ఉస్మానియా క్యాంపస్ లో అలజడి! కేసీఆర్ సర్కార్ పై ఇక తిరుగుబాటే?
posted on Dec 17, 2020 @ 5:22PM
ఉస్మానియా యూనివర్శిటి.. ఈ పేరే ఓ వైబ్రేషన్.. పోరాటాల గడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధాన మెట్టు. ఉస్మానియా సమర నినాదమే తెలంగాణలో పార్టీలకతీతంగా నేతలను ఏకం చేసింది. ఉస్మానియా విద్యార్థుల వీర గర్జనే ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. దశాబ్దాలప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసింది. ఉస్మానియా యూనివర్శిటి లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదంటే అతిశయోక్తి కాదు. సిద్ధిపేట నుంచి ఆమరణ దీక్ష కోసం కరీంనగర్ వెళుతున్న కేసీఆర్ ను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడే నిమ్మరసం తాగి దీక్ష విరమించారు కేసీఆర్. అయితే కేసీఆర్ తీరుపై ఉస్మానియా భగ్గుమనడంతో ఆయన మాట మార్చారు. మళ్లీ దీక్ష కొనసాగించారు. అప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఎదురు తిరగకపోతే కేసీఆర్ దీక్ష చేసే వారే కాదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఉండేది కాదని చెబుతారు.
విద్యార్థి ఉద్యమ కేంద్రంగా అంతర్జాతీయంగా పేరున్న ఉస్మానియా యూనివర్శిటీలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది. ప్రశ్నించే ప్రాంతంగా పేరున్న క్యాంపస్ లో ఇప్పుడు ప్రశ్నించడమే పాపంగా మారింది. విద్యార్థుల త్యాగాలతో సిద్దించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎలగబడుతున్న టీఆర్ఎస్ పార్టీ.. ఉస్మానియా వర్శిటిలో నిర్బంధం అమలు చేస్తోంది. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తోంది. సమైక్య రాష్ట్రంలోనూ ఉస్మానియా క్యాంపస్ లో స్వేచ్చగా తిరిగిన విద్యార్థులు... తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భయంభయంగా కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అధికార పార్టీ నేత అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి సురేష్ యాదవ్ అనే విద్యార్థి నాయకుడిపై దాడి జరగడంకలకలం రేపుతోంది. . టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఛానల్ డిబేట్‌లో మాట్లాడినందుకే అతనిపై దాడి చేశారని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేత , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం రాత్రి 11:30లకు తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ నేత సురేష్ యాదవ్ రాత్రి భోజనం చేసి రూమ్‌లో పడుకునే సమయంలో సుమారు 20 మంది మారణాయుధాలతో అతనిపై దాడిచేశారు. వారి నుంచి తప్పించుకున్న సురేష్ యాదవ్.. ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను కొట్టడానికి 20 మంది రావడంతో రూమ్ నుంచి బయటకు వచ్చి రీసెర్చ్ సెంటర్ వద్ద చెట్లల్లో దాక్కున్నానని సురేష్ యాదవ్ చెప్పారు. విద్యార్ధి సమస్యలపై ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని.. మా బాల్కసుమన్ అన్ననే కాదు.. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతాం అనుకుంటూ రూమ్‌లోకి బీర్ సీసాలు విసురుకుంటూ వెళ్లిపోయారని తెలిపారు. వారంతా వెళ్లిపోయిన తర్వాత ఉస్మానియా క్యాంపస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిపై ఫిర్యాదు చేశానని, తనకు ఎమ్మెల్యే బాల్క సుమన్ నుంచి ప్రాణ హాని ఉందని సురేష్ యాదవ్ వాపోయారు. తనపై దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని సురేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థి నేత సురేష్ యాదవ్‌పై జరిగిన దాడి ఉస్మానియా యూనివర్శిటీలో ప్రకంపనలు రేపుతోంది. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ కొంత కాలంగా సురేష్ యాదవ్ పోరాడుతున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వివిధ న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న చర్చా కార్యాక్రమాల్లో పాల్గొంటూ కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు. ఇదే అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారిందంటున్నారు. ప్రశ్నించే గొంతుకను నులిమివేయాలని ఉద్దేశ్యంతోనే అతనిపై దాడి చేశారని ఓయూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉస్మానియా విద్యార్థి నేతగానే ఎదిగారు బాల్క సుమన్. ఉస్మానియా విద్యార్థుల మద్దతుతోనే ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచారు. బాల్క సుమన్ కు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు వచ్చాయంటే అది ఉస్మానియా యూనివర్శిటీ పెట్టిన బిక్షేనని విద్యార్ఖులు చెబుతున్నారు. అలాంటిది ఉద్యమ నేతగా ఎదిగి రాజకీయ పదవులు అనుభవిస్తున్న బాల్క సుమన్ ... విద్యార్థి నేతపై దాడి చేయించడంపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ యాదవ్ పై దాడి చేసిన దుంగులను వెంటనే శిక్షించాలని, ఎమ్మెల్యే బాల్క సుమన్ పైనా కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థి నాయకుడు సురేష్ యాదవ్ పై జరిగిన దాడిని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు క్యాంపస్ కు వెళ్లి బాధిత విద్యార్థిని పరామర్శించారు. టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాదిగ కూడా దాడిని ఖండించారు. కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై సురేష్ యాదవ్ మొదటి నుంచి పోరాడుతున్నారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని టీఆర్ఎస్ తొత్తులు కొందరు సురేష్ యాదవ్‌పై దాడి చేశారని ఆరోపించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాబందుల రాజ్యంలో ఉన్నమా అని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. తక్షణమే బాల్కసుమన్ అనుచరులను అరెస్టు చేయాలి అని ఆయన డిమాండు చేశారు.
విద్యార్థి నేత, ప్రశ్నించే గొంతుకగా మారిన సురేష్ యాదవ్ పై జరిగిన దాడితో ఉస్మానియా యూనివర్శిటి నివురు గప్పిన నిప్పులా మారింది. దాడికి పాల్పడిన అధికార పార్టీ నేత అనుచరులను అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓయూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో క్యాంపస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కేసీఆర్ సర్కార్ పై ఓయూ విద్యార్థులు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారనే సమాచారం వస్తోంది. దీంతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంతో దద్దరిల్లిన ఉస్మానియా గడ్డ.. కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి వేదిక కానుందని తెలుస్తోంది. క్యాంపస్ లో తాజాగా జరుగుతున్న ఘటనలతో ఓయూ విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు ఓయూ స్టూడెంట్స్.