కేసీఆర్ పై కమలం దూకుడేనా? కాళేశ్వరానికి బ్రేకులు అందుకేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తుస్సమందా? కేసీఆర్ కు కమలం ఉచ్చు బిగిస్తోందా? బండి సంజయ్ కి బీజేపీ హైకమాండ్ ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర సర్కార్ నిర్ణయాలు, బీజేపీ హైకమాండ్ వ్యూహాలు కూడా అలాంటి సంకేతమే ఇస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని గంటలకే కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ప్రణాళికకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెడ్ సిగ్నల్ చూపింది. రెండు టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌కు మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకున్నదని, డిజైన్ మార్పుతో మూడో టీఎంసీకి ప్రణాళిక రూపొందించడం కొత్తదానిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించిన తర్వాత హైడ్రాలజీ అధ్యయనం, సాంకేతిక అంశాల పరిశీలన, అంచనా వ్యయం, పర్యావరణ ప్రభావం, అంతర్ రాష్ట్ర అంశాలు తదితరాలన్నింటిపై స్టడీ పూర్తయిన తర్వాత మాత్రమే తగిన అనుమతులు తీసుకోవాలని కేంద్ర జలవనరుల తేల్చిచెప్పింది.
ఈనెల 11న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. మొదటగా కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ నే కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇరిగేషన్ సమస్యలతో పాటు గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో చేపడుతున్నమూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతిపైనే కేంద్ర మంత్రి ప్రధానంగా చర్చించారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాని ఇప్పుడు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్రం కొర్రీలు వేయడం.. అది కూడా ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి కలిసి వచ్చిన కొన్ని గంటల్లోనే జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తాజా నిర్ణయంతో కేసీఆర్ పై బీజేపీ ఆగ్రహంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీని ఇరుకున పెట్టేందుకే కేసీఆర్ హస్తిన వచ్చారని భావిస్తున్న కేంద్ర పెద్దలు.. ఆయనకు కౌంటర్ వ్యూహం అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ ఎత్తిపోతకు బ్రేక్ వేశారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
దాదాపు 14 నెలల తర్వాత గత శుక్రవారం సడెన్ గా హస్తినకు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్.. మోడీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల కోసం కేంద్రంతో యుద్ధం చేస్తామని కూడా ప్రకటించారు. రైతులకు మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ ఫ్లైటెక్కారు కేసీఆర్. ఢిల్లీలోనూ బిజిబిజీగా గడిపారు గులాబీ బాస్. మొదటి రోజే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవగా.. శనివారం ప్రధాని మోడీని కలిశారు. మాములుగా శని, ఆది వారాలు పీఎంవో ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వదు. కాని శనివారం రోజు కేసీఆర్ తో ప్రధాని మోడీ 45 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. బీజేపీతో రాజీ కోసమే కేసీఆర్ హస్తిన వెళ్లారని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తన అవినీతి బయటకి రాకుండా బీజేపీ పెద్దలకు మోకరిల్లారని మండిపడ్డారు. వామపక్ష నేతలు కూడా గులాబీ అధినేత, బీజేపీ పెద్దల సమావేశాలపై తీవ్రంగా స్పందించారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోడీ, అమిత్ షాలతో సమావేశం కావడం తెలంగాణ బీజేపీలోనూ కలకలం రేపింది. ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియక కమలం నేతలు టెన్షన్ పడ్డారు. కేసీఆర్ సర్కార్ పై దూకుడుగా వెళుతున్న సమయంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలు తమకు ఇబ్బందిగా మారాయనే చర్చ తెలంగాణ బీజేపీ నేతల నుంచి వచ్చింది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు నిజంగానే బీజేపీతో కేసీఆర్ రాజీ అయ్యారనే చర్చలు జనాల్లోనూ జరిగాయి. అయితే కేసీఆర్ పర్యటన తర్వాత బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలతో.. ఢిల్లీలో ఆయన చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న కమలం దళం.. కేసీఆర్ ను ఇరికించే వ్యూహాలకే పదును పెడుతుందని చెబుతున్నారు. అందులో భాగంగానే బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిపించారని టాక్. కేసీఆర్ సర్కార్ పై ఎలా ముందుకు వెళ్లాలి, గులాబీ పార్టీని ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై హైకమాండ్ నుంచి సంజయ్ కి రోడ్ మ్యాప్ రావొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ తో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచి.. గులాబీ పార్టీలో మరింత గుబులు రేపేలా కాషాయం దళం కార్యాచరణ ఉండబోతుందంటున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్లే కేసీఆర్ కూడా దిగొచ్చారని చెబుతున్నారు. అందుకే ఇంత కాలం పట్టించుకోని ఉద్యోగ నియామకాలపై ఫోకస్ చేశారనే చర్చ జరుగుతోంది. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు సడెన్ గా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని చెబుతున్నారు. సర్కార్ పై కోపంగా ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు.. మూడేండ్లుగా పెండింగులో ఉన్న పీఆర్సీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వంపై ప్రజా గ్రహానికి కారణమైందని భావిస్తున్న ఎల్ఆర్ఎస్ పైనా రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని, ప్రజలకు భారీ ఊరట ఇచ్చేలా ఆ నిర్ణయం ఉండవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతోనే కేసీఆర్ మళ్లీ జనాలకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.