అమిత్ షాతో జగన్ భేటి.. హైకోర్టును తరలించండి!!

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిశారు. పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించేలా సహకరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకి రూ.20,398 కోట్లు చాలవని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కూడా ఇదే చెప్పిందని తెలిపారు. 2017-18 ధరల సూచీని అనుసరించి సవరించిన అంచనాలు రూ.55,656 వేల కోట్లను ఆమోదించాలని, ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు సూచించాలని సీఎం కోరారు. 2005-06తో పోలిస్తే 2017-18నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందన్నారు. ముంపు బారినపడే ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్ల మేర రీయింబర్స్‌ చేయాల్సి ఉందని, 2018 డిసెంబర్‌ కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.    రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని సీఎం జగన్‌ తెలిపారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం , శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ గత ఆగస్టులో చట్టం కూడా చేశామని అమిత్‌షా దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టును కర్నూలుకు రీలొకేట్‌ చేసేలా నోటిఫికేషన్‌ జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. 2019లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు అంశం ఉందని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. హోదాతోనే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.   

తల్లిదండ్రుల ఫోటోలకు చెప్పులదండ వేసిన ప్రబుద్ధులు.. ఎక్కడంటే..  

కన్న కొడుకు చేతుల మీదుగా ప్రశాంతంగా వెళ్లిపోవాలని కోరుకునే తల్లిదండ్రులు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తారు. అదే సమయంలో కన్నవాళ్ళు బతికుండగానే అనాధలుగా ఏ రోడ్డు మీదో.. లేక వృద్ధుల ఆశ్రమాలలోనో వదిలివేసే పిల్లలు ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఆస్తి కోసం తల్లిదండ్రులకు బతికుండగానే నరకం చూపిస్తున్న పిల్లల గురించి కూడా మనం గతంలో విన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణ లో జరిగింది. ఆస్తి కోసం తమ కన్నతండ్రినే కిడ్నాప్ చేసిన ఘనులు వీళ్ళు. ఈ ఘటన సూర్యాపేటలోని భగత్ సింగ్ నగర్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న రిటైర్డ్ తహసీల్దార్ సంజీవరావుకు ఇద్దరు కుమారులు. వారు ఆయన పేరుమీదున్న ఐదు ఎకరాల భూమిని తమకు రాసివ్వాలని గత కొన్నిరోజులుగా ఆయనపై తీవ్ర వత్తిడి తెస్తున్నారు. అయినా తమ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో.. ఈరాజు ఉదయం అయన ఇంటికి వచ్చిన కుమారులు ఇద్దరూ.. తండ్రి సంజీవరావుతో గొడవపడ్డారు. ఆస్తి రాస్తావా చస్తావా అని ఆయనను తీవ్రంగా హింసించారు. అయితే మధ్యలో అడ్డు వచ్చిన కన్నతల్లిని కూడా పక్కకు తోసేశారు. కన్న కొడుకుల ప్రవర్తనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే ఎంత ప్రయత్నించినా.. సంజీవరావు ఆస్తి రాయకపోవడంతో... ఆయనను కుమారులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయారు. ఈ ఘటనతో షాక్ తిన్న తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తి కోసం తమ ఫొటోలకు కొడుకులు చెప్పుల దండ కూడా వేశారని సంజీవరావు భార్య వాపోయారు. ఇపుడు తమ కుమారుల నుంచి తన భర్తను కాపాడాలని ఆమె పోలీసులను వేడుకుంది.

'ట్విట్టర్ కిల్లర్' కు మరణశిక్ష విధించిన కోర్టు

జపాన్‌లో తకాహిరో షిరాయిషి(30) అనే ఓ సీరియల్ కిల్లర్ కు టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. ఇతడికి 'ట్విట్టర్ కిల్లర్' అని పేరుంది. ట్విట్టర్ లో ఆత్మహత్యకు సంబంధించిన పోస్టులు పెట్టే యువతే ఇతడి టార్గెట్. బాధను తనతో పంచుకోమంటూ మొదట ఫ్రెండ్ షిప్ చేస్తాడు. ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగిస్తాడు. ఆ తరువాత తన ఇంటికి రప్పించి వారిని హతమారుస్తాడు. వారి శరీరాన్ని ముక్కముక్కలు చేసి పైశాచిక ఆనందం పొందుతాడు. ఇలా ఏకంగా తొమ్మిది మందిని షిరాయిషి అంతమొందించాడు. వారిలో ఎనిమిది మంది అమ్మాయిలు, ఒక పురుషుడు ఉన్నారు. వారంతా 26 ఏళ్ల లోపు వారే. 2017లో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం.. అప్పట్లో జపాన్ లో సంచలనం సృష్టించింది.   కాగా, కోర్టులో వాదనల సందర్భంగా షిరాయిషి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. చనిపోయిన వారందరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారేనని, అందువల్ల షిరాయిషికి యావజ్జీవ శిక్ష విధించాలని, మరణశిక్షను తొలగించాలని విన్నవించాడు. అయితే కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. చనిపోయిన వారు ఎవరూ కూడా మరణించాలని కచ్చితంగా నిర్ణయించుకోలేదని, ఇతడికి మరణశిక్షే సరైదని తీర్పు వెలువరించింది. షిరాయిషికి టోక్యో కోర్టు మరణ శిక్ష విధించడంపై బాధితుల కుటుంబాలు హర్ష వ్యక్తం చేశాయి.

సీఎం కేసీఆర్ చెప్పినా దాడులు ఆగలేదు.. టీఆర్ఎస్ కి నష్టం త‌ప్ప‌దు

ప్ర‌భుత్వ విప్, పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల స‌మ‌స్య‌లు ప‌రిష్కాస్తామని చెప్పినందుకే తాను కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరాన‌ని అన్నారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల‌ను బతకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలపై అధికారులు దాడులు చేయ‌వ‌ద్ద‌ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినా దాడులు ఆగడం లేదని అన్నారు. పోడు ఉద్య‌మంలో తాము వెనుక‌డుగు వేసే ప్ర‌శ్నే లేద‌న్నారు. అట‌వీ భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని, ఆదేశాలివ్వాల‌ని కోరారు. లేదంటే ఆదివాసీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం త‌ప్ప‌ద‌ని రేగా కాంతారావు హెచ్చ‌రించారు.

సంక్షేమ పథకాలు రద్దు చేయాలి.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాల‌కు మంచి చేస్తే మ‌రిచిపోయే అల‌వాటు ఉందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరాలని ఉందని వ్యాఖ్యానించారు. జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 24 గంటల కరెంట్ కాకుండా.. కేవలం 3 లేదా 4 గంటల కరెంటు మాత్రమే ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ను కోరుతానని లక్ష్మారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న మేలు సామాన్య ప్రజలకు అర్థం కావడంలేదు. జనాన్ని మంచివారు అనాలో, అమాయకులు అనాలో తెలియడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ఇప్పుడు నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మ‌రో వివాదంలో మన్సాస్ చైర్ ప‌ర్స‌న్‌ సంచ‌యిత

మన్సాస్ చైర్ ప‌ర్స‌న్ సంచ‌యిత గ‌ణ‌ప‌తి రాజు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానానికి తాళాలు వేయ‌డం వివాదానికి దారి తీసింది. విద్యార్థులు, సిబ్బంది త‌ప్ప మిగిలిన వారు లోప‌లికి వెళ్ల‌కూడ‌దంటూ మ‌హ‌రాజా కాలేజీ ప్రిన్సిపాల్ నోటీసులు జారీ చేశారు. ఈ నిర్ణ‌యంపై స్థానికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఎన్నో ఏళ్లుగా క‌ళాశాల మైదానంలో న‌గ‌ర ప్ర‌జ‌లు వాకింగ్ చేస్తుండ‌గా, కొత్తగా ఇప్పుడు మైదానానికి తాళాలు వేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మన్సాస్ యాజ‌మాన్యం తీరుపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గన్నవరం వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం.. వల్లభనేనిపై తీవ్ర ఆరోపణలు

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా, గన్నవరంలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లుపై జోజిబాబు జోజిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, దళితులకు రావాల్సిన టెండర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని వల్లభనేని వంశీ, కోట్లు నాశనం చేస్తున్నారని.. వీరిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని జోజిబాబు డిమాండ్ చేశారు.

రజనీకాంత్ పార్టీ గుర్తు ఇదే..! 

తమిళనాడు రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు కావడంతో ఆయన పార్టీ పేరు, గుర్తుపై అటు తలైవా అభిమానుల్లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన పార్టీకి తాజాగా "మక్కల్ సేవై కట్చి" (ప్రజాసేవ పార్టీ) అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక పార్టీ గుర్తు విషయానికి వస్తే ఆయన నటించిన పాపులర్ చిత్రాల్లోని రజనీ స్టయిల్స్‌కు దగ్గరగా ఉండే గుర్తులను ఆ పార్టీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2015లో విడుదలైన 'బాబా' చిత్రంలో రజినీకాంత్ "టూ ఫింగర్" ఫోజ్‌ అప్పట్లో బాగా పాపులర్ అయింది. అయితే దీనికి ముందు 1995లో వచ్చిన "బాషా" లో ఆటోడ్రైవర్‌గా కనిపించారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే "టూ ఫింగర్", లేదంటే "ఆటో" గుర్తుల్లో ఏదో ఒక దానిని దక్కించుకోవాలని ఆ పార్టీ ఆశిస్తున్నట్టుగా సమాచారం. అయితే, ఈ రెండిట్లో రజినీ కొత్త పార్టీకి "ఆటో" గుర్తు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లలోనూ పోటీ పడాలని రజనీ ఇప్పటికే ప్లాన్‌గా కనిపిస్తోంది. దీంతో కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. జనవరిలో పార్టీని పెడుతున్నట్టు డిసెంబర్ 8న రజినీకాంత్ ప్రకటించారు.   రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా విజయం సాధిస్తాం. నిజాయితీ, పారదర్శకత, అవినీతి రహిత, కుల, మతాలతో ప్రమేయం లేని ఆధ్యాత్మిక రాజకీయాలను అందిస్తాం అని రజినీ కాంత్ ఇటీవల ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే అధికార అన్నాడీఎం బీజేపీతో పొత్తుతో 2021 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా, డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఈసారి కూడా కొననసాగనుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ ఎన్నికలకు ముందే జైలు నుంచి విడుదల కానున్నందున రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతాయో అనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. మరోపక్క ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇప్పటికే "మక్కల్ నీది మయ్యం" పార్టీ పెట్టి ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టేశారు. తాజా సమాచారం ప్రకారం కమల్ లాంచ్ చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీతో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ (ఎంఐఎం) పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

కర్ణాటక శాసనమండలిలో అరాచకం.. చైర్మన్ ను సీట్ లోంచి లాగి బయటకు తోసేసిన సభ్యులు  

కర్ణాటక శాసనమండలి సమావేశాలలో ఈరోజు తీవ్ర కలకలం రేగింది. శాసన మండలిలోనే సభ్యులు బాహాబాహీకి దిగారు. దీంతో అసలు శాసన మండలిలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, జేడీఎస్ పార్టీ‌లు కలిసి అక్రమంగా ఒకరిని ఛైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు సభ్యులు గొడవపడడం కలకలం రేపుతోంది. దీంతో కొందరు సభ్యులను మరికొందరు సభ్యులు బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో శాసన మండలి ఛైర్మన్ ను కుర్చీలోంచి లాగేసిన కాంగ్రెస్ సభ్యులు ఆయనను బలవంతంగా బయటకు పంపించారు. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. శాసన మండలిలో అధికార బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెక్నాలజీ పై అతిగా ఆధారపడితే చీకటే గతి ..

టెక్నాలజీ అభివృద్ధితో మనిషి కాలు బయట పెట్టకుండానే అన్నీ అతను కోరుకున్న చోటికే వచ్చి చేరుతున్నాయి. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో మనిషి కూర్చున్న చోటు నుండి కదలకుండానే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అదుపు చేయగలుగుతున్నాడు. అయితే ఇది కేవలం నాణానికి ఒక వైపు మాత్రమే. కానీ దీనికి మరో వైపు కూడా ఉంది.   అదేంటంటే.. నిన్న సోమవారం సాయంత్రం ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సేవలు కొంత సమయం నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో మనం నిత్యం ఉపయోగించే యూట్యూబ్‌తో పాటు జీమెయిల్, గూగుల్ వర్క్ స్పేస్, సెర్చ్ ఇంజిన్‌ తో సహా అన్నీ ఆగిపోయాయి. దీంతో కోట్లాది మంది యూజర్లు ఆ సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇదే సమయంలో గూగుల్ ప్లే, గూగుల్ మీట్, గూగుల్ క్లాస్‌రూమ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ హ్యాంగౌట్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డాక్స్‌లో కూడా సమస్యలు వచ్చాయి. అయితే ఒక గంట తర్వాత గూగుల్ ఈ సమస్యను పరిష్కరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.   అయితే గూగుల్ సేవలు నిలిచిపోయిన టైం లో సమస్య తీవ్రత ఎలా ఉందొ తెలియ చేస్తూ ట్విట్టర్‌లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్ తాజాగా విపరీతంగా వైరల్ అయ్యింది. "గూగుల్ సేవలలో అంతరాయం ఏర్పడినప్పుడు నా ఇంట్లో చీకటి ఏర్పడింది. దీంతో నేను చీకట్లో ఉండి పోవాల్సి వచ్చింది" అని ఆ యూజర్ కాప్షన్ పెట్టాడు. అదేంటి గూగుల్ సేవలు నిలిచిపోతే ఇంట్లో చీకటి ఉండడమేమిటి అని మనకు అనుమానం రావచ్చు.   ఇప్పటికే చాలామంది ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ గూగుల్ అసిస్టెంట్‌తో కనెక్ట్ అయి ఉన్నాయి. అలా కనెక్ట్ చేయించుకున్న వారు... తమ ఇంట్లో లైట్లు వెలగాలన్నా, ఏసీ ఆన్ అవ్వాలన్నా... అన్నీ గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఆ పని చేయించుకుంటున్నారు. దీనికోసం కొన్ని రకాల గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఒక వేళ గూగుల్ ప్లే స్టోర్ పనిచెయ్యకపోతే... ఈ యాప్స్ కూడా పనిచెయ్యవు. దాంతో... ఇళ్లలో దీనిపై ఆధారపడి పనిచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పనిచేయవు. ప్రతి పనికి టెక్నాలజీపై ఆధార పడటం అంత మంచిది కాదని ఎపుడో పెద్దలు చెప్పిన మాట నిజమవుతోంది అంటున్నారు అనుభవజ్ఞులు.   తాజాగా బ్రౌన్ అనే ఆ యూజర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను గూగుల్ హోమ్ (Google Home) వాడుతున్నట్లు తెలిపాడు. ఇదో ఒక రకమైన ఫస్ట్ జనరేషన్ స్మార్ట్ స్పీకర్. ఇది గూగుల్ అసిస్టెంట్‌ వాయిస్ ద్వారా కంట్రోల్ అవుతుంది. దీన్ని వాడే వారు దీనికి ఏం ఆర్డర్ ఇస్తే... స్పీకర్ ద్వారా ఆపని చేసి పెడుతుంది. మనకు కావలసిన వాతావరణ వివరాలు చెబుతుంది. ఆన్‌లైన్‌లో వస్తువులకు ఆర్డర్ ప్లేస్ చేస్తుంది, లైట్లను వేయడం, తీయడం.. లాంటివి చాలా చెయ్యగలదు.   ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యే వస్తువులన్నింటినీ గూగుల్ హోమ్ కనెక్ట్ చేసుకోగలదు. ఇది గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ తీసుకుని పనిచేస్తుంది. అయితే గూగుల్ సర్వీసులు ఆగినప్పుడు మాత్రం గూగుల్ హోమ్ కూడా ఆగిపోయింది. దీంతో... బ్రౌన్ ఇంట్లో లైట్లు కూడా వెలిగే పరిస్థితి లేకుండా పోయింది.   బ్రౌన్ గూగుల్ పై ఆధారపడకుండా ఉండి ఉంటే... తన ఇంట్లో లైట్లను తానే ఆన్ చేసుకుని, తానే ఆఫ్ చేసుకునేవాడు. గూగుల్ సర్వీసులను వాడుకోవడం వల్ల అవి ఆగిపోయే సరికి... ఇంట్లో లైట్లు కూడా వెలిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా ప్రతి పనికి స్మార్ట్ వస్తువులతో కనెక్ట్ చేసుకునేవారికి ఇదో పెద్ద హెచ్చరికే అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. మనిషి సౌకర్యం కోసం టెక్నాలజీని వాడటం మంచిదే కానీ... అది లేకపోతే పూర్తిగా పనులు ఆగిపోయేలా దానిపై ఆధారపడ వద్దంటున్నారు. కనీసం స్విచ్చులు, లైట్ల వంటివైనా సొంతంగా వేసుకోమని వారు సూచిస్తున్నారు. దీనివల్ల మనకు కొంత వ్యాయామం కూడా అవుతుందని... మన ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెపుతున్నారు. టెక్నాలజీపై ఇంతగా ఆధారపడిన బ్రౌన్ వంటివాళ్ళు ఈ విషయంపై మరోసారి ఆలోచించుకోవాలని నెటిజన్లు చెప్పడం వెనక ఉద్దేశం కూడా ఇదే. గూగుల్‌‍లో ఒక గంటపాటు వచ్చిన ఓ చిన్న టెక్నికల్ ప్రోబ్లం.. ఇంత పెద్ద సమస్యకు కారణమైంది. అయితే సర్వీసులు త్వరగానే తిరిగి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సరిపోయింది.. అదే కొన్ని గంటలపాటు సర్వీసులు నిలిచిపోతే ఎంత ఇబ్బంది అవుతుందో ఊహించడం కూడా కష్టమే అని అంటున్నారు నిపుణులు.  

ముఖ్య సలహాదారుగా నీలం సహాని!!

త్వరలో ముఖ్య సలహాదారు పోస్టును కొత్తగా సృష్టించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్‍. ఆ పోస్టులో ఎవరిని నియమిస్తారు అనే విషయం తెలుసుకోవాలని ఉందా…డిసెంబరు మాసాంతానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని రిటైర్డు కాబోతున్నారు. ఆమెను ముఖ్య సలహాదారు పోస్టులో నియమించేందుకు ముఖ్యమంత్రి జగన్‍ నిర్ణయం తీసుకున్నారట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానిని నియమించే ముందు తనకు ఆరు నెలలు సర్వీసు మాత్రమే ఉందని.. మరో ఆరు నెలలు సర్వీసు పొడిగింపు ఇవ్వాలని.. కోరినట్లు.. అందుకు జగన్‍ అంగీకరించినట్లు ప్రచారం అయింది. చివరకు ఆ ప్రచారమే వాస్తవం అయింది. నీలం సహాని సర్వీసు నుండి రిటైర్డు అయ్యాక కూడా మరో ఆరు నెలలు ఆమె సర్వీసు పొడిగింపుకు ముఖ్యమంత్రి జగన్‍ చేసిన సిపార్సును కేంద్రం అంగీకరించటం జరిగింది.

మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా

తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ‌కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సోమవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. తనకు ఫోన్ చేయడానికి కానీ.. కలుసుకోవడానికి కానీ ప్రయత్నించవద్దని తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను  హోం ఐసోలేషన్‌లోని ఉన్నానని, ఎవరు ఆందోళన చెందాల్సి పనిలేదన్నారు.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీపై ఊహాగానాలు నిజమేనా..! 

ఏపీ హైకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు తీర్పులు వచ్చిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనాల ముందు పలు కేసుల పై విచారణ కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ జేకే మహేశ్వరీ బదిలీ కానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై బుధ, గురు వారాలలో ఒక ప్రకటన వెలువడవచ్చని ఆ వార్తల సారాంశం. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ను అర్ధంతరంగా తొలగించడం వరకు ఏపీ సర్కారు తీసుకున్న అనేక చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఏపీ హైకోర్టు సిజి జస్టిస్‌ జేకే మహేశ్వరి బదిలీ పై నారాయణ మాట్లాడుతూ "ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరిని బదిలీ చేయించడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సీఎం జగన్ ఈ విషయంపై కేంద్రంలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇదే విషయం పై త్వరలో ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలను కూడా కలవనున్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ బదిలీ వ్యవహారం పై ప్రజలలో పలు అనుమానాలతో పాటు ఈ విషయం పై ఉత్కంఠ కూడా నెలకొంది.

తిరుపతిలో బీజేపీ పంచతంత్రం! ఏపీలో అధికారం దిశగా శంఖారావం

తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక విజయంతో తెలంగాణలో కమలం దూకుడప పెంచింది. దుబ్బాక జోష్ తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెమటలు పట్టించి అనూహ్యా  ఫలితాలు సాధించింది.  రెండు వరుస విజయాలతో ఇప్పుడు తెలంగాణలో కమలదళం బలమైన శక్తిగా అవతరించింది. వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పార్టీ బలోపేతానికి స్కెచ్ వేస్తోంది బీజేపీ. అక్కడ దుబ్బాక విజయాన్ని తమ జైత్రయాత్రకు పునాదిగా వేసుకోగా..  ఏపీలో  తిరుపతిని అందుకు వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో త్వరలో జరగనున్న లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఏపీలో అధికారం దిశగా తొలి అడుగు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే తిరుపతి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు.. గెలుపే లక్ష్యంగా పంచ తంత్రాన్ని రచించారని చెబుతున్నారు.    తిరుపతి ఉప ఎన్నికలో గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రేటర్ రాయలసీమ డిమాండ్ వినిపించింది. రాష్ట్ర విభజన తర్వాత తాజాగా మళ్లీ ఆ నినాదం తెరపైకి వచ్చింది. ఇటీవల జరిగిన గ్రేటర్ రాయలసీమ పుస్తకావిష్కరణలో మళ్లీ సీమ నేతలంతా తమ వాయిస్ ను మరోసారి గట్టిగా వినిపించారు. తెలంగాణ ప్రజలను ఆదర్శంగా తీసుకొని గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమించాలని  పిలుపునిచ్చారు. దీన్నే ఇప్పుడు అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. నిజానికి రాయలసీమ గురించి ఉమ్మడి ఏపీలోనే బీజేపీ గట్టిగా మాట్లాడింది. కర్నూల్ లో హైకోర్టు పెట్టాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ తెరపైకి రావడంతో.. రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలనాధులు ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ రాయలసీమకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని చెప్పడం ద్వారా సెంటిమెంట్ రగిలించి.. దాన్ని తిరుపతి ఉప ఎన్నికలో క్యాష్ చేసుకోవాలని కార్యాచరణ సిద్ధం చేశారని చెబుతున్నారు. ఇది బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   ఎక్కడ ఎన్నికలున్నా బీజేపీ ఎక్కువగా వినిపించేది హిందుత్వ నినాదమే. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ హిందుత్వ కార్డును బలంగా ఉపయోగించాలని కాషాయ పార్టీ నిర్ణయించిందని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చాకా హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీటీడీ, విజయవాడ కనకదర్గ వంటి ప్రముఖల ఆలయాల్లోనూ వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో జగన్ డిక్లరేషన్ అంశం పెద్ద దుమారమే రేపింది. క్రైస్టవ ప్రచారాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక క్రైస్తవ పాస్టర్లకు జగన్ ప్రభుత్వం భృతి ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూ సాంప్రదాయాలు మంటగలిపేలా కావాలనే కొందరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.   ఇవన్ని ఇలా ఉండగానే  విజయవాడ మూడో పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు జరపడం రచ్చగా మారింది.  పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి  శాంటాక్లాజ్ టోపీలు ధరించడం  తీవ్ర కలకలం రేపుతోంది. వీటన్నింటిని తమ ప్రచారాస్త్రాలుగా మార్చుకుని ప్రజలను తమవైపు తిప్పుకోవాలని ఏపీ బీజేపీ నేతలు ప్రణాళికలు రచించారని చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీ జీవీఎల్ హాట్ కామెంట్స్ చేసి రాజకీయ హీట్ పుట్టించారు. తెలంగాణ బండి సంజయ్ చేసిన కామెంట్ల తరహాలోనే సర్జికల్ స్ట్రైక్ ప్రకటన చేశారు.  తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని జీవీఎల్  అన్నారు.  ఏపీలో మత రాజకీయాలు చేయడంలో పోటీ పడుతున్న వైసీపీ, టీడీపీలపై రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.    తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు అదనపు బలం కానుంది. ముఖ్యంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చరిష్మా బాగా కలిసివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలో పవన్ కు భారీగా అభిమానులున్నారు. పవన్ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే తిరుపతిలో పవన్ తో విస్త్రతంగా ప్రచారం చేయించేలా కమలం నేతలు రోడ్ మ్యాప్ తయారు చేశారని తెలుస్తోంది. పవన్ తో వీలైనన్ని ఎక్కువ సభలు పెట్టించి.. ఆయన అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గ ఓట్లన్ని గంపగుత్తగా కమలానికి మళ్లేలా పావులు కదుపుతున్నారని సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా పవనే ఉండనున్నారని, అందుకు గబ్బర్ సింగ్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీకి బాగా కలిసి రావచ్చనే అభిప్రాయం రాజకీయ అనలిస్టులు కూడా వ్యక్తం చేస్తున్నారు.    తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాస్ ఉంటారని చెబుతున్నారు. దాసరి ఎంపికలోనూ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన దాసరి శ్రీనివాసులు.. తిరుపతి అభివృద్ధికి బాగా కష్టపడ్డారనే టాక్ ఉంది. తిరుపతిలోని శ్రీసిటి, మీనాక్షి సెజ్ లకు అనుమతులు, భూసేకరణ విషయాల్లో శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారట. ఆ సెజ్ లతో తిరుపతి పరిసర గ్రామాల్లోని యువతకు భారీగా ఉపాధి దొరికింది. దాసరి శ్రీనివాస్ కు తిరుపతి ఏరియాలో మంచి పరిచయాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు తిరుపతి ఎంపీ పరిధిలోనే కృష్టపోర్టు ప్రాంతం కూడా వస్తోంది.  కృష్ణపోర్టు ఏర్పాటులో కూడా దాసరి శ్రీనివాసే ప్రధాన పాత్ర పోషించారట. ఇది కూడా తమకు కలిసివస్తుందని కమలనాధులు అంచనా వేస్తున్నారు. దాసరి శ్రీనివాస్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. తిరుపతి పరిధిలో ఆ వర్గ ఓట్లే ఎక్కువగా  ఉన్నాయంటున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే బీజేపీ హైకమాండ్ దాసరి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. దాసరిని ఎంపిక చేస్తే బీజేపీకి మరింత ప్లస్ అవుతుందనే ప్రచారం తిరుపతి నియోజకవర్గంలో జరుగుతోంది.    చివరి అస్త్రంగా వలసలను ప్రోత్సహిస్తోంది బీజేపీ. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోని అసమ్మతి నేతలను గుర్తించి వారికి వల వేస్తోంది. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ కు చెందిన 15 మంది మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. త్వరలోనే మరికొందరు కమలం గూటికి చేరుతారని చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వలసల బాధ్యతలను ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి బీజేపీ హైకమాండ్ అప్పగించిందట. జిల్లాలో బలమైన నేతగా ఉన్న వాకాటి... ఇప్పటికే వైసీపీ, టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే లోపే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. రెండు పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.    మొత్తంగా పంచతంత్రంతో  తిరుపతిలో గెలిచి.. ఏపీలో అధికారం దిశగా పావులు కదపాలని బీజేపీ పక్కా వ్యూహాలు సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఇవన్ని వర్కవుట్ అయితే మాత్రం తిరుపతి లోక్ సభను కమలం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులుచెబుతున్నారు. బీజేపీ ఎక్కడైనా గెలవాలని స్కెచ్ వేస్తే సాధించే వరకు విశ్రమించదనే టాక్ ఉంది. అయితే తిరుపతిలో అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి మరీ..

పథకాలకు పేర్లే కాదు పాలన కూడా సేమ్! సీఎం జగన్ తీరుపై జనాల్లో చర్చ

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అంతా వైఎస్సార్ నామ జపమే వినిపిస్తోంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన పథకాలన్నింటికి వైఎస్సార్ పేరే పెట్టారు. పెన్షన్ పథకం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నింటికి అదే పేరు. ప్రభుత్వ పథకాల పేర్లపై  జనాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సర్కార్ పథకాలకు పేరు పెట్టడం కాదు పాలనంతా గతంలో వైఎస్సార్ హయాంలో జరిగినట్లుగా చేయాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన మైనింగ్ స్కాంలో అరెస్టై జైలుకు వెళ్లిన సీనియర్ ఐఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకురావడం,  ఈ నెలాఖారులో పదవి విరమణ చేయనున్న నీలం సాహ్నీ స్థానంలో  తదుపరి సీఎస్ గా ఆదిత్యనాథ్‌ దాస్‌ ను నియమించాలని నిర్ణయించడాన్ని అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.    వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకే జగన్ కీలక పోస్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి.  గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్.. గతంలో  తన తండ్రి దగ్గర  పనిచేసిన పలువురు అధికారులను తెచ్చిపెట్టుకున్నారు. సీనియర్లను కాదని కొందరు జూనియర్లకు కీలక పోస్టులు కట్టబెట్టారు. ఇదే కోవలో తనకూ అవకాశం దక్కుతుందని సీనియర్ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కేంద్రం ఆమెను డిప్యుటేషన్‌పై ఏపీకి పెంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్ధాయి అధికారుల డిప్యుటేషన్ కుదరదని చెప్పేసింది.  సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో  ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ క్యాడర్‌లోనే పనిచేయాల్సి వచ్చింది. చివరకు క్యాట్ ను ఆశ్రయించి అనుకున్నది సాధించారు శ్రీలక్ష్మి. క్యాట్ అదేశాలతో ఆమె ఏపీకి బదిలీ అయ్యారు. శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చేందుకు  జగన్  ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖను అనుమతి కోరింది. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పోస్టింగ్ ఇవ్వనున్నారు.    వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో ఆమె ఆరోగ్యం క్షిణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగాయి. గతంలో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన అధికారి కోసం జగన్ సర్కార్.. కేంద్రం దగ్గర లాబీయింగ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే గతంలో తన తండ్రికి నమ్మినబంటుగా పని చేసిన అధికారి కాబట్టే జగన్ ఇంతగా పట్టుబట్టారని చెబుతున్నారు. తన ప్రభుత్వంలోనూ  శ్రీలక్ష్మికి జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు.    ఏపీ రాష్ట్ర ప్రస్తుత  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆమె తరువాత సీఎస్‌ గా 1987వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను ముందుగా సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు సమాచారం. నెలాఖరు వరకూ అయన ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సంప్రదాయం కేంద్ర సర్వీసుల్లో ఇప్పటికే ఉంది. నిజానికి  నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు. వీరిలో అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి సతీష్‌ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. ఆయనను సీఎస్‌ గా చేయడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.  మరో అధికారి జేఎస్వీ ప్రసాద్‌పై కూడా సీఎంకు సదభిప్రాయం లేదని తెలుస్తోంది.    ప్రస్తుతం సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్న నీరబ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే నీరబ్‌కు 2024 జూన్‌ వరకూ పదవీకాలం ఉంది. అంటే మూడున్నర ఏండ్లు ఆయనే సీఎస్. అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్‌ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అంతేకాదు జగన్ కు మొదటి నుంచి ఆధిత్యనాథ్ నమ్మకస్తుడిగా ఉన్నారు. అందుకే జగన్ కూడా  ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. సీఎంవోలోనూ చోటు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఆదిత్యనాథ్ దాస్ ను సీఎస్ గా నియమించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా వైఎస్సార్ తరహాలోనే జగన్ పాలనలో ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై మరో చర్చ జరుగుతోంది. వైఎస్సార్ హయాంలో అవినీతి అరోపణలు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యత ఇస్తే జనాల్లోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

తప్పు చేస్తే కాలర్‌ పట్టుకుని నడిబజారులో నిలబెడతా! పార్టీ కార్పొరేటర్లకు అక్బర్ వార్నింగ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ  కార్పొరేటర్లకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కార్పొరేటర్ పదవిని అడ్డుపెట్టుకుని ఎవరినైనా వేధింపులకు గురి చేస్తే ఊరుకోబోనని చెప్పారు. డబ్బు వసూలు చేయడం వంటి పనులు చేస్తే కాలర్ పట్టుకుని నడి బజారులో నిలబెడతానని అక్బర్ హెచ్చరించారు. కార్పొరేటర్లుగా ఎన్నికైన అందరూ కూడా ప్రజాసేవ చేయడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించాలని చెప్పారు అక్బరుద్దీన్ ఒవైసీ. అధికారం ఉంది కదా అని ప్రజలను వేధించొద్దని సూచించారు.    కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలతో హఫీజ్ బాబా నగర్ లోని  ఫలక్ ప్యాలస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను అక్బరుద్దీన్ ఒవైసీ సన్మానించారు. చాంద్రాయణగుట్ట ప్రాంతం తన రక్తం చిందిన నేల అని అన్నారు అక్బర్. ఈ ప్రాంతంపై తనకు ఎంతో ప్రేమ, మక్కువ ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతం తన ప్రాణం, తన శ్వాస అని తెలిపారు. అలాంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను కలిగించినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

నయీం కేసు మళ్లీ తెరపైకి      

కరుడు గట్టిన నేరస్తుడు నయీం కేసుపై సమగ్రమైన విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ డిమాండ్ చేసింది. రాష్ట్ర గవర్నెర్స్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ 2016 ఆగస్టు 8న నయీం ఎన్‌కౌంటర్‌లో మరణించి నాలుగేళ్లు గడిచినా కేసు విచారణను సమగ్రంగా దర్యాప్తు నిర్వహించడంలో సిట్ విఫలమైందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ తర్వాత నయీం ఇంట్లో లభ్యమైన వస్తువుల వివరాలను అందజేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ సిట్ ను కోరగా, సిట్ సోమవారం వివరాలను అందజేసింది. ఈ సందర్భంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ నయీం కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడంలో ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) విఫలమైనట్టు విమర్శించారు.   ఒక సామాన్య పౌరుడికి ఆత్మ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ కావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకుని ఉంటుందన్నారు. అలాంటిది నయీంకు 24 తుపాకులకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటిలో 3 ఏకే-47 తో పాటు ఒక స్టెన్‌గన్ ఉండటం మరింత భయాందోళన కలిగిస్తోందని అన్నారు. సామాన్యులు భూమి కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆధార్, పాన్ కార్డు, లింకు డాక్యుమెంట్లు, ఫోటోతో సహా వేలిముద్రలు తదితర పత్రాలను సమర్పించాల్సి వస్తోంది. కానీ, అవేమీ లేకుండా నయీంకు 752 రిజిస్ట్రేషన్లు ఎలా సాధ్యం అయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల ఎకరాలకు సంబంధించిన దాదాపు 752 రిజిస్ట్రేషన్ దస్తావేజులు లభ్యం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. నయీం ఇంట్లో 602 సెల్ ఫోన్లు లభ్యం కావడంతో వీటన్నింటీ మంజూరు వ్యవహారంలో కచ్చితంగా నయీంకు పోలీసులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఇతర ప్రభుత్వ అధికారుల, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే విషయాన్నిఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆసక్తి రేపుతున్న ఢిల్లీ పయనం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిందో లేదో... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్న ఆయన..సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు ఏపీ సీఎం. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే కేంద్రానికి లేఖరాసిన సీఎం జగన్.. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాను కలవబోతున్నారు. రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ముగిసే వెంటనే.. ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన వ్యాఖ్యలకు కట్టుబడిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే అంశంలో రెండో అభిప్రాయం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని తాము మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు చెప్పిన విషయాన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ నేడు రాష్ట్ర హైకోర్టును కోరారు. దీనిపై తీవ్రంగా మండిపడిన రాష్ట్ర హైకోర్టు, ఈ విషయంలో తమ వ్యాఖ్యల నుంచి వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ స్పష్టం చేయడంతో తాము సుప్రీంకోర్టుకు వెళతామని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. హైకోర్టు ధర్మాసనం తన వాదన వినకుండానే వ్యాఖ్యానాలు చేసిందని ఆయన ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు వ్యాఖ్యానించడం కోర్టు పరిధిలోకి రాదని కూడా ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ల నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాల సందర్భంగా జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.