కేరళలో మునిసిపల్ ఆఫీసుపై "జైశ్రీరామ్" నినాదాలతో బీజేపీ జెండాలు..

కేరళలోని పాలక్కాడ్ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి విజయం సాధించిన జోష్ లో ఆ పార్టీ కార్యకర్తలు పట్టణ మునిసిపల్‌ భవనంపై కాషాయ జెండాలు ఎగరేశారు. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫొటోలు ఉన్న భారీ బ్యానర్లను భవనం పై ప్రదర్శించారు. వాటిలో ఒక జెండాపై "జై శ్రీరామ్‌" అని నినాదం కూడా రాసి ఉంది. తాజాగా ఇది కాస్తా వివాదంగా మారింది. దీంతో మతపరంగా రెచ్చగొట్టే జెండాలను బీజేపీ కార్యకర్తలు ఎగురవేశారని పాలక్కాడ్ మునిసిపల్‌ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   పాలక్కాడ్ లో బీజేపీ రెండోసారి విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఏకంగా మునిసిపల్‌ కార్యాలయ భవనం ఎక్కి జెండాలు ప్రదర్శించారు. ఈ ఘటన తాలూకు వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి కారణమైంది. అయితే బీజేపీ తీరుకు నిరసనగా వామపక్ష కార్యకర్తలు శుక్రవారం పాలక్కాడ్‌ భవనంపై జాతీయ జెండాను ఎగురవేసారు. ఇది ఇలా ఉండగా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పాలక్కాడ్‌ బీజేపీ అధ్యక్షుడు, న్యాయవాది కృష్ణ దాస్‌ తప్పుపట్టారు. "జై శ్రీరామ్‌ అనే నినాదాలు భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో చేయాలా? జైశ్రీరామ్‌ అని రాసి ఉన్న జెండాలు ప్రదర్శిస్తే మతపరంగా రెచ్చగొట్టినట్లా? భావోద్వేగాలను దెబ్బతీసినట్లా?" అని కృష్ణ దాస్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం వెళ్లగా.. మరో ఘోర ప్రమాదం

తమ కళ్ళ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు సాయం వెళ్లిన ఆ బడుగు జీవుల ఊపిరి తీసింది అటుగా దూసుకొచ్చిన సిమెంట్ లారీ. అనంతపురం జిల్లాలో నిన్న సాయంత్రం పొద్దు వాలాక కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న కూలీలు తమ కళ్ళ ముందే ఒక కారు ఢీకొని ఓ యువకుడు రోడ్డుపై పడి ఉండటం గమనించారు. దీంతో అతడిని కాపాడేందుకు అతడి వద్దకు వెళ్లారు. అయితే ఇంతలో అటుగా దూసుకొచ్చిన లారీ.. గాయపడిన యువకుడితో పాటు అతడిని కాపాడి సపర్యలు చేస్తున్న కూలీల ఊపిరి కూడా తీసింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి వద్ద నిన్న శుక్రవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.   ఆ దుర్ఘటన పూర్తీ వివరాల్లోకి వెళితే.. రాఘవంపల్లికి చెందిన రైతు శ్రీకాంతప్ప ఏకైక కుమారుడు రాజశేఖర్‌(20). అనంతపురం నుండి బైకు పై తన స్వగ్రామానికి వస్తుండగా రాఘవంపల్లి క్రాస్‌ వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న ఒక కారు వేగంగా ఆయన బైకును ఢీకొనడంతో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అదే సమయంలో కూలి పనులు ముగించుకొని తిరిగొస్తున్న కూలీలు ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రుడిని కాపాడడానికి అతడి వద్దకు వెళ్లారు. వారు బాధితుడికి సపర్యలు చేస్తుండగానే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్‌ లారీ కూలీలపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అప్పటికే గాయపడిన రాజశేఖర్‌తో పాటు నలుగురు కూలీలు కూడా అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు, ముష్టూరుకు చెందిన శివమ్మ, సంజీవపురానికి చెందిన సూరి, వలిలు గా గుర్తించారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజు అనే మరో కూలీ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారు, లారీ డ్రైవర్లు తమ వాహనాలు వదిలేసి పరారయ్యారు. చనిపోయిన వారంతా రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కూలీలు కావడంతోపాటు కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కుగా ఉన్నవారు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు వీధిన పడ్డారు. ఇది ఇలా ఉండగా "ప్రయోజకుడై ముసలి వయస్సులో ఆసరాగా ఉంటావనుకుంటే మమ్మల్ని వదిలేసి పోతివా నాయనా! నీ బదులు మమ్మల్ని తీసుకెళ్లినా బాగుండేది" అంటూ తన ఒక్కగానొక్క కొడుకు రాజశేఖర్ ను పోగొట్టుకున్న తండ్రి శ్రీకాంతప్ప రోదన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. 

రైతులతో ప్రధాని చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం! అలా చేస్తే మోడీ రియల్ హీరోనే! 

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీపై దండెత్తారు. దేశ రాజధానిలోకి రాకుండా పోలీసులు అడ్డు కంచెలు వేసినా.. సరిహద్దులోనే సమర నినాదం వినిపిస్తున్నారు  కర్షకులు. గజ గజ వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా అక్కడే తింటూ.. అక్కడే పడుకుంటూ 22 రోజులుగా అలు పెరగని ఆందోళన చేస్తున్నారు అన్నదాతలు. రైతుల పోరాటంతో ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని  టిక్రి, సింఝూ ప్రాంతాలు ఇప్పుడు ఉద్యమ కేంద్రాలుగా మారిపోయాయి. ఉద్యమంలో పాల్గొంటూ ఇప్పటివరకు 25 మంది అన్నదాతలు అసువులు బాశారు. అయినా ఏమాత్రం వెనక్కి తగడ్డం లేదు రైతులు. కేంద్రం దిగొచ్చేవరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు.    ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. యూఎన్ కూడా వారిటి బాసటగా నిలిచింది. కెనడా ప్రధాని భారత  రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలు అన్నదాతలకు అండగా నిలిచాయి. రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పలువురు ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్తలు డిమాండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం మాత్రం తన పంతం వీడటం లేదు. రోజురోజుకు ఉద్యమం తీవ్రతరమవుతున్నా సీరియస్ గా స్పందించడం లేదు మోడీ సర్కార్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం కొందరు రైతులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అయితే వారంతా బీజేపీ అనుబంధ రైతు సంఘాల నేతలేనని తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న రైతుల్లో చీలిక తెచ్చేందుకు కేంద్ర కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రైతు ప్రతినిధుల పేరుతో తోమర్ తో చర్చలకు వెళ్లేవారంతా బీజేపీ కుట్రలో పావులుగా ఉన్నవారేనని చెబుతున్నారు.    రైతులను శాంతింప చేయాల్సింది పోయి వాళ్ల ఆందోళన  ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తున్నారు కొందరు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రుల నుంచి గల్లీ నేతల వరకు రైతుల ఆందోళనలపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. రైతులకు  ఖలిస్తానీయులు, మావోయిస్టులతోను లింక్ ఉందని బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేయడం దుమారం రేపింది. ఆందోళన చేస్తున్న అన్నదాతలను  హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా  ఖలిస్తానీయులుగా అభివర్ణించారు. రైతుల పేరుతో మోడీకి వ్యతిరేకంగా ఖలిస్తానీయులు నినాదాలు చేశారని చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులే రైతుల ఆందోళన వెనుక ఉన్నాయన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు విపక్షాలు రైతుల్ని వాడుకుంటున్నాయన్నారు. ఇంకొందరు బీజేపీ నేతలేమో కేవలం పంజాబ్ రైతులే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కేవలం ఒక్క శాతం రైతులు .. అది కూడా పంజాబీ రైతులకే కొత్త చట్టాలు నచ్చడం లేదని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి చెప్పారు.     బీజేపీ నేతల కామెంట్లపై సిక్కు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పంజాబ్ రైతులకే ఉద్యమాన్ని పరిమితం చేసేలా కేంద్రం కుట్రలు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో పంజాబ్ రైతులకు మాత్రమే సమస్య ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ రైతుల సమస్య అయితే ఇటీవల నిర్వహించిన బంద్ అన్ని రాష్ట్రాల్లో ఎలా విజయవంతమైందని అడుగుతున్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువగా అసువులు బాసింది పంజాబీలేనని వారు గుర్తు చేస్తున్నారు.  దేశ స్వాతంత్రం కోసం ఉరి తీసిన 121 మందిలో 93 మంది పంజాబీలే ఉన్నారని చెబుతున్నారు. జీవిత ఖైదు విధించిన 2 వేల 626 మందిలో 2 వేల 147 మంది పంజాబీలేనని లెక్కలు తీస్తున్నారు. ఇప్పుడు కేంద్రం వాదిస్తున్నట్లు అప్పుడు బ్రిటీష్ సర్కార్ కూడా  స్వాతంత్ర సమస్య కేవలం పంజాబీలకేనని అనుకుంటే మిగితా దేశం ఇప్పటికి బానిసత్వంలోనే ఉండేదని సిక్కులు స్పష్టం చేస్తున్నారు.    రైతుల చేస్తున్న పోరాటాన్ని గౌరవించి వారితో కేంద్ర సర్కార్ చర్చలు జరిపితేనే బెటరనే అభిప్రాయమం మేధావుల నుంచి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందంటున్నారు. రైతుల దగ్గరకే మోడీ వెళితే.. ఆయన కూడా హీరోగా నిలుస్తారని  చెబుతున్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాకా దేశాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరికింది. అయోధ్య రామాలయం, త్రిపుల్ తలాక్, జమ్మూ కశ్మీర్ సమస్యలు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు రైతుల ఆందోళన విరమించేలా ప్రధాని మోడీ చొరవ తీసుకుని.. వారితో చర్చించి సమస్య పరిష్కరిస్తే.. ఇది కూడా ఆయన చరిత్రాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది.      మన దేశ రక్షణలో సిక్కులు, పంజాబీల పాత్రే గొప్పది. ఇండియా ఆర్మీలో ఎక్కువ మందే వారే ఉంటారు. దేశం కోసం ఏటా వందలాది ప్రాణాలు అర్పిస్తుంటారు. దేశ భక్తిలో సిక్కులతో ఎవరూ పోటీపడలేరని చెబుతారు.  గతంలో సిక్కులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుని రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇందీరా గాంధీ. నిజానికి సిక్కులు మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు. ప్రధాని మోడీ రెండు సార్లు అధికారంలో చేపట్టడంలో వారి సహకారం కూడా ఉంది. అందుకే రైతుల ఆందోళనను కేవలం పంజాబీ రైతుల సమస్యగా చూపి వారిపై విమర్శలు చేయడం ఆపితేనే బీజేపీకే మంచిదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. లేదంటే గతంలో కాంగ్రెస్ కు జరిగినట్లే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావచ్చని కూడా కొందరు పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.  కేంద్రం తమ పంతాన్ని కొనసాగిస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తుందా లేక ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తుందో చూడాలి మరీ..

రేవంత్ కు పీసీసీ.. సీనియర్లు జంప్? కొత్త పార్టీ రెడీగా ఉందట!  

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కొత్త బాస్ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. పీసీసీ చీఫ్ పై హైకమాండ్ నుంచి ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పీసీసీ రేసులో ఉన్న నేతలు ఢిల్లీ స్ఠాయిలో చివరి వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ పగ్గాలు దాదాపుగా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ నుంచి ఆయనకు ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు అందాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. టీపీపీసీ చీఫ్ గానే హైదరాబాద్ లో అడుగుపెడతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.          టీపీపీసీ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తే కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు ఉంటాయంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా పోరాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వీ హనుమంతరావులు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. వారంతా ఇప్పటికే ప్లాన్ బీగా పక్క పార్టీ ప్లాట్ ఫామ్ సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ రేసులో నిలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటారని గాంధీభవన్ వర్గాల టాక్.    కాంగ్రెస్ నేతల వలసల ప్రచారంపైనా ఆ పార్టీలో ఆసక్తికరమైన  చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చాకా.. సీనియర్లు బయటికి వెళ్లినా పార్టీపై పెద్ద ప్రభావం ఉండదనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. పాత తరం నేతలు పోతే యువ నేతలు వస్తారని, పార్టీకి ఇది మరింత బలం అవుతుందని కొందరు చెబుతున్నారు. పార్టీలో యువనేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ చూస్తున్నారని, రేవంత్ రెడ్డితో  ఆ లక్ష్యం నెరవేరుతుందని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఆయనతో కలిసి పని చేసేందుకు యువ నేతలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్లు తనకు సహకరించకపోయినా.. పార్టీని బలోపేతం చేస్తాననే ధీమాలో రేవంత్ రెడ్డి ఉన్నారని, హైకమాండ్ కు కూడా ఆయనపై నమ్మకం ఉందని మల్కాజ్ గిరి ఎంపీ వర్గీయులు చెబుతున్నారు.    మరోవైపు రేవంత్ రెడ్డి గురించే మరో ప్రచారం జోరుగా సాగుతోంది. చివరి నిమిషంలో ఏదైనా జరిగి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకపోతే తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా నియమించకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఒక పార్టీ రిజిస్టర్ అయి ఉందట. ఆ పార్టీ వివరాలు, ఎవరూ రిజిస్టర్ చేయించారన్న వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. రేవంత్ రెడ్డి కోసమే ఆపార్టీని రెడీగా ఉంచారని కొందరు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమిస్తే ఆ పార్టీ బయటికి రాదని, ఆయనకు పీసీసీ రాకుంటే మాత్రం కొత్త పార్టీ తెరపైకి వస్తుందని చెబుతున్నారు. ఆ పార్టీనే రేవంత్ రెడ్డి పార్టీ అవుతుందనే చర్చ జరుగుతోంది.       మొత్తానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇస్తే సీనియర్ నేతలు బయటికి వెళ్లడం జరుగుతుందా.. లేక పీసీసీ పదవి రాకుంటే రేవంత్ రెడ్డే కొత్త పార్టీని నడిపిస్తారా అన్నది ఆసక్తిగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ లో జరుగుతున్న, జరగబోయే పరిణామాలను ఇతర పార్టీలు గమనిస్తున్నాయి. ఈ సస్పెన్స్ పోవాలంటే ఏఐసీసీ నుంచి టీపీసీసీ చీఫ్ ప్రకటన రావాల్సిందే.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే..

ఇంత ఘోరమా.. డీపీఆర్ ఎలా ఇవ్వాలో  తెలియదా? ఏపీ పరువు తీసిన జగన్ సర్కార్  

జగన్ సర్కార్ అస్తవ్యస్థ, ఏకపక్ష విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతోంది. ఇప్పటికే ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని అభాసుపాలైంది వైసీపీ ప్రభుత్వం. హైకోర్టు, సుప్రీంకోర్టులు వైసీపీ సర్కార్  తీసుకున్న పలు నిర్ణయాలను ఆక్షేపిస్తూ అమలు చేయకుండా నిలిపివేశాయి. కోర్టులు చాలదన్నట్లు ఇప్పుడు కేంద్ర జల సంఘం దగ్గర ఏపీ ప్రతిష్టను మంటగలిపారు జగనన్న  అధికారులు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్ సర్కార్ ఇచ్చిన  డీపీఆర్ ను తిరిగి పంపించింది కేంద్ర జల సంఘం. ఏపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంత ఘోరంగా ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు డీపీఆర్ ను ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని జలసంఘం మండిపడింది. డీపీఆర్ ఎలా ఇవ్వాలో కూడా మీ అధికారులకు తెలియదా? అంటూ జగన్ సర్కార్ ను కేంద్ర జల సంఘం చివాట్లు పెట్టింది. 46 పేజీల డీపీఆర్లో కనీస సమాచారాన్ని కూడా దాచి పెట్టారని, హైడ్రాలజీ, ఇంటర్ స్టేట్ అంశాలు, ఇరిగేషన్ ప్లానింగ్, డిజైన్లు, వ్యయ అంచనాలు లేవని అసహనం వ్యక్తం చేసింది. తెలియకపోతే  సీడబ్ల్యూసీ వెబ్సైట్లో నమూనాలు ఉంటాయని, వాటి ప్రకారం అయినా ఇవ్వాలని సూచించింది. లాంటి వివరాలు కూడా లేకుండా డీపీఆర్ ఎలా ఇచ్చారంటూ కేంద్ర జల సంఘం సభ్యుడు ముఖర్జీ  ఏపీ జల వనరుల శాఖకు లేఖ రాయడం కలకలం రేపుతోంద రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సంగమేశ్వరం దగ్గర రోజుకు మూడు టీఎంసీను ఎత్తిపోసే ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది.  ఎలాంటి ప్రణాళికలు లేకుండానే హడావుడిగా పథకాన్ని చేపట్టింది. ప్రాజెక్ట్ రిపోర్టును కూడా సరిగా రూపొందించలేదు. దీంతో జగన్ సర్కార్ తీరుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇరిగేషన్ నిపుణులు కూడా తప్పుపట్టారు. రాయలసీమ ప్రాజెక్టు చేపట్టామని చెప్పుకుని  రాజకీయంగా లబ్ది పొందాలని వైసీపీ ప్లాన్ చేసిందనే  ఆరోపణలు వచ్చాయి. అయితే ఇరిగేషన్ నిపుణులు భయపడినట్లే ఇప్పుడు కేంద్ర జలసంఘం ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ లో   కనీస ప్రాథమిక అంశాలు లేవని, దాన్ని‌ ఎలా తయారు చేయాలన్న విషయంపై మార్గదర్శకాలను పాటిస్తూ సరైన డీపీఆర్‌ తయారు చేసి పంపాలని సూచించింది. ఎఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఈ డీపీఆర్ లో పొందుపర్చిన అంశాలు సరిపోవని పేర్కొంది.  రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా సంగమేశ్వరం నుంచి 17.9 కి.మీ దూరం వరకు  శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో అప్రోచ్‌కాలువ తవ్వి పంపుహౌస్‌ నిర్మించి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు.  పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి పంపేలా ఇది ఉంది. గతంలో దీని డీపీఆర్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర జలసంఘానికి ఏపీ సర్కారు పంపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను అందులో వివరించింది. దీనిపై తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయడంతో అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరిగింది. కొత్త ప్రాజెక్టు కావడంతో డీపీఆర్లు ఇచ్చాకే పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం సోమవారం కృష్ణా బోర్డుకు డీపీఆర్ పంపించింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో పాటు నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తీసుకోలేం కాబట్టి దీన్ని చేపట్టినట్లు పేర్కొంది.             డీపీఆర్ లో తెలంగాణను తప్పు పట్టింది ఏపీ ప్రభుత్వం. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండానే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించింది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా 2015లోనే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టిందని పేర్కొంది. సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోందని, మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతోందని వివరించింది. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోవడంతో కరువు సీమ రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటుందని డీపీఆర్లో ఏపీ సర్కార్ పేర్కొంది.

రుణం తీసుకుంటే ప్రాణ గండమే! యాప్ కాదు ఆన్ లైన్ కిల్లర్ ?  

మీకు క్షణాల్లో అప్పు ఇస్తామంటూ నోటిఫికేషన్ వస్తుంది. చిల్లర ఖర్చులకు డబ్బులు ఇస్తామని సందేశం పంపిస్తారు. రుణం కోసం షూరిటీలు అవరసం లేదంటూ గాలం వేస్తారు. వారి ఉచ్చులో పడి యాప్ డౌన్ లోడ్ చేసుకున్నామంటే  చాలు.. ఇన్ స్టంట్ లోనే పేరుతో ఉచ్చులోకి లాగుతారు. క్రిడెట్  యాప్ ద్వారా అప్పు తీసుకున్నామంటే ఇక ఊబిలో చిక్కుకున్నట్లే. ఇలా  ఆన్‌లైన్ లో తీసుకున్న అప్పులు  ఉసురు తీస్తున్నాయి. అవసరం కొరకు యాప్ ల ద్వారా రుణాలు తీసుకుంటున్న యువతి యువకులు.. వాళ్లు వసూల్ చేసే అధిక వడ్డీలు కట్టలేక చేతులెత్తేస్తున్నారు. డబ్బుల కోసం యాప్ నిర్వాహకులు చేస్తున్న వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్ర్లాల్లో రెండు రోజుల్లోనూ నలుగురు  ఆన్ లైన్ రుణం తీసుకుని మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి, హైదరాబాద్ లో యువ ఇంజనీర్.. విశాఖలో ఇద్దరు యువతులు రుణ పాశానికి తనువు చాలించారు. బయటికి వచ్చిన చావులు ఈ నాలుగని.. ఆన్ లైన్ యాప్ ఉచ్చుకు చిక్కి   ఎవరికి తెలియకుండా ఇప్పటికే ఎంతో మంది విగత జీవులుగా మారిపోయారని తెలుస్తోంది.      విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ అనైతిక వ్యాపారం చేస్తున్నాయి ఆన్‌లైన్ క్రెడిట్ యాప్స్.  సైబర్‌ నేరగాళ్లు, ఆర్థిక మోసాలకు పాల్పడే వారంతా యువతను ఇన్‌స్టంట్ లోన్ పేరుతో ముగ్గులోకి లాగుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువగా గడిపే యువతను టార్గెట్ చేసి వారికి లింక్‌లు పంపిస్తున్నారు. గో క్యాష్, స్మాల్ వాలెట్, బబుల్ లోన్, బిలియన్ క్యాష్, లోన్ బజార్ వంటి వందలాది యాప్‌లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమిస్తున్నాయి. ఫోటో, ఆధార్‌ కార్డ్, సెల్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లే ష్యూరిటీగా ఇచ్చే ఈ రుణంలో… మళ్లీ పదిశాతం ప్రాసెసింగ్‌ ఛార్జీల కింత కోత విధిస్తారు. మిగిలిన మొత్తాన్ని గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. మూడు వేల నుంచి 2 లక్షల వరకు రుణాలను క్రిడెట్ యాప్స్ అందిస్తున్నాయి.   క్రెడిట్ యాప్స్ ఇచ్చే  ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే చుక్కలు చూడాల్సిందే. వాళ్లు చేసే వేధింపులు మాములుగా ఉండవు.  ఫోన్లు, మెసేజ్ లతో వేధింపులకు దిగుతారు.  తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. అప్పు తీర్చలేని పక్షంలో అందరి చెప్పి పరువు తీస్తామంటూ బెదిరిస్తారు. క్రెడిట్ యాప్స్ వడ్డీ లెక్కలు దారుణంగా ఉంటాయి. రుణం ఇచ్చే ముందు చెప్పే లెక్క.. తర్వాత వసూల్ చేసే దానికి అసలు పొంతనే ఉండదు. ఎందుకిలా వసూల్ చేస్తున్నారని అడగడానికి వీలుండదు. దీంతో 3 వేల రూపాయలు అప్పు తీసుకుని లక్ష రూపాయలు చెల్లించిన వారు కూడా ఉన్నారంటే క్రిడెట్ యాప్స్ దారుణాలు ఎలా ఉన్నాయో ఊహించవచ్చు. దీంతో అవసరాలకు ఆన్‌లైన్‌లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.    సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాజగోపాలపేట చెందిన  24 ఏండ్ల కిర్ని మౌనిక  ఏఈవోగా పనిచేస్తోంది. మౌనిక తండ్రి భూపాణి వ్యాపార ప్రయత్నాల్లో డబ్బులు నష్టపోయారు. దీంతో కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ. 3 లక్షల రుణం తీసుకుంది. అయితే గడువు తీరినా ఆమె తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు మౌనికపై ఒత్తిడి తీసుకొచ్చారు.  ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ మౌనికను రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించారు. రుణ సంస్థ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు  పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది.    గుంటూరుకు చెందిన సునీల్  కొంతకాలంగా రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న సునీల్.. లాక్‌డౌన్ ఇబ్బందుల కారణంగా ఇటీవల రుణాలు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో రుణదాతలు అధిక వడ్డీలు వేస్తూ చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడితో ఆగక అతడి సెల్‌లోని కాంటాక్ట్‌లకు వాట్సాప్ సందేశాలు పంపించారు. దీనిని అవమానంగా భావించిన సునీల్ బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో ఆన్ లైన్ లోన్ తీసుకుని 40 వేలు చెల్లించలేక ఓ యువతి సూసైడ్ చేసుకుంది. గత నవంబర్ లో విశాఖ జిల్లా గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన ఆహ్లాద అనే యువతి. ఇంటి అవసరాల కోసం ఆహ్లాద రెండు ఇన్‌స్టంట్ లోన్‌ యాప్‌ ల నుంచి 40 వేల రూపాయల లోన్‌ తీసుకుంది. గడువులోగా తిరిగి చెల్లించే దారి లేక.. అప్పులు ఇచ్చిన వారి బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆహ్లాదకు అనేక బెదిరింపు కాల్స్‌, మెసేజ్ లు వచ్చాయని తేలింది.    యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్న  ఈ యాప్స్‌ కు ఎలాంటి అనుమతులు లేవు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా  మనీ డీల్స్ నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆన్‌లైన్ క్రెడిట్ యాప్స్‌ రూపొందించి ఇన్‌స్టంట్ లోన్‌ పేరుతో రుణాలు ఇవ్వడం కూడా ఆర్బీఐ నిబంధనలకు  విరుద్దం. అదే సమయంలో అప్పులు తిరిగి చెల్లించమని బ్లాక్ మెయిల్ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమంటున్నారు సైబర్‌ పోలీసులు. తమ దగ్గరకు ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ కేసుల్లో క్రెడిట్ యాప్ నిర్వాహకులను పట్టుకోవడం తమకు కష్టమవుతుందని చెబుతున్నారు సైబర్ నిపుణులు. వాళ్ల దగ్గర ఫేక్ ఫోన్ నెంబర్లు ఉంటాయని, సిమ్ కార్డు అవసరం లేని వర్చువల్ ఫోన్ కాల్స్ చేస్తున్నారని అంటున్నారు. అయితే క్రెడిట్ యాప్స్ వాళ్లు చేసే బెదిరింపులకు భయపడవద్దని సూచిస్తున్నారు పోలీసులు. క్రెడిట్ యాప్స్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.  

జానా రెడ్డికి గవర్నర్ గిరి.. కొడుకుకు సాగర్ సీటు! బీజేపీలో చేరిక ఖాయమేనా? 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి  కారు పార్టీలో కలవరం రేపిన కమల దళం.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ఫలితాలు సాధించి గులాబీలో మరింత గుబులు రేపింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ జోష్ తో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ గెలుపునకు  కార్యాచరణ సిద్దం చేస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉన్న నాగార్జున సాగర్ ను కైవసం చేసుకుంటే తెలంగాణలో తమకు  తిరుగేలేదని భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అందుకే సాగర్ కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారట. పార్టీ మారేది లేదు లేదంటూనే బీజేపీ పెద్దల టచ్ లోకి జానా రెడ్డి వెళ్లారని, వారి ముందు పెద్ద ప్రతిపాదనే ఉంచారనే ప్రచారం జరుగుతోంది.    బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ..  జానా రెడ్డితో  పార్టీ హైకమాండ్ తరపున సంప్రదింపులు చేస్తున్నారని టాక్.  ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా జానారెడ్డితో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. మొదట పార్టీ మారేందుకు ఆసక్తి చూపని జానారెడ్డి.. తర్వాత సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తోంది. తనకు వయసు మీద పడటంతో ఎన్నికల్లో పోటీ  చేయలేనని,  తన కొడుక్కి నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలని, తనకు గవర్నర్ పోస్టు ఇవ్వాలని బీజేపీ పెద్దల ముందు జానారెడ్డి ఆఫర్ పెట్టారని సమాచారం. జానా రెడ్డి ప్రతిపాదనను బీజేపీ దాదాపుగా అంగీకరించిందని , అతని కొడుకుని నాగార్జున సాగర్ లో నిలబెట్టి గెలిపించుకుంటామని  కమలం పెద్దలు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో జానా రెడ్డి త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.    దుబ్బాక, జీహెచ్ఎంసీతో పోలిస్తే బీజేపీకి నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ కమలం  బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు అసెంబ్లీ సీటు గెలవలేదు. నాగార్జున సాగర్ గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేయగా ఏడు సార్లు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడినా ఆయన పట్టు మాత్రం నియోజకవర్గంలో పోలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కే లీడ్ వచ్చింది. నాగార్జున సాగర్ లో బీజేపీ బలం అంతంత మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డికి  ఒక్క శాతం ఓట్లే పోలయ్యాయి. నివేదిత కేవలం 2 వేల 675 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.   నాగార్జున సాగర్ లో బలహీనంగా ఉన్న బీజేపీ  ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకే  జానారెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని భావిస్తున్నారు.  జానారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వెనక బీజేపీకి భారీ వ్యూహమే ఉందంటున్నారు. నాగార్జున సాగర్ లో  గెలవడంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయాలని ప్లాన్ చేస్తుందట. జానా రెడ్డి పార్టీ మారితే.. ఆ పార్టీ నుంచి మరి కొంత మంది ముఖ్య నేతలు కూడా కమలం గూటికి వస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ బలహీనం అయితే ప్రజా వ్యతిరేకత ఓటంతా కమలానికే వస్తుందని బీజేపీ నేతల అంచనా.   తర్వాత కేసీఆర్ కు చుక్కలు చూపించే యోచనలో ఉందట కమలం పార్టీ. అందుకే నాగార్జున సాగర్ ను తెలంగాణలో అధికారంలోకి రావడానికి అత్యంత కీలకంగా తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. తమకు  ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్ లోనూ గెలిస్తే.. ఆ పార్టీకి తెలంగాణలో ఇక తిరుగు ఉండదని రాజకీయ అనలిస్టులు కూడా చెబుతున్నారు. ఆ దిశగానే కమలనాథులు పక్కా కార్యాచరణతోనే కదులుతున్నట్లు కనిపిస్తోంది.

వ్యవసాయ చట్టాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. క్రెడిట్‌ మొత్తం మీరే తీసుకోండి

నూతన వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధరకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతు ఆందోళనలు కొనసాగుతున్న వేళ, మధ్యప్రదేశ్‌ రైతులతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రజలు, రైతులు నమ్మకం ఉంచాలని.. ఎవరికైనా అనుమానాలు, ఆందోళనలు ఉంటే వారితో చర్చించి, వారి భయాలు పోగొడతాం అన్నారు. కనీస మద్దతు ధర ఎత్తివేస్తారనేది అతి పెద్ద అబద్ధం అని పేర్కొన్నారు.    వ్యవసాయ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని.. గత 20,30 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం గురించి చర్చించాయని అన్నారు. దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతు సంఘాలు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే.. కొన్ని పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.    వ్యవసాయ సంస్కరణలు జరగడం ప్రతిపక్షాల బాధ కాదని, ఇన్నాళ్ల పాటు తాము చేయని మంచి పని మోదీ చేశారు కాబట్టే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మోదీ అన్నారు. ఇంత మంచి సంస్కరణలు మేం ఎందుకు ప్రవేశపెట్టలేకపోయామని, ఆ ఘనత మోదీకే ఎందుకు దక్కాలని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు అన్నారు. "అలాంటి వాళ్లకు నా సమాధానం ఒక్కటే. నాకు ఎలాంటి క్రెడిట్‌ వద్దు. మొత్తం మీరే తీసుకోండి. రైతుల అభివృద్ధే మాకు ముఖ్యం. దయచేసి రైతులను తప్పుదోవ పట్టించకండి" అని  ప్రధాని మోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే పేరు రాసి మహిళ ఆత్మహత్య!!

తన ఇంటికి నడిచే దారి మూసివేయడంతో తీవ్ర మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరిగింది. అనపర్తిలోని బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో అరుణకుమారి(46) కుటుంబం నివాసం ఉంటోంది. వారు ఉంటున్న ఇంటికి దారి లేకపోవడంతో కొన్నేళ్లుగా పాఠశాల క్రీడా మైదానాన్ని దారిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల పాఠశాలకు ప్రహరీ నిర్మించడంతో దారి మూసుకుపోయింది. దారి మార్గాన్ని ఉంచి మిగిలిన స్థలంలో గోడ నిర్మాణం చేయాలని ఆ ప్రాంత మహిళలంతా స్థానిక ఎమ్మెల్యేను వేడుకున్నారు. అయినప్పటికీ దారి మూసివేస్తూ గోడ నిర్మించారు. దీంతో మనస్తాపానికి గురైన అరుణకుమారి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిని ఉద్దేశిస్తూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.   "ఎమ్మెల్యే గారు.. డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా మీ పై అభిమానంతో ఓటు వేసినందుకు తగిన బుద్ధి చెప్పారు." అంటూ అరుణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి.. వేయకపోగా.. ఉన్న దారి కూడా మూసి వేసారని పేర్కొన్నారు. దారి మూసి వేయడంతో కార్తీక మాసంలో గుడికి కూడా వెళ్ళలేక ఇబ్బంది పడ్డామని అన్నారు. సాయం చేయమని వేడుకున్నా ఎమ్మెల్యే  దయ లేకుండా వ్యవహరించడంతో చావే శరణ్యమని నిర్ణయించుకున్నానని ఆ సూసైడ్‌ నోట్‌ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ గా ప్రాణాలు కాపాడాల్సిన ఎమ్మెల్యే, వేధింపులకు గురిచేసి మహిళను బలితీసుకున్నారని మండిపడ్డారు. వారు పంచిన రూ. 2 వేలు తీసుకోకుండా వైసీపీకి ఓటు వేసినందుకు.. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిని మూయించి వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అరుణకుమారి బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. వైసీపీ నాయకులు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వారణాసిలోని గురుధామ్ కాలనీలో మోడీ కార్యాలయం ఉంది. అయితే, ఈ కార్యాలయాన్ని నలుగురు ప్రబుద్ధులు ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టేశారు. మోడీ కార్యాలయం వివరాలు, ఫొటోలను ప్రచురిస్తూ.. దీనిని రూ.7.5 కోట్లకు అమ్ముతామని ప్రకటనలో తెలిపారు. 6,500 చదరపు అడుగులు గల ఈ విల్లాలో 4 గదులు, 4 బాత్రూములు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈశాన్య ముఖద్వారంతో విల్లా ఉందని, కారు పార్కింగ్ కూడా ఉందని ప్రకటనలో తెలిపారు. మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్‌లో ప్రకటన వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఓఎల్ఎక్స్ లో ఆ ప్రకటనను తొలగింపజేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీకాంత్ ఓఝా అనే వ్యక్తి ఈ ప్రకటనను ఇచ్చాడని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

జగన్ సర్కార్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్.. 

ఏపీలో స్థానిక ఎన్నికలు జరిపే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ తాజాగా పతాక స్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం పేర్కొంది .   వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఏపీ సర్కార్ తెగేసి చెబుతోంది. ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బందిని, పోలీసులను ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సిన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది కల్గిస్తోందని ఏపీ ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం నాడు ఏపీ ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.

టీడీపీ ఒక పిలుపునిస్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు! 

ఏలూరులో వింత వ్యాధికి కారణమేమిటో కూడా చెప్పలేని అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం వైసీపీది అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రులు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... లేకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. టీడీపీ ఒక పిలుపునిస్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు అచ్చెమన్నాయుడు. జగన్ ను ఒక వింత ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. జగన్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజలు రాసుకుంటున్నారని.. అవకాశం వచ్చినప్పుడు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అచ్చెన్న చెప్పారు.  పన్నుల పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. జుట్టు మీద తప్ప మిగిలిన అన్నింటి మీద పన్నులు వేశారని విమర్శించారు. విజయవాడలో ప్రభుత్వం  నిర్వహించిన బీసీ సంక్రాంతి సభపైనా అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.ఎన్నికలు పెడితే కరోనా వస్తుందని జగన్ చెపుతున్నారని... వేల మందితో మీటింగ్ పెడితే కరోనా రాదా? అని ప్రశ్నించారు. బీసీలకు తెలుగు దేశం పార్టీ ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? అనే విషయంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ధరణి పోర్టల్ పై ఏం చేద్దాం?  శనివారం కేసీఆర్ హై లెవల్ మీటింగ్ 

ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. ప్రభుత్వ నిర్ణయాలతో పోర్టల్  లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్కార్ విధానాలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా ? లేదంటే కొత్త విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖల నిపుణులతో చర్చించి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.    వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై గురువారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్‌, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని హామీ ఇచ్చిన సర్కారు.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడింది.  స్వచ్ఛందం అంటూనే.. ఆధార్‌ తీసుకోవడమంటే కోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించడమేనని ప్రభుత్వానికి తెలియదా? అని నిలదీసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్‌ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ కాలమ్‌ తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేయాలని సూచించింది. పీటీఐఎన్‌ జారీ చేయడాన్ని కూడా నిలిపివేయాలని తెలిపింది. కులం, కుటుంబసభ్యుల వివరాలు కూడా తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

మీకు అంత నమ్మకముంటే జగన్, కేసీఆర్ లాగా చేసి చూపించండి.. బాబుకు సజ్జల కౌంటర్ 

రాజధాని అమరావతి ఉద్యమం మొదలై 365 రోజులు పూర్తైన సందర్భంగా దానికి మద్దతుగా నిన్న నిర్వహించిన జనరణభేరిలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌కు ఓ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా ఉంచాలని, లేదంటే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం నిర్వహించాలని, దీనికి సీఎం జగన్‌ సిద్ధమేనా? అని నిన్న చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవేళ ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని అయన సవాల్‌ విసిరారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ బాబుకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.   "రెఫరెండానికి రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు గతంలో ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏం చేశారో మనకు తెలిసిందే.. వారి తో ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వెళ్లారు. వైఎస్ జగన్ ‌గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెబుతోన్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా?" అని సజ్జల చంద్రబాబుకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

తల్లి అంత్యక్రియలకు పర్మీషన్ ఇవ్వలేదని బాస్ పై కత్తితో దాడి

మా అమ్మ చనిపోయింది. అంత్యక్రియలకు వెళ్లేందుకు పర్మీషన్ ఇవ్వండంటూ ఓ ఉద్యోగి కోరగా బాస్ నిరాకరించాడు. దీంతో కోపోద్రికుడైన ఆ ఉద్యోగి కత్తితో బాస్‌ ని 11 సార్లు పొడిచాడు. ఈ ఘటన దుబాయ్ లో జరిగినప్పటికీ.. అక్కడ ఉద్యోగి, బాస్ ఇద్దరూ భారతీయులు కావడం గమనార్హం.   భారత్‌ కు చెందిన 25 ఏళ్ల యువకుడు కుటుంబాన్ని పోషించేందుకు ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు దుబాయ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో యువకుడికి తన తల్లి ఆనారోగ్యం కారణంగా చనిపోయిందని బంధువులు సమాచారం ఇచ్చారు. దీంతో తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు భారత్‌ కి వెళ్లేందుకు పర్మీషన్ కావాలంటూ భారత్ కు చెందిన బాస్‌ ను రిక్వెస్ట్ చేశాడు. అందుకు బాస్.. నా చేతిలో ఏం లేదు.. అంతా కంపెనీయే చూసుకుంటుందని సున్నితంగా తిరస్కరించాడు.   అంతేకాదు 22 మంది ఉద్యోగుల్ని భారత్‌ కు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, వారి లిస్ట్ తయారు చేసి ఇవ్వాలని సదరు కంపెనీ యాజమాన్యం బాస్‌ ను ఆదేశించింది. బాస్ ఓ లిస్ట్ తయారు చేసి యాజమాన్యానికి ఇచ్చాడు. ఆ లిస్ట్ లో తానుకూడా ఉంటానని బాధితుడు అనుకున్నాడు. కానీ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో బాస్ తో గొడవపెట్టుకున్నాడు. తన చేతిలో ఏమీ లేదని, అంతా కంపెనీయే చూసుకుంటుందని బాస్ మళ్లీ చెప్పడంతో కోపోద్రికుడైన ఉద్యోగి.. బాస్ ను కత్తితో 11 పోట్లు పోడిచాడు. అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం బాస్ ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అదృష్టం బాగుండి బాస్  ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా, బాస్ పై కత్తితో దాడి చేసిన ఉద్యోగిపై కేసు నమోదైంది. జనవరి 10న దుబాయ్ కోర్ట్ కేసును విచారించనుంది.

ముళ్లతీగలతో 2 వేల కిలోమీటర్ల గోడ! చైనా మరో వివాదాస్పద నిర్మాణం

సంచనాలకు మారుపేరుగా నిలిచే చైనా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్మాణం చేపట్టింది. మయాన్మార్‌తో సరిహద్దు వెంబడి అత్యంత పొడవైన గోడను  నిర్మిస్తోంది.  తాజాగా వెలుగు చూసిన ముళ్లతీగలతో ఏర్పాటు చేస్తున్న ఈ గోడ ఏకంగా 2 వేల కిలోమీటర్ల పొడవు ఉంటుందని సమాచారం. మయాన్మార్ మీడియా వార్తల ప్రకరాం.. డిసెంబర్‌లో ఈ ముళ్లగొడ ఏర్పాటు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చైనా కమ్యునిష్టు సర్కార్ చేపట్టిన ఈ నిర్మాణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మయాన్మార్‌ నుంచి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమచొరబాటు దారుల్ని అడ్డుకోవడం కోసమే ముళ్ల తీగలతో గోడ నిర్మిస్తున్నామని చైనా చెబుతోంది.  కాని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మత్రం చైనా వాదనను కొట్టిపారేస్తున్నారు. చైనాలోని ప్రభుత్వవ్యతిరేకులు, తిరుగుబాటు దారులు దేశసరిహద్దు దాటకుండా ఉండేందుకే  ఈ చర్యకు పూనుకుందని  చెబుతున్నారు.  మయన్మార్ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న గోడపై అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా కారణంగా రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.  మయాన్మార్ కూడా చైనా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ అధికారులు చైనా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య 1961లో కుదిరిన సరిహద్దు ఒప్పందం గురించి లేఖలో ప్రస్తావించారు. అప్పటి  ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ వెంబడి ఇరు వైపులా 10 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదని,   చైనా  ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గోడ నిర్మిస్తుందని మయమ్నార్ ఆర్మీ అధికారులు లేఖలో స్పష్టం చేశారు.

సీనియర్ అధికారులపై నిఘా! సీఎస్ పై తిరుగుబాటు మొదలైందా? 

తెలంగాణ సచివాలయంలో కోల్డ్ వార్ నడుస్తోందా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీనియర్ అధికారులు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఐఏఎస్ ల మధ్య కొట్లాటతో పాలన పడకేసిందా? తెలంగాణ సచివాలయంలో జరుగుతున్న పరిణామాలతో అందరికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రం సచివాలయం. అలాంటి సచివాలయంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ కు సీనియర్ ఐఏఎస్ లకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.  సీఎం కేసీఆర్ సచివాలయం రాక పోవడంతో సీఎస్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం తరహాలోనే సీఎస్ సచివాలయంలో సమాంతర వ్యవస్థను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది నచ్చని కొందరు అధికారులు ఆయన్ను ప్రశ్నించారని, దీంతో విభేదాలు పెరిగిపోయాయని తెలుస్తోంది.    సీనియర్లు అధికారులు తనకు సహకరించకపోవడంతో వారిపై సీఎస్ సోమేష్ కుమార్ నిఘా పెట్టారనే చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారుల  కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే అధికారులకు సీఎస్  అప్పగించారని సమాచారం. ఈ విషయం తెలిసి  ఇప్పుడు సచివాలయంలో చాలా మంది అధికారులు ప్రైవేట్​ అంశాలను కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం లేదని చెబుతున్నారు. నిఘా ఉందని తెలియడంతో ఉన్నతాధికారులు సీఎస్​ తో బహిరంగంగానే వివాదాలకు దిగుతున్నారట. సచివాలయంలో ప్రస్తుతం అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. సీఎస్​ కాకముందు తాము చూసిన సోమేశ్​ కుమార్​కు, ఇప్పటి సోమేశ్ కుమార్‌కు చాలా వ్యత్యాసం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట అధికారులు.    సీఎస్ సోమేష్ కుమార్ తీరుపై పై చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. చిన్న చిన్న అంశాలు, సాధారణ, పరిపాలనా విషయాలలోనూ ఆయన​ జోక్యం పెరిగిపోయిందని  గతంలో కొందరు అధికారులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్లు కూడా సీఎస్​పై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొందరు ఐఏఎస్​ల వ్యవహారంలో సీఎస్​ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. రిజిస్ట్రేషన్ల​ శాఖలో సీఎస్​పై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని తెలుస్తోంది. ఆ శాఖలోని చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు మండిపడుతున్నారు. తమ శాఖను సీఎం ముందు పని లేని విభాగంగా మార్చేందుకు సీఎస్​ ప్రయత్నాలు చేశారనే కోపం వారిలో ఉంది. సీఎస్​ నివేదిక ఆధారంగానే సీఎం కూడా రిజిస్ట్రేషన్​ శాఖను పూర్తిగా రెవెన్యూలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని వాళ్లు భావిస్తున్నారట.    నిజానికి సోమేశ్ ఏపీ కేడర్ అయినప్పటికీ  ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కన్నా సీనియర్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా నమ్మకంతో సీఎస్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు కేసీఆర్. సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కలిసి రాలేదు. ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి, ఎల్​ఆర్​ఎస్​ వంటి స్కీంలు జనాగ్రహానికి కారణమయ్యాయి. ఈ రెండు పథకాల ప్రతిపాదనలు సోమేష్ కుమార్ తెచ్చినవే.  జీహెచ్​ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ ఓటమికి ఇది కూడా కారణమంటూ సీఎం కేసీఆర్​కు నివేదిక అందిందని, సీఎస్ ను కేసీఆర్ సీరియస్​గా మందలించినట్లు ప్రచారం జరిగింది. సీఎస్ ను మార్చతారని కూడా చర్చ జరిగింది.  అయితే తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గమే ఇలాంటి ప్రచారం చేసిందని సోమేష్ కుమార్ భావిస్తున్నారని చెబుతున్నారు.

కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే గ్రేటర్ మేయర్ ఎంపిక ఆలస్యం! 

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ంసీ మేయర్ సీటు కోసం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే మేయర్ ఎంపికను అధికార పార్చీ ఆలస్యం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. తమ కార్పొరేటర్ల జోలికి వస్తే వంద మంది ఎమ్మెల్యేలను లాగుతామని హెచ్చరించారు. హైదరాబాద్ ఓల్ట్ సిటీ సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ వియుక్త హైదరాబాద్‌ను సాధిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై కేసీఆర్‌ను ఒవైసీ ఎందుకు అడగడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.  చార్మినార్  భాగ్యలక్ష్మీ అమ్మవారిని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవినీతికి పాల్పడనని.. అభివృద్ధికి తోడ్పడుతానని బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు సంజయ్. ఈ సందర్భంగా మట్లాడిన సంజయ్..  హైదరాబాద్ నగర అభివృద్ధికి బీజేపీ తప్పకుండా సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు బండి  సంజయ్.