్ కు లాభిస్తుందని పీసీసీ పెద్దలు భావించారు. కాని ఫ్లీల్డ్ లో సీన్ మరోలా ఉంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా... ఆయన్ను జనాలు టీఆర్ఎస్ వ్యక్తిగానే భావిస్తున్నారట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మళ్లీ కారు ఎక్కరన్న గ్యారంటీ ఏంటనే చర్చ దుబ్బాక ప్రజల్లో జరుగుతుందట. బీజేపీ కూడా ఇదే ప్రచారం చేస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని కేసీఆరే కాంగ్రెస్ లో చేర్పించారని, ఆయన డైరెక్షన్ లోనే పోటీ చేస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చీల్చేందుకే గులాబీ బాస్ అలా ప్లాన్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది జనాల్లోకి బాగా వెళ్లిందని.. అందుకే చెరుకుకు దుబ్బాక ప్రజల నుంచి సపోర్ట్ లభించడం లేదని తెలుస్తోంది.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేరికతో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చెరుకుని చేర్చుకుని టికెట్ ఇవ్వడంతో... ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తున్న నేతలంతా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో చాలా మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అధికార పార్టీ నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు కొందరు నేతలు. అయితే నేతలందరిని కాదని చెరుకును చేర్చుకుని వెంటనే టికెట్ ఇవ్వడాన్ని దుబ్బాక కాంగ్రెస్ కేడర్ జీర్ణించుకోలేకపోతుందని తెలుస్తోంది.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేరికతో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీకు గుడ్ బై చెప్పేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన ఇద్దరు సీనియర్ నేతలు.. కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, బొంపల్లి మనోహర్ రావు గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మద్దల నాగేశ్వర్ రెడ్డి కూడా అధికార పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గంలో పేరున్న కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీని వీడారని చెబుతున్నారు. ద్వితియ శ్రేణి నేతలు కూడా కాంగ్రెస్ ను కాదని ఎవరి దారి వారు చూసుకున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సిరెడ్డి కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొనడం లేదని తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ యాక్టివ్ గా ఉండగా.. ఆయన వ్యతిరేక వర్గమంతా దుబ్బాక ఉప ఎన్నికను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కేడరే చెబుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారంలో ముఖ్య నేతలంతా పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డిలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. అయితే పార్టీ పెద్దలంతా ప్రచారానికి వస్తున్నా.. క్షేత్రస్థాయిలో వారికి సహకరించే లీడర్లు కాంగ్రెస్ కు కరువయ్యారని తెలుస్తోంది. ఎన్నికలు సభల, ర్యాలీలకు ఏర్పాట్లు చేసే నేతలు కూడా హస్తం పార్టీకి నియోజకవర్గంలో దొరకడం లేదట. దీంతో హైదరాబాద్ నుంచే వచ్చే నేతలే తమతో కొందరిని తీసుకుని వస్తున్నారంట. వారితోనే హడావుడి చేయిస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేసిన కొందరు నేతలు.. ఎంత చేసినా లాభం లేదనే నిర్ణయానికి వచ్చి మెక్కుబడి ప్రచారమే చేస్తున్నారని టాక్.
మొత్తానికి టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి సహకరించేందుకు దుబ్బాక కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తించాలని పీసీసీ ప్రయత్నిస్తున్నా.. లోకల్ సపోర్ట్ లేకపోవడంతో ఢీలా పడ్డారని చెబుతున్నారు. కేసీఆర్ ను ఓడించాలనే కసిగా ఉన్న కొందరు కార్యకర్తలు కూడా.. ఈసారికి బీజేపీకి ఓటు వేయాలని ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక రేసులో కాంగ్రెస్ చేతులెత్తిసినట్టేనన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతోంది.