మహోన్నత నేత 'కిసాన్' గొర్రెపాటి వెంకటసుబ్బయ్య! ఘంటసాలలో ప్రముఖుల నివాళులు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడిగా పేరు పొందిన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 50 వర్ధంతిని ఘంటసాలలో నిర్వహించారు. సత్రం సెంటర్ లో వున్న కిసాన్ వెంకటసుబ్బయ్య గారి విగ్రహం వద్ద జాతీయ కాంగ్రెస్ కండువాలు , పూలమాల తో నివాళులు అర్పించారు. తర్వాత గ్రామపంచాయతీ వద్ద వున్న కిసాన్ వెంకటసుబ్బయ్య , ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గొర్రెపాటి వెంకటసుబ్బయ్య సేవలను స్మరించుకున్నారు నేతలు. దేశం కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం నిస్వార్ధ కృషి చేసి ' కిసాన్ ' బిరుదు తో ప్రజల హృదయాలలో వెంకట సుబ్బయ్య ధన్యజీవిగా నిలిచిపోయారని పలువురు వక్తలు కొనియాడారు.
కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గాంధిజీ పిలుపుతో దేశ స్వాతంత్ర పోరాటంలోకి దిగారు. తన 20వ ఏటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1920 లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వెయ్యకుండా ఖాళీ పెట్టెలు పంపిన ఘన చరిత్ర ఘంటసాల గ్రామానిది. దేశంలోనే సంచలనంగా మారిన ఈ ఘటనలో తన సహాధ్యాయులు గొట్టిపాటి బ్రహ్మయ్య, పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్యలతో కలిసి ప్రధాన పాత్ర పోషించారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. మహాత్మా గాంధీ ఘంటసాలలో పర్యటించినపుడు ఖద్దరు నిధికి విరాళాలు పోగుచేసి ఆయన మన్ననలు అందుకున్నారు.1929 లో బ్రిటిషు వారికి నల్ల జెండాలు చూపించి నిరసన తెలిపినందుకు అప్పటి ప్రభుత్వం గొర్రెపాటి వెంకటసుబ్బయ్యని జైలు లో పెట్టింది. 1939 లో స్వగ్రామంలో జాతీయ జండా ఎగరేసినందుకు ఆయన లాఠీ దెబ్బలు తిన్నారు. 1946 లో అప్పటి బ్రిటిష్ అధికారి రోలాండ్ తో చర్చలు జరిపి పొగాకు రైతులపై విధించిన ఎక్సయిజ్ సుంకాన్ని సడలించటానికి కృషి చేశారు.గొర్రెపాటి వెంకటసుబ్బయ్య సతీమణి సరస్వతమ్మ కూడా భర్తకి తోడుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.
నిర్బంధంగా రైతుల భూముల్ని ప్రభుత్వం ఆక్రమించటానికి వ్యతిరేకంగా గళమెత్తారు వెంకట సుబ్బయ్య. రైతాంగ ఉద్యమ నాయకులుగా తీవ్ర స్థాయి లో ప్రభుత్వంపై పోరాటం చేశారు. కొల్లేరు , రొంపేరు,తమ్మిలేరు భూములని రైతు కూలీలకు ఇప్పించటానికి గట్టిగా పోరాడారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. రైతుల కోసం చేసిన కృషికి గుర్తుగా రైతులందరి చేత 'కిసాన్ ' వెంకటసుబ్బయ్య అని ఆప్యాయంగా పిలిపించుకున్నారు. జాతీయ నేత రాజాజీతో ఆయనకి ఎంతో అనుబంధం ఉండేది. ఆ చొరవతోనే రైతులకి అవసరమైన ఎన్నో ప్రయోజనాల్ని సాధించారు. ఒక దశలో రైతులకి న్యాయం చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ని వీడటానికి కూడా సిద్ధపడ్డారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. కిసాన్ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య దంపతులిద్దరూ నిరాడంబరంగా నిస్వార్ధంగా ప్రజలకి సేవ చేశారు. అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడేవారు. ఎవరైనా తాము గురువుగా భావించేవారి ఆత్మకథలని వ్రాస్తారు. కానీ తన శిష్యుడైన వెంకట సుబ్బయ్య గారి గురించి ఆయన గురువైన ఆచార్య ఎన్ జి రంగా "మన కిసాన్ వెంకట సుబ్బయ్య" అనే పుస్తకం రాయడం మరో విశేషం. దీనిని బట్టి వెంకట సుబ్బయ్య గారి నిబద్ధతని అర్ధం చేసుకోవచ్చు.
1949 నుండి 1952 వరకు కృష్ణా జిల్లా బోర్డు ఉపాధ్యక్షులుగా పనిచేశారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. ఆంధ్ర రాష్ట్ర రైతు సమ్మేళన అధ్యక్షుడిగా 1943 నుండి 1970 వరకూ కొనసాగారు. 1959లో రాజాజీ నెలకొల్పిన స్వతంత్ర పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రధమ అధ్యక్షుడిగా పనిచేశారు. గాంధీ స్మారకనిధి సభ్యులుగా పనిచేసారు. ఆచార్య ఎన్ జి రంగా గారికి ప్రియ శిష్యుడిగా, సన్నిహిత సహచరులుగా మెలిగారు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య నెలకొల్పిన రంగా ట్రస్ట్ లో 1957 నుండి 1970 వరకు సభ్యులుగా ఉన్నారు. 1965 నుండి 1970లో అయన చనిపోయే వరకూ వాహినీ పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు.
'కిసాన్ ' వెంకటసుబ్బయ్య గారి మనుమడు, కృష్ణాజిల్లాపరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో పలువురిని సన్మానించారు. భౌద్ధ గురువు పూజ్య బంతేజా , ఆచార్య NG రంగా వ్యవసాయ పరిశోధన కో ఆర్డినేటర్ కే నాగేంద్రం , కేవీకే కో ఆర్డినేటర్ ఝాన్సీ ద్వారా కిసాన్ వెంకట సుబ్బయ్య , ఆచార్య NG రంగా ల అనుచరులు గొర్రెపాటి లీలాకృష్ణయ్య, గొర్రెపాటి చంద్రశేఖర రావు, అయినపూడి చంద్రశేఖర రావు, గుత్తికొండ సీతా రామాంజనేయులను ఘనంగా సన్మానించారు. ఘంటసాల స్వాతంత్ర సమరయోధుల వారసులు గొర్రెపాటి గోపాలకృష్ణ, ఆకురాతి వేణు గోపాలరావు, వేమూరి గోపాలకృష్ణ , వేమూరి పట్టవర్ధన్ గార్లను కూడా సన్మానించారు.