25 వేల కోట్ల రుణాలు.. మూడు రాజధానుల పుణ్యమా రోడ్డున పడే పరిస్థితి!!
ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. అన్ని సదుపాయాలు ఉండి, అన్నిటికి అనువైన మంచి రాజధాని ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరుగుతుంది. దాంతో రాజధానితో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆ ముందుచూపుతోనే రాష్ట్ర విభజన తరువాత అప్పటి ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రానికి కేంద్ర బిందువు, అన్ని వనరులు కలిగిన అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసింది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చి దిద్దాలని భావించింది. రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎందరో రైతులు వేల ఎకరాల భూములను త్యాగం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు, యూనివర్సిటీలు అమరావతి వైపు చూశాయి. అంతేకాదు, ఏపీలోని ఎందరో ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ రాష్ట్రం, తమ రాజధాని అన్న భావనతో బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు తీసుకొని పెట్టుబడులు పెట్టారు. రైతుల త్యాగం, ఔత్సాహిక వ్యాపారవేత్తల నమ్మకంతో కొన్నేళ్లలోనే అమరావతి విశ్వనగరంగా మారుతుందని.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని భావించారంతా. కానీ, ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం.. అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి నెట్టేసింది. అదే ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం.
మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. వచ్చిన కంపెనీలు తరలి వెళ్లిపోతున్నాయి.. కొత్త పెట్టుబడులు రావట్లేదు. ఆదాయం లేదు.. అప్పులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర పరిస్థితి ఏంటా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమ రాష్ట్రం, తమ రాజధాని అన్న భావనతో వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఎందరికో ఉపాధి కల్పిద్దామని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావించిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. తమ జీవితాన్ని నరకంలో పడేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఎందరో తమ ఆస్తులను తనఖా పెట్టి మరీ పెట్టుబడులు పెట్టారు. ఆస్తులు తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 25 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే, మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పుడు అమరావతి భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. నిర్మాణాలు ఆగిపోయాయి.. ఇప్పటికే సగం పెట్టుబడులు పెట్టి ఉండంతో.. వెనక్కి రాలేని, ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల భారం పెరుగుతోంది. ఆ విధంగా రాజధాని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలనుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పుణ్యమా అని రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.