త్వరలో రాజ్యసభకు జస్టిస్ చలమేశ్వర్? ఢిల్లీలో పట్టు కోసం జగన్ ప్లాన్!
posted on Dec 17, 2020 @ 1:56PM
చంద్రబాబు టార్గెట్ గా దూకుడు పెంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపనున్నారని సమాచారం. ఏపీకి సంబంధించి వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకదానికి వైసీపీ అభ్యర్థిగా జస్టిస్ చలమేశ్వర్ ను ఇప్పటికే జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లేందుకు జస్టిస్ చలమేశ్వర్ కుడా అంగీకరించారని చెబుతున్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కు కీలక బాధ్యతలు ఇవ్వాలనుకోవం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంటుందని, ఢిల్లీ స్థాయిలో తనకు ఇబ్బంది లేకుండా చూసేందుకే జగన్ ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఇటీవలే జస్టిస్ చలమేశ్వర్ కుమారుడికి వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. జాస్తి నాగభూషణ్‌ను అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుబ్రమణ్యం శ్రీరామ్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సేవలు అందిస్తున్నారు. అయినా జాస్తి నాగభూషన్ ను కూడా రెండో అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది జగన్ సర్కార్. ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరును ఆక్షేపిస్తూ సీఎం జగన్ సీజేఐకి ఎనిమిది పేజీల లేఖ రాయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రిని కలిసి జగన్ పలు నివేదికలు కూడా సమర్పించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు ఢిల్లీకి వెళ్లినవారిలో జాస్తి నాగభూషణ్ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుమారుడు కావడంతో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అందరూ అనుకున్నారు. ఇప్పుడు నాగభూషణ్‌ను అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమించడంతో జగన్ బలమైన వ్యూహంలో ఉన్నారని భావిస్తున్నారు.
ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరుపై సీజేఐకి రాసిన లేఖలో జస్టిస్ చలమేశ్వర్, మాజీ ఏజీ దమ్మాలపాటి పేర్లు కూడా ప్రస్తావించారు జగన్. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జడ్జిలుగా ఉన్నవారి నియామకాలు, గతంలో దమ్మలపాటికి అనుకూలంగా వెలువడిన ఉత్తర్వులను ప్రముఖంగా పేర్కొన్నారు. గతంలో జస్టిస్ రమణ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు.. న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కు అనుకూలంగా పలు ఉత్తర్వులు ఇచ్చారని, గతంలో ఓ ఐదుగురు జడ్జిల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం.. అప్పటి సీఎం చంద్రబాబు అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని.. ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ స్వయంగా చెప్పారని కూడా సీఎం జగన్ లేఖలో పేర్కొనడం సంచలనం రేపింది. దీంతో సుప్రీంకోర్టు సీజేఐకి జగన్ రాసిన లేఖ వెనక జస్టిస్ చలమేశ్వర్ ప్రమేయం ఉందనే చర్చ జరిగింది. జగన్ తో పాటు ఢిల్లీకి వెళ్లిన వారిలో జస్టిస్ నాగభూషణం కూడా ఉండటంతో ఈ వాదనకు అప్పుడు బలం చేకూరింది.
ఏపీ సీఎం జగన్ తో జస్టిస్ చలమేశ్వర్ కుటుంబానికి చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబుతో విభేదాలున్న జస్టిస్ చలమేశ్వర్.. ఆయనకు వ్యతిరేకంగా జగన్ కు దగ్గరయ్యారని చెబుతారు. జస్టిస్ చలమేశ్వర్ తో పాటు ఆయన కుమారుడు జగన్ కు కీలక సమయాల్లో అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుసార్లు ఆయనను కలిశారు జస్టిస్ చలమేశ్వర్. 2019 జూన్ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు చలమేశ్వర్ పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి 30న సుప్రీంకోర్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు సీఎం జగన్.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు నందమూరి కుటుంబంతో చాలా దగ్గరి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లీగల్ వ్యవహారాలన్ని జస్టిస్ చలమేశ్వరే చూసేవారట. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ పాడె మోశారు. అంత దగ్గరి అనుబంధం వారికి ఉంది. అయితే చంద్రబాబుతో మాత్రం మొదటి నుంచి జస్టిస్ చలమేశ్వర్ కు సఖ్యత లేదని చెబుతారు. జస్టిస్ రమణకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో జస్టిస్ చలమేశ్వర్ ఆయనకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయ వ్యవస్థలో బలంగా ఉన్న చంద్రబాబును దెబ్బ కొట్టడానికి జస్టిస్ చలమేశ్వర్ ను అస్త్రంగా జగన్ వాడుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడికి జగన్ కీలక బాధ్యతలు ఇవ్వడమే చర్చనీయాంశం కాగా.. త్వరలో జస్టిస్ చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపిస్తున్నారనే విషయం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.