సీనియర్ అధికారులపై నిఘా! సీఎస్ పై తిరుగుబాటు మొదలైందా?
posted on Dec 18, 2020 @ 10:47AM
తెలంగాణ సచివాలయంలో కోల్డ్ వార్ నడుస్తోందా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీనియర్ అధికారులు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఐఏఎస్ ల మధ్య కొట్లాటతో పాలన పడకేసిందా? తెలంగాణ సచివాలయంలో జరుగుతున్న పరిణామాలతో అందరికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రం సచివాలయం. అలాంటి సచివాలయంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ కు సీనియర్ ఐఏఎస్ లకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సచివాలయం రాక పోవడంతో సీఎస్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం తరహాలోనే సీఎస్ సచివాలయంలో సమాంతర వ్యవస్థను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది నచ్చని కొందరు అధికారులు ఆయన్ను ప్రశ్నించారని, దీంతో విభేదాలు పెరిగిపోయాయని తెలుస్తోంది.
సీనియర్లు అధికారులు తనకు సహకరించకపోవడంతో వారిపై సీఎస్ సోమేష్ కుమార్ నిఘా పెట్టారనే చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారుల కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే అధికారులకు సీఎస్ అప్పగించారని సమాచారం. ఈ విషయం తెలిసి ఇప్పుడు సచివాలయంలో చాలా మంది అధికారులు ప్రైవేట్ అంశాలను కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం లేదని చెబుతున్నారు. నిఘా ఉందని తెలియడంతో ఉన్నతాధికారులు సీఎస్ తో బహిరంగంగానే వివాదాలకు దిగుతున్నారట. సచివాలయంలో ప్రస్తుతం అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. సీఎస్ కాకముందు తాము చూసిన సోమేశ్ కుమార్‌కు, ఇప్పటి సోమేశ్ కుమార్‌కు చాలా వ్యత్యాసం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట అధికారులు.
సీఎస్ సోమేష్ కుమార్ తీరుపై పై చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. చిన్న చిన్న అంశాలు, సాధారణ, పరిపాలనా విషయాలలోనూ ఆయన జోక్యం పెరిగిపోయిందని గతంలో కొందరు అధికారులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్లు కూడా సీఎస్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొందరు ఐఏఎస్‌ల వ్యవహారంలో సీఎస్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో సీఎస్‌పై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని తెలుస్తోంది. ఆ శాఖలోని చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు మండిపడుతున్నారు. తమ శాఖను సీఎం ముందు పని లేని విభాగంగా మార్చేందుకు సీఎస్ ప్రయత్నాలు చేశారనే కోపం వారిలో ఉంది. సీఎస్ నివేదిక ఆధారంగానే సీఎం కూడా రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా రెవెన్యూలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని వాళ్లు భావిస్తున్నారట.
నిజానికి సోమేశ్ ఏపీ కేడర్ అయినప్పటికీ ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కన్నా సీనియర్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా నమ్మకంతో సీఎస్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు కేసీఆర్. సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కలిసి రాలేదు. ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి, ఎల్ఆర్ఎస్ వంటి స్కీంలు జనాగ్రహానికి కారణమయ్యాయి. ఈ రెండు పథకాల ప్రతిపాదనలు సోమేష్ కుమార్ తెచ్చినవే. జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ ఓటమికి ఇది కూడా కారణమంటూ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందిందని, సీఎస్ ను కేసీఆర్ సీరియస్‌గా మందలించినట్లు ప్రచారం జరిగింది. సీఎస్ ను మార్చతారని కూడా చర్చ జరిగింది. అయితే తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గమే ఇలాంటి ప్రచారం చేసిందని సోమేష్ కుమార్ భావిస్తున్నారని చెబుతున్నారు.