విశాఖలో ఆ వైసీపీ నేత చెప్పిందే వేదం! తిరగబడేందుకు సొంత పార్టీ నేతల వ్యూహం
posted on Dec 17, 2020 @ 2:39PM
అనుకున్నదొకటి.. అయిందొక్కటి బొల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా. ఈ పాట అంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతోంది. ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రతిపాదించింది జగన్ పార్టీ. ఈ విషయం ఇంకా తేలనప్పటికి.. పరిపాలనా రాజధానిగా ప్రకటించినందున ఉత్తరాంధ్రలో తమకు తిరుగే ఉండదని, వైజాగ్ జనమంతా జగన్ కే జై కొడతారని వైసీపీ భావించింది. కాని ఇప్పుడక్కడ సీన్ రివర్స్ గా మారింది. వైసీపీ పేరు చెబితేనే విశాఖ వాసులు భగ్గుమంటున్నారు. రాజకీయాల కోసం నగరాన్ని నాశనం చేశారని మండిపడుతున్నారు. విశాఖ జనాల్లోనే కాదు వైసీపీ నేతల నుంచి కూడా ఇదే అభిప్రాయం వస్తోంది. విశాఖను తన అడ్డాగా చెప్పుకుంటున్న ఓ వైసీపీ ముఖ్య నేత మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఫ్యాన్ పార్టీ నేతలు ఫైరవుతున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే సదరు నేత విశాఖలోనే తన రాజకీయమంతా చేస్తున్నారు. విశాఖ పాలనా యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో ఉంచుకున్నారని చెబుతున్నారు. సీఎంకు దగ్గరి వ్యక్తి కావడంతో అధికారులు కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారట. దీంతో విశాఖలో సదరు నేత చెప్పిందే వేదంగా తయారైందట. ఆ నేత దూకుడుతో జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు జీరోలుగా మిగిలిపోయారనే ప్రచారం జరుగుతోంది. సదరు నేతకు చెప్పకుండా చిన్న కార్యక్రమం కూడా విశాఖలో జరగడం లేదంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఊహించుకోవచ్చు. ఆ నేత తీరుతో విసిగిపోయిన విశాఖ వైసీపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. అయినా ఆ నేత తన తీరు మార్చుకోవడం లేదట.
సదరు నేత తీరుతో విసిగిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు గత నవంబర్ లో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో అతన్ని టార్గెట్ చేశారు. సదరు నేత చేసిన రాజకీయ నేతల అవినీతి' వ్యాఖ్యలపై ఒక ఎమ్మెల్యే ఓ రేంజ్ లో పైర్ కావడంతో సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అవాక్కయ్యారు. వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విశాఖ వైసీపీ పరిణామాలపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యారు. ఆ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి తో చర్చించిన సీఎం జగన్.. వైసీపీ లీడర్లను తాడేపల్లికి పిలిపించుకుని మందలించారు. నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. గొడవలు పక్కకు పెట్టి పార్టీ అభివృద్ధికి పాటుపడాలంటూ క్లాస్ పికారు.
అయితే సీఎం జగన్ క్లాస్ పీకినా సదరు నేత తీరు మారలేదట. మళ్లీ ఎప్పటిలానే విశాఖలో తన పెత్తనం సాగిస్తున్నారట. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ మంత్రి ఒకరు విశాఖ వెళ్లగా.. జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులంతా సదరు నేతపై ఆయనకు ఫిర్యాదు చేశారట. అతనితో తామే ఏగలేకపోతున్నామని, కంట్రోల్ చేయకపోతే విశాఖలో పార్టీకి భవిష్యతే ఉండదని చెప్పారట. అన్ని పనులు అతను చెప్పినట్లే జరిగితే ఇక మేమెందుకని కొందరు నేతలు ఆ సీనియర్ మంత్రి దగ్గర అసహనం వ్యక్తం చేశారట. జిల్లాకు చెందిన మంత్రులు కూడా తామ ఉత్సవ విగ్రహాలుగా మిగిలాం తప్ప ఏం చేయలేకపోతున్నామని బాధపడ్డారట. సీఎంకు దగ్గరి వ్యక్తి కావడంతో తాను ఏం చేయలేనంటూ ఆ సీనియర్ మంత్రి వారి దగ్గర చేతులెత్తేశారట.
విశాఖ ఎయిర్ పోర్టును మూసేయాలని కేంద్రానికి సదరు నేత రాసిన లేఖ కూడా కలకలం రేపింది. అత్యంత రహస్యంగా ఉంచిన ఆ లేఖ.. కేంద్ర మంత్రి ద్వారానే వెలుగులోకి రావడంతో విశాఖ వాసులు షాకయ్యారు. నవంబర్ లో కేంద్ర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరిని కలిశారు సదరు నేత. బోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. విశాఖ ఎయిర్ పోర్టు 30 ఏళ్ల పాటు మూసేయమని కోరారు. అలా అయితేనే దూరంగా కడుతున్న బోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత వరకూ భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపనే జరగలేదు. అప్పుడే విశాఖ ఎయిర్ పోర్టు మూత గురించి.. విజయసాయిరెడ్డి విజ్ఞాపనా పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని గత ప్రభుత్వం అనుకుంది. జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. అయితే అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి రాగానే కాంట్రాక్టును రద్దు చేసింది. కొద్ది రోజులు సైలెంట్‌గా ఉండి… గతంలో కేటాయించిన భూమిలో ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకుని మళ్లీ ఆ జీఎమ్మార్ సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించింది. ఇప్పుడున్న విశాఖ ఎయిర్ పోర్టు మూసేసి.. ఒక్క భోగాపురం మాత్రమే రన్ చేసేలా.. చూస్తామన్న హామీని జీఎమ్మాప్ సంస్థ ఏపీ సర్కార్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టు ప్రజల సెంటిమెంట్. మెట్రోపాలిటన్ నగరంగా ఎదుగుతున్న విశాఖకు ఆ ఎయిర్‌పోర్టు ఓ బ్రాండ్‌గా ఉంది. దాన్ని ప్రజలు తమ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అలాంటి ఎయిర్‌పోర్టును మూసివేయాలని విజయసాయిరెడ్డి లేఖ రాయడం విశాఖ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా కనిపించింది. దీంతో సాధారణ ప్రజల్లోనూ విజయసాయి లేఖపై వ్యతిరేకత వచ్చింది. అసలు విశాఖ ఎయిర్‌పోర్టుపై అంత జబర్దస్తీగా లేఖ రాయడానికి విజయసాయి ఎవరన్న మౌలికమైన ప్రశ్న ప్రధానంగా వినిపించింది. విశాఖ ఎయిర్ పోర్టుకు విజయసాయికి సంబంధం ఏమిటనే మౌలికమైన ప్రశ్నలు విశాఖ వాసుల నుంచి వచ్చాయి. విశాఖకు.. విజయసాయికి సంబంధం ఏమిటని రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించాయి. ఇలా వరుస వివాదాలకు కారాణమవుతున్న సదరు నేతపై విశాఖ వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. మరోసారి సీఎం జగన్ కు ఫిర్యాదు చేసి అతనితో తాడోపేడా తేల్చుకోవాలని కూడా కొందరు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.వైసీపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన రాజకీయ అనలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సదరు నేత తీరు మార్చుకోకపోతే పరిపాలనా రాజధానిగా ప్రకటించినా కూడా విశాఖలో వైసీపీకి కష్టాలు ఉంటాయనే చెబుతున్నారు.