చిన్న పిల్లలకు రక్షణే లేదా? మరో బాలుడు దారుణ హత్య
posted on Oct 26, 2020 @ 8:46PM
తెలంగాణలో మరో దారుణం జరిగింది. సంచలనం రేపిన మహబూబాబాద్ దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసు మరవకముందే మరో బాలుడి హత్యకు గురయ్యాడు. శామీర్ పేటలో పది రోజుల క్రితం మిస్సైన ఐదేండ్ల బాలుడు కేసు విషాదాంతమైంది. బాలుడి అదియాన్ డెడ్ బాడీని శామీర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ పక్కన గుర్తించారు పోలీసులు. బాలుడిని హత్య చేశారి అక్కడ పూడ్చి పెట్టారని పోలీసులు నిర్ధారించారు. శామీర్ పేట అవుటర్ రింగు రోడ్డు దగ్గర మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. ఆ డెడ్ బాడీని శామీర్‌పేటలో అదృశ్యమైన అదియాన్దిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోని తీసుకున్నారు.
శామీర్‌పేటకు చెందిన సయ్యద్ ఉసేన్, గౌజ్‌బీ మూడో కుమారుడు అథియాన్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 15న మధ్యాహ్న భోజనం అనంతరం ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు.
హత్యకు గురైన బాలుడు ఉంటున్న ఇంటి మరో పోర్షన్‌లో బిహార్‌కు చెందిన సోన్‌సోన్ద్ అద్దెకుంటున్నాడు. మూడు రోజుల క్రితం తాను దొంగలించిన మొబైల్‌తో ఇంటి యజమానికి ఫోన్ చేశాడు. రూ.15 లక్షలిస్తే బాలుడిని అప్పగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఇంటి యజమాని, బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా బాలుడిని చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు. బాలుడిని చంపి 11 రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.
తెలంగాణలో ఈ మధ్య కిడ్నాప్‌లు, హత్యల ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇటీవలే మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి గంట వ్యవధిలోనే హత్య చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి పోలీసులకే తెలియని టెక్నాలజీని వాడాడు. ఆ ఘటన మరవక ముందే ఐదేండ్ల బాలుడు హత్యకు గురి కావడం ఆందోళన కల్గిస్తోంది.
దీక్షిత్ రెడ్డి కేసులో కిడ్నాపర్లను గుర్తించడానికి పోలీసులు ఐదు రోజులు తీసుకోవడంపై ఆరోపణలు వచ్చాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్నా పోలీసులు ఫెయిలయ్యారని ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అధియాన్ కేసులోనూ పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. బాలుడు మిస్సై 10 రోజులైనా కేసును చేధించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసును సీరియస్‌గా తీసుకోకుండా అలసత్వం వహించడంతో ఈ ఘోరం జరిగిందని అధియాన్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాధితుడు ఉండ్లే ఇంట్లో కిరాయికి ఉంటున్న యువకుడు.. బాలుడ్ని కిడ్నాప్ చేశాడని తేలడంతో జనాలు ఫైరవుతున్నారు. మిస్సింగ్ కేసును విచారణ చేస్తున్న పోలీసులు... ఇంటి పక్కన వారిని ఎందుకు ప్రశ్నించకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది.