ఆరుగురు యూకే ప్రయాణికులకు కరోనా? ఇండియాకు  కొత్త వైరస్ వచ్చేసిందా? 

యునైటెడ్ కింగ్ డమ్ ను వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ ఇండియాను హడలెత్తిస్తోంది. యూకే నుంచి సోమవారం రాత్రి ఇండియాకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. వీరికి రూపాంతరం చెందిన వైరస్ సోకిందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. యూకే నుంచి ఎయిర్ ఇండియా విమానం సోమవారం రాత్రి 10.40గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ ఆరుగురు ప్రయాణికుల్లో ఒకరు చెన్నైకి కనెక్టింగ్ విమానం ద్వారా వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ విమానంలో క్రూ సిబ్బందితో సహా మొత్తం 266 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి సోకింది కొత్త వైరస్ అనే విషయమై ఇంకా స్పష్టత లేదని ప్రభుత్వ అధికారి అవనీశ్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాప్ పంపించామని.. పరీక్షల ఫలితాలు వచ్చాకే కరోనా సోకింది లేనిది తెలుస్తుందని చెప్పారు.       యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా నిర్దారణ కావడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. యూకేలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి యూకే నుంచి వచ్చే అన్నిరకాల విమానాల రాకపోకలపై భారత్ కూడా నిషేధం విధించింది. ఈ నిషేధ డిసెంబర్ 31వరకు అమలులో ఉంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

కేసీఆర్, జగన్ బీజేపీ మిత్రులేనా ? మమత అందుకే పిలవడం లేదా? 

ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్న నేతకు దిక్కు లేకుండా పోయిందా?ఏపీ,  తెలంగాణ ముఖ్యమంత్రులను ప్రాంతీయ పార్టీల నేతలెవరు నమ్మడం లేదా? జగన్, కేసీఆర్ ను కమలం పార్టీ మనిషిగానే చూస్తున్నారా?.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో ఇదే నిజమేనని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో త్వరలో సమావేశం కాబోతున్నారు. కోల్ కతాలో జరగనున్న ఈ సమావేశానికి పలు పార్టీ నేతలను మమత ఆహ్వానించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కోల్ కతా ఆహ్వానం రాలేదు. మమతా బెనర్జీ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నేతలకు ఆహ్వానం రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మమత ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది.  ప్రస్తుతం బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య యుద్దమే నడుస్తోంది. బెంగాల్ లో పనిచేస్తున్న ఐపీఎస్ లను రాష్ట్ర సర్కార్ తో సంబంధం లేకుండా కేంద్రం బదిలీ చేయడంపై మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంలో డీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేష్ భగల్, అశోక్ గెహ్లాట్‌ మమతకు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ మాత్రం స్పందించలేదు. అటు జగన్ కూడా మాట్లాడలేదు.  బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మోడీ, అమిత్ షా లాంటి వారు నిప్పులు చెరుగుతుంటే ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతకు అండగా నిలిచారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం మద్దతుగా నిలవలేదు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మమతను కలిసిన కేసీఆర్.. బీజేపీపై యుద్దం చేస్తానన్న కేసీఆర్.. బీజేపీతో చిక్కులు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి బాసటగా నిలవకపోవడం ఇతర ప్రాంతీయ పార్టీ నేతలను విస్మయపరిచిందని చెబుతున్నారు. కేసీఆర్ కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన్ను బీజేపీ సపోర్టర్ గానే చూస్తున్నారట ప్రాంతీయ పార్టీల నేతలు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన కూడా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకే బీజేపీ డైరెక్షన్ లో వచ్చిందేనని కొందరు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే కేసీఆర్ ను తన సమావేశానికి మమత బెనర్జీ పిలవలేదని తెలుస్తోంది. రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పుడూ ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.  బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెడతానని పలు సార్లు ప్రకటించారు గులాబీ బాస్. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంత వర్కవుట్  కూడా చేశారు. భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్, చెన్నైలో స్టాలిన్ ను కలిశారు కేసీఆర్. బెంగళూరులో కుమారస్వామి, లక్నోలో మాయావతిని కలిసి చర్చించారు. కోల్ కతా వెళ్లి మమతా బెనర్జీతోనూ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపారు కేసీఆర్. శరద్ పవార్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోనూ సంప్రదింపులు జరిపానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హడావుడి చూసిన వారంతా ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెట్టడం ఖాయమనుకున్నారు. కాని లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడంతో  గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎయిరిండియా, బొగ్గు గనులు వంటివి ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రభుత్వంపై ఒక యుద్ధమే ప్రకటించారు గులాబీ బాస్. అయితే  గ్రేటర్ ఎన్నికల తర్వాత మళ్లీ మెత్తబడ్డారు కేసీఆర్. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఆ సమయంలో రైతు సమస్యలను ప్రస్తావించలేదని సమాచారం .  కేసీఆర్ తీరు, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియకపోవడంతో ప్రాంతీయ పార్టీ నేతలెవరు ఆయనను నమ్మడం లేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ముందు నుంచి బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో సమర్ధించింది వైసీపీ. జగన్ కూడా ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు. దీంతో జగన్ ను కూడా బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు నమ్మడం లేదని తెలుస్తోంది. అందుకే వీరిద్దరిని మమతా బెనర్జీ సమావేశానికి ఆహ్వానించలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మమతా బెనర్జీ సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం రాకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశర్ రెడ్డి కూడా  హాట్ కామెంట్స్ చేశారు. మమతతో పాటు, శరద్ పవార్, స్టాలిన్, నవీన్ పట్నాయక్‌లు కేసీఆర్‌ను నమ్మడం లేదని చెప్పారు.  బీజేపీ మరియు టీఆర్ఎస్‌లు రెండు రహస్య ఒప్పందంపై పయనిస్తూ ప్రజలను పిచ్చివారిని చేస్తున్నాని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడ్డారేమో అందుకే ఢిల్లీ వెళ్లి రాజీ చేసుకున్నారని కొండా ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎందుకు ఉన్నఫలంగా స్టాండ్ మార్చుకుంటున్నారని కొండా విశ్వేశర్ రెడ్డి ప్రశ్నించారు.

అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు జగనేనన్న వైసీపీ ఎమ్మెల్యే! 

'అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే... అది జగన్ మాత్రమే' . ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత  కాదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు...   సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలకు అక్కడున్న వైసీపీ నేతలంతా చప్పట్లు కొట్టారు. అయితే అసలు విషయం గ్రహించి తర్వాత అంతా నాలుక కరుచుకున్నారు. ఎందుకంటే జగన్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే  కడుబండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసినవి.  జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నీతివంతమైన పాలన అనబోయి పొరపాటున అవినీతి పాలన అని అనేశారట. ఎమ్మెల్యే ఏం మాట్లాడారో గమనించకుండానే పక్కనున్న నేతలు, వైసీపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టడం ఇక్కడ మరో విశేషం.  రాజకీయ నాయకులు ప్రసంగించేటప్పుడు ఒక్కోసారి పొరపాటున చేసే వ్యాఖ్యలు వారిని ఎంతో ఇబ్బందిలోకి నెడుతుంటాయి. చిన్న స్థాయి నేతలే కాదు పెద్దపెద్ద నాయకులు కూడా మాటల మధ్యలో నాలుక జారుతూ కష్టాల్లో పడుతుంటారు. ఆ తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.. సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే నిజమే మాట్లారంటూ టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. 

జీసస్ కావాలా? ఏడుకొండలవాడు కావాలా? తేల్చుకోండి.. వైసీపీ ఎమ్మెల్యేకు బీజేపీ సూటి ప్రశ్న

పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అయన తన పేరును క్రిస్మస్ వేడుకల పోస్టర్లలో వేయించుకోవడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి తప్పు పట్టారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న పార్థసారధి ఇలాంటి పని చేయడం దారుణమని విమర్శించారు. ఈరోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ " ఏసు కావాలా? వెంకన్న కావాలా? అనేది టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నపార్థసారథి తేల్చుకోవాలన్నారు. ఆయన కనుక క్రిస్మస్ వేడుకలకు హాజరై.. తిరుమల పాలకమండలికి వస్తే తాము అడుగు పెట్టనీయమని భాను ప్రకాష్ హెచ్చరించారు. అవసరమైతే దాడులు చేసైనా ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.   గతంలో తాము చాలా పోరాటాలు చేశామని, ఎంతటి తీవ్రమైన కార్యక్రమానికైనా వెనుకాడబోమని భానుప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఆర్.ఎస్.ఎస్ స్టిక్కర్‌ ఉన్న కారును అలిపిరి వద్ద ఆపి పోలీసులు స్టిక్కర్ ను తొలగించారని, ఇది చాలా తప్పని అన్నారు. ఇలాంటివి ఘటనలు మళ్లీ జరిగితే బాగుండదన్నారు. ఇదే సమయంలో టీటీడీలో పని చేసే ఉన్నతాధికారులు కూడా క్రిస్మస్ సందర్భంగా వారి ఇంటి ముందు స్టార్లు పెట్టడాన్ని అయన తప్పు పట్టారు. ఇలాంటి విషయాలపై టీటీడీ నిఘా పెట్టి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని ఇతర ప్రభుత్వశాఖలకు బదిలీ చేయాలని భానుప్రకాశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

కొత్త కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్.. రెండు రోజుల్లో 6 లక్షల కోట్లు ఢమాల్  

బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడడంతో ప్రపంచం మొత్తం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనకు తెలిసిన కరోనా తీరుకు ఈ కొత్త రకం భిన్నంగా ఉండటమేకాదు.. 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దీంతో.. చాలా దేశాలు భయానికి గురై.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నిన్నటి అమెరికా, యూరప్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో, ఈరోజు ఆసియా మార్కెట్లు కూడా అదే బాట పట్టాయి. దీని ప్రభావం తాజాగా భారత్ స్టాక్ మార్కెట్ పై కూడా పడింది.   నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. ఈరోజు ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 0.60 శాతం నష్టంతో 45,240 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దీంతో రెండు సెషన్ల వ్యవధిలోనే స్టాక్ మదుపరులు దాదాపు రూ. 6 లక్షల కోట్లను నష్టపోయినట్లయింది. ఇక ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే, 0.76 శాతం పడిపోయి 13,220 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

పుట్టినరోజే అబద్దాలా?.. జగన్ పథకం గుట్టు బయటపెట్టిన బీజేపీ!

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే  కోసం 'వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష' పేరుతో సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మర్చి ప్రచారం చేసుకుంటున్నారని.. సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినా.. ఆయనలో ఇప్పటికీ కాంగ్రెస్ సంస్కృతి, భావజాలమే ఉందని విమర్శించారు. పుట్టినరోజు నాడు కూడా జగన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.    ప్రజల స్థలాను రక్షించడం కోసం, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం 'స్వామిత్వ'ను ప్రవేశపెడితే.. దానికి 'వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష' అని పేరు మార్చి ప్రారంభోత్సవం చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. పేర్లు మార్చి ప్రజలను ఎన్నాళ్ళు ఏమార్చగలరని నిలదీశారు. పథకానికి కనీసం ప్రధాని మోదీ ఫొటోను కూడా పెట్టరా? అని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు జగన్ సొంత పేరుని పెట్టుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గత ఆరేళ్ల పాలనలో ప్రధాని మోదీ వేలాది సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని.. కానీ, ఏ ఒక్క పథకానికి సొంత పేరును పెట్టుకోలేదని.. ప్రధానిని చూసి జగన్ నేర్చుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి హితవు పలికారు.

సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్ 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు వచ్చాయని సంతోషించేలోగానే  కొత్త రూపంలో కరోనా దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. దక్షిణ లండన్‌లో గత అక్టోబర్‌లో బయటపడిన ఈ కొత్త కరోనా వైరస్..  డిసెంబర్‌ నాటికి వేగంగా వ్యాపిస్తోంది. యూరప్‌లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్‌ జాడలు కనిపిస్తున్నాయి.   బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోయాయి. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన 33,364 కేసులు నమోదయ్యాయి.  గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వేరియంట్‌ వైరస్‌ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు.కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్‌ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు.  దక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్‌ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త   చర్యలు పాటించకపోతే కరోనా వైరస్‌ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ  డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్‌ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని ప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని రాకేష్ మిశ్రా.  కొత్త వైరస్‌ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్‌లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు వైరస్‌లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్‌లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు.

విశాఖ మరో ఏలూరు కానుందా?..

ఏలూరు వాసులను ఇటీవల అంతుచిక్కని వ్యాధి వణికించిన సంగతి తెలిసిందే. కళ్లు తిరిగి పడిపోవడం, నోటి నుంచి నురగ, తలపోటు తదితర లక్షణాలతో 600 మందికి పైగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అయితే, నీటి కాలుష్యమే ఈ వింత వ్యాధికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, నీటి కాలుష్యాన్ని నివారించకపోతే ఏలూరులో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లుగా.. విశాఖలోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందన్న ఆందోళన కనిపిస్తోంది.   ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తరువాత విశాఖ వాసుల్లో భయం మొదలైంది. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చేసిన అధ్యయనం ప్రకారం నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్న నగరాల్లో విశాఖ ఒకటి. మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) ద్వారా సరఫరా అవుతున్న నీరు అనేక చోట్ల కలుషితమవుతోందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. విశాఖలో పారిశ్రామిక కాలుష్యం, నీటి సరఫరా లైన్లు డ్రైనేజీల మధ్య ఉండటం, వ్యర్థాలు రిజర్వాయర్లలోకి వదలడం వల్ల నీరు కలుషితమవుతోంది.   ముఖ్యంగా మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం విశాఖవాసులను ఆందోళన కలిగిస్తోంది. విశాఖ వాసుల నీటి అవసరాలకు ఏలేరు, మేఘాద్రి గెడ్డ, ముడసరలోవ, రైవాడ, తాటిపూడి, గంభీరం రిజర్వాయర్లే ఆధారం. అయితే, మేఘాద్రి గెడ్డ రిజర్వాయరులో వ్యర్థాలు చేరుతున్నాయి. పెందుర్తి, సబ్బవరం, నవర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలతో కూడిన నీరే ఎక్కువ శాతం ఈ రిజర్వాయర్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం కలవరపెడుతోంది.    మరోవైపు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరూ ఇందులోకే తెచ్చి ఇతర రిజర్వాయర్లకు తీసుకెళ్లే ప్రణాళికా నడుస్తోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిండంతో నగర విస్తరణ జరిగే అవకాశముంది. దీంతో, భవిష్యత్తు అవసరాల కోసం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా, పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖకు తరలించి.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న కాలుష్యం నగరవాసులను కలవరపెడుతోంది. ఇప్పటికైనా, సరైన చర్యలు చేపట్టకపోతే విశాఖ మరో ఏలూరు అయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పాపం.. అడ్డంగా బుక్కయిన మంత్రిగారు.. 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కరప మండలం, గొర్రిపూడిలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయంలో జరిగిన వేడుకలు తాజాగా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆ వేడుకలలో భక్తి కార్యక్రమాలు కాకుండా రికార్డింగ్ డాన్సులు జరగడం.. ఇదే సమయంలో ఈ వేడుకలకు ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు హాజరవ్వడం ఇపుడు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. సాక్షాత్తు మంత్రి గారి సాక్షిగా భక్తి కార్యక్రమాలు జరగవలసిన చోట ఈ రికార్డింగ్ డాన్సులేంటి అంటూ భక్తులు మండి పడుతున్నారు. అయినా మంత్రి గారైనా దీనిని ఆపకుండా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడంతో ఈ మొత్తం వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.   మరోపక్క "ఆలయాలలో దేవుని దర్శనాలకు, పండగలకు, పంచాయితీ ఎన్నికలు జరపడానికి కోవిడ్ నిబంధనలు అడ్డు వస్తాయి కానీ ఇలాంటి రికార్డ్ డాన్సులకు మాత్రం కోవిడ్ నిబంధనలు అడ్డురావా…? అసలు ఇలాంటివి నియంత్రించాల్సిన పోలీసులే గుడ్లు అప్పచెప్పి చూస్తూ ఉండడం పోలీసు వ్యవస్థ ఈ జగన్ పాలనలో నిర్వీర్యమైపోయింది అనడానికి నిదర్శనం." అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనిపై మరి మంత్రి కన్నబాబు గారు ఏవిధముగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య స్మ్రుతి వనం వద్ద రికార్డింగ్ డాన్సులతో చెడ్డపేరు తెచ్చుకున్న వైసీపీ శ్రేణులు తాజాగా మంత్రిగారి సమక్షంలో ఆలయం వద్ద జరిగిన వేడుకలలో రికార్డింగ్ డాన్సుల పర్వం రిపీట్ అవడంతో వైసీపీ పరువు గంగపాలవుతోందని కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ పార్టీ ఆఫీసులో సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ .. 

నిన్న ఏపీ సీఎం జగన్ బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అటు పార్టీ ముఖ్య నేతల నుండి ఇటు గల్లీ నేతల వరకు అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించారు. అయితే నిన్న నెల్లూరు టీడీపీ ఆఫీసులో కూడా సీఎం జగన్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అదేంటి జగన్ బర్త్ డేను టీడీపీ ఆఫీసులో నిర్వహించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?. ఇసుకతో తయారు చేసిన కేక్ ను కట్ చేసి వినూత్న రీతిలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ వారు ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ శ్రేణులు ఎందుకు చేస్తున్నాయో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఏకంగా మూడు సార్లు ఇసుక విధానాన్ని మార్చారని ఆరోపించారు. ప్రతీసారి వెయ్యి రూపాయలు పెంచుతూ పోతున్నారని, ప్రస్తుతం యూనిట్ ఇసుక ధర రూ. 6500 కు చేరిందన్నారు. ఒకపక్క మండుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లతో సమానంగా ఇసుక రేటు కూడా పెరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సరైన ఇసుక విధానం లేకపోవడం వల్ల ఏపీలో దీనిపై ఆధారపడిన కోటి మంది ఉపాధి కోల్పోయారని వారు విమర్శించారు.

దిశ వాహనాలకు వైసీపీ రంగులు! గుంటూరు పోలీసుల అత్యుత్సాహం

కోర్టులు చివాట్లు పెట్టినా.. ప్రజలు ఛీదరించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి రంగుల పిచ్చి పోవడం లేదు. వైసీపీ నేతలే కాదు ప్రభుత్వ అధికారులది అదే తీరు. ఎవరేం అనుకుంటే మాకేందన్నట్లుగా అవే తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మన్ననలు పొందాలనే ఆశతోనే ఏమో.. పోలీస్‌ వాహనాలకూ వైసీపీ రంగులేశారు. దిశ వాహనాలకే కాకుండా, గతంలో కేంద్ర ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో  ప్రతి స్టేషన్‌కూ మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన బైక్‌లకూ  వైసీపీ స్టిక్కర్లు అంటించి దిశ పేరుతో ప్రారంభించారు.గుంటూరులోని పోలీస్‌ కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ వాహనాలను జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. పాతవి కావడంతో రెండు వాహనాలు మొరాయించాయి గతంలోనూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు.  ఏకంగా  మహిళల రక్షణ కోసం అంటూ ప్రారంభించిన దిశ యాప్‌కు  వైసీపీ రంగులే వేశారు. అది వివాదం కావడంతో తిరిగి తొలగించారు. గతంలో రంగుల విషయంలో పెద్ద  వివాదం జరిగినా.. గుంటూరు పోలీసులు దిశ వాహనాలకు వైసీపీ రంగులేయడం వివాదాస్పదమవుతోంది. సీఎం పుట్టిన రోజు కానుక అన్నట్లుగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు కోట్ల రూపాయలు వెచ్చించి వైసీపీ రంగులేయడం..  కోర్టులు తప్పు పట్టడం జరిగింది. కోర్టు చివాట్లు పెట్టడంతో  ఆయా రంగులను మార్చేశారు. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ‘దిశ’ స్టేషన్‌లకు కూడా వైసీపీ రంగులు వేయగా కోర్టు ఆదేశాలతో వాటిని కూడా మార్చారు. 

బెంగాల్ లో బీజేపీకి 10 సీట్ల లోపే! రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే సవాల్ 

దేశ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే బెంగాల్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తహతహలాడుతుండగా.. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తనదైన  శైలిలో బెంగాల్ రాజకీయాలను మలుపు తిప్పుతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కమలనాధుల ఆకర్ష్ మంత్రానికి టీఎంసీ షేకవుతోంది.  ఇటీవలే 8 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. టీఎంసీలో కీలక నేతగా ఉన్న సేవెందు అధికారి కూడా బీజేపీలో చేరారు. ఎన్నికల నాటికి బెంగాల్ లో మరిన్ని సంచలనాలు ఉంటాయని, టీఎంసీలో మమత ఒక్కరే మిగిలిపోతారని కామెంట్ చేశారు అమిత్ షా. బీజేపీ నేతల తీరుపై టీఎంసీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.   బెంగాల్ లో బీజేపీ దూకుడుగా ఉండగా... ఆ పార్టీని టార్గెట్ చేస్తూ  సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎన్ని ఎత్తులు వేసినా బెంగాల్ లో బీజేపీ పది సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మళ్లీ మమతా బెనర్జీనే విజయం సాధిస్తారని చెప్పారు. అంతేకాదు బెంగాల్‌లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు పీకే.  2014 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు బెంగాల్ తో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

రైతుల కష్టాలు తెలిసిన పాలకులెక్కడ!  అన్నదాత  వెతలు తీరేదెన్నడు?  

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశమంతా చర్చిస్తోంది. కొత్త చట్టాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్నాయని ఆరోపిస్తున్న రైతులు దేశ రాజధానిపై  దండెత్తారు. ఢిల్లీలోకి అనుమతించకపోవడంతో సరిహద్దుల్లోనే ఆందోళన చేస్తున్నారు. నాలుగు వారాలుగా అక్కడే ఉన్నారు అన్నదాతలు. కేంద్రం బిల్లులపై వెనక్కి తగ్గే వరకు కదిలేది లేదని కర్షకులు ఖరాకండిగా చెప్పేస్తున్నారు. మోడీ సర్కార్ మాత్రం కొత్త సాగు చట్టాలు చరిత్రాత్మకం అంటోంది. 21వ శతాబ్దపు భారతదేశ అవసరమని, అన్నదాతల  ఆర్థిక స్థితి గతులను మార్చివేస్తుందని బీజేపీ నేతలు గొప్పగా చెబుతున్నారు. అయితే అసలు రైతుల అసలు సమస్యలేంటీ.. అన్నదాతలు ఏం కోరుకుంటున్నారు... రైతు రాజు ఎలా అవుతారు.. వ్యవసాయాన్ని పండగ చేయాలంటే ఏం చేయాలి.. అన్న అంశాలు మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. రాజకీయ కోణంలోనే అధికార, విపక్షాలు ప్రకటనలు చేస్తూ ప్రధాన సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యను మరింత జటిలం చేయాలనే చూస్తున్నారు కాని.. అన్నదాతల కోసం ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదు మన ఘనాపాటి నేతలు.  గత ప్రభుత్వాలు తెచ్చిన చట్టాల్లో గాని.. ఇప్పుడొచ్చిన కొత్త బిల్లుల్లో కాని రైతుల కన్నీటి కష్టాల గురించి ఆలోచించిన దాఖలాలేవి కనిపించడం లేదు. ఆధునిక పద్దతులంటూ, గ్లోబలైజేషన్ పేరుతో కొత్త చట్టాలను తెరపైకి తెస్తున్నారు. గ్రామీణ రైతులకు సాంకేతిక  పరిజ్ఞానం ఉందా లేదా అన్న అలోచన చేయకుండానే... ఆన్ లైన్ మార్కెట్ అంటూ ఊదరగొడుతున్నారు. ఎప్పటికప్పుడు పండించిన పంటను అమ్ముకుని..  ఆ కాలానికి జీవితం గడిపే సామాన్య రైతులకు.. ఈ టెక్నాలజీలు, ఆన్ లైన్ మార్కెట్లు ఎలా ఉపయోగపడతాయన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదు చట్టాలు తయారు చేసే మన సివిల్ సర్వెంట్లు. ఏసీ రూముల్లో కూర్చుని బిల్లులు రూపొందించే  ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లకు క్షేత్రస్థాయిలో  రైతులకు ఉండే బాధలు, వెతలు, అవసరాలు ఎలా తెలుస్తాయన్న ప్రశ్న సామాజిక వేత్తలు, సామాన్య జనాల నుంచి వస్తోంది. పల్లెల్లో పర్యటించి, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, పొలాల్లో తిరిగి..  కష్టపడి పంటలు పండిస్తున్న కర్షకులను కలిసి మాట్లాడితేనే అసలు సమస్యేంటో తెలుస్తుందని చెబుతున్నారు. రైతుల జీవితాలను బాగు చేయాలంటే ఏం చేయాలే వారికి అవగాహన వస్తుందంటున్నారు.  నిజానికి రైతులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలేం కాదు. వాళ్లు అడుగుతున్నదల్లా.. పంటకు ముందు పెట్టుబడి సాయం. పంట చేతికివచ్చాకా దానికి గిట్టుబాటు ధర. ఈ రెండు కల్పిస్తే చాలు తమకు ప్రభుత్వాలు కొత్తగా చేయాల్సిందేమి లేదని చెబుతున్నారు. ఈ రెండు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత కూడా.  కాని వీటిని ఏనాడు పట్టించుకోలేదు పాలకులు. మన దేశంలో ఉన్న రైతుల్లో దాదాపు 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏ కాలానికి ఆ కాలం పంటలు సాగు చేసి అమ్ముకుని కాలం వెళ్లదీసేవారే. వ్యవసాయ రైతుకు మొదటి నుంచే కష్టాలుంటాయి. విత్తనాల కోసం అప్పు తేవాల్సిందే. ఎరువుల కోసం .. కూలలకు ఇవ్వడానికి రుణమే గతి. ఇంత చేసి...ఎంతో కష్టపడి పంట పండిస్తే.. అక్కడ గిట్టుబాట ధర రాదు. అప్పటివరకు మంచిగానే ఉండే పంట రేటు.. రైతు పంట చేతికొచ్చే సమయానికి టపీమని పడిపోతుంది. కాదు కాదు  దళారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై అలా పతనం చేస్తారు. దీంతో చేసిన అప్పులు తీర్చడం కోసం వాళ్లిచ్చిన రేటుకే పంటను అమ్మేస్తుంటారు రైతులు. పంట వ్యాపారుల దగ్గరకు రాగానే మళ్లీ రేట్లు కొండెక్కుతాయి. తాము ఉత్పత్తి చేసే  ఏ వస్తువుకైనా ఉత్పత్తి దారుడే రేటు నిర్ణయిస్తారు. ఒక్క రైతుకు మాత్రమే ఆ అవకాశం లేదు. కష్టపడి రైతు పంట పండిస్తే.. దాని ధర మాత్రం దళారీ నిర్ణయిస్తాడు. రైతులకు ఏనాడు గిట్టుబాట ధర రాదు. కాని రైతు పండించిన ఆ పంటకు మాత్రం మార్కెట్ లో రేటు భారీగా ఉంటుంది. మాల్స్ లో అయితే మరీ ప్రియం. ఇలాంటి దుర్భర వ్యవస్థను బాగు చేయకుండా.. ఇలాంటి  కొత్త చట్టాలతో రైతులకు ప్రయోజనం ఏంటన్నది పాలకులకే తెలియాలి.     రైతులకు గిట్టుబాట ధరే పెద్ద సమస్యగా ఉంటే.. ప్రకృతి కూడా వాళ్లపైనే ప్రతాపం చూపిస్తుంది. కరువొచ్చినా మొదటగా కుదేలయ్యేది అన్నదాతే.  కుండపోతగా వర్షం కురిసినా నిండా మునిగేదే కర్షకుడే. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి మాత్రం ఏ చట్టాలు ఉపయోగపడవు. విపత్తుల సమయంలో ఏం చేసి అన్నదాతలను నిలబెట్టగలమన్న ఆలోచనే చేయరు పాలకులు. రైతులకు కావాల్సిన కనీస చర్యలు తీసుకోరు కాని.. ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, జీవన ప్రమాణాలు మార్చేస్తామని గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తుంటారు. దేశానికి తిండి పెట్టే అన్నదాతలను బిక్షగాళ్లుగా మారుస్తున్నారు పాలకులు. అది చేస్తాం ఇది చేస్తామంటూ వారిని ఆశల పల్లకీలో ఊరేగిస్తూ.. చివరికి అప్పుల పాలు చేసి... వాళ్లను ఆత్మహత్యలకు పురికొల్పుతున్నారు. రాజకీయ నేతల వైఫల్యాలు, కుట్రల వల్లే దశాబ్దాలు గడుతున్నా అన్నదాతల జీవితాలు మారడం లేదని మేధావులు, వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని కొత్త బిల్లులలో చెప్పారు. కాని  రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరేచోటుకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమేనా?  అని ప్రశ్న వస్తోంది. ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్ళి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానమంటున్నారు. కార్పొరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు తలుపులు బార్లా తెరువడానికి ఉపయోగపడేలా  బిల్లు ఉందంటున్నారు వ్యవసాయ నిపుణులు.  కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవి..  కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదు. అవన్ని ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.    కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఉన్న ఆహార ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేయడం చాలా ప్రమాదకరమంటున్నారు. సాధారణంగా పంటలు కోతకు వచ్చే సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి భద్రపరచుకుంటారు. ఆ తర్వాత ధరలను పెరిగిన తర్వాత అమ్ముకుంటారు. ఎప్పుడు ఎక్కువ రేట్లు ఉంటే అప్పుడు అమ్ముకోవడం వలన మిగిలిన సమయంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం. అయితే సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లో ఏముందో రైతులు ఎంతవరకు అవగాహన చేసుకుంటారన్నది ప్రశ్నార్దకమే.  ఈ ఒప్పందాలు నేరుగా రైతు, సంస్థ మధ్య జరుగుతాయి. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మార్కెట్ కమిటీలు కానీ ఏమీ ఉండవు. దీంతో రైతు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఇక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పేరుతో పాన్ కార్డ్ ఉన్న ఎవరైనా ఈ-వర్తకం చేసుకోవచ్చన్నది వినడానికి బాగానే ఉన్నా.. ఎంత శాతం మంది రైతులకు అలాంటి సాంకేతిక అవగాహన ఉంటుందన్న ప్రశ్న వినిపిస్తుంది. దీనికంటే ఇప్పటికే ఉన్న ఈ-నామ్ వ్యవస్థను మెరుగుపరిచి రైతులకు మేలు కలిగేలా చేయాలని సూచిస్తున్నారు.   ఇప్పటికైనా ప్రభుత్వాలు, పార్టీలు మేల్కొని, రాజకీయ ప్రయోజనాల కోణంలో కాకుండా నిజంగా అన్నదాతలు ఏం చేస్తే బాగుపడతారే అలోచించి.. ఆ దిశగా చట్టాలు చేస్తే మంచిది.. ఆ దిశగా పాలకులు అడుగులు వేయాలని మనం కోరుకుందాం... జై కిసాన్..

సోనూ సూద్ కు గుడి!  అందుకు అర్హుడ్ని కాదన్న రియల్ హీరో 

సినిమాల్లో విలన్ గా నటిస్తూ .. తన సేవా కార్యక్రమాలతో  నిజ జీవితంలో రియల్ హీరోగా మారిన బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ కు గుడి కట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తాండా పరిధిలోని చెలిమితాండాలో రాజేశ్ అనే అభిమాని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేశ్ కు సోనూ సూద్ అంటే ఎంతో అభిమానం. సోనూ చేసిన సేవా కార్యక్రమాలతో అభిమానం మరింతగా పెరిగింది. దీంతో సొంత ఖర్చుతో ఆయనకు గుడి నిర్మించాడు.  సోనూ విగ్రహానికి రాజేశ్ తో పాటు స్థానికులు కూడా పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. సోనూ సూద్ కు  సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు సోనూ సూద్. కష్టాల్లో ఉన్న పేదలకు బాసటగా నిలిచారు. ఆపన్నులకు సాయం అందించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వందలాది మంది  వలస కూలీల కోసం బస్సులు ఏర్పాటు చేసి.. వారి సొంత ప్రాంతాలకు పంపించారు ప్రజల కోసం సోనూ సూద్ చేపట్టిన కార్యక్రమాలతో ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. చెలిమితాండాకు చెందిన  రాజేశ్ కూడా అలానే సోనూసూద్ కు వీరాభిమానిగా మారాడు. అయనకు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. తనకు గుడి కట్టారన్న విషయం తెలుసుకున్న సోనూ సూద్ దానిపై స్పందించాడు. నాకెందుకండీ గుడి... నేను అందుకు అర్హుడ్ని కాదు అంటూ సోనూ సూద్ వినమ్రంగా బదులిచ్చారు. అయితే తనకు గుడి కట్టిన ప్రజల అభిమానానికి ముగ్ధుడ్ని అయ్యానంటూ ట్విట్టర్ లో వెల్లడించారు రియల్ హీరో.

ఆ ఒక్కడే ఇద్దరు ముఖ్యమంత్రుల టార్గెట్? ఆ వర్గ నాయకులంతా అటు వైపేనా ? 

ఒక్క  నాయకుడినే  రెండు అధికార పార్టీలు టార్గెట్ చేస్తున్నాయా?   తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ , కేసీఆర్ ఏకమయ్యారా? తమ ఉమ్మడి శత్రువును అణగదొక్కేందుకు  వ్యూహం రచిస్తున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా రాజకీయాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. తమకు మొదటి నుంచి ప్రత్యర్థిగా ఉన్న  ఒక రాజకీయ  నేత రాజకీయ ఎదుగుదలను  అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమయ్యారని తెలుస్తోంది. అతన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహం పన్నుతున్నారని, అందుకోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతున్న ఆ రాజకీయ నాయకుడు ఎవరో కాదు.. తెలంగాణ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.   ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని.. రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్లతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తూ..  స్టేలు తెచ్చుకున్న విషయమై మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు పేర్ని నాని. ‘పొట్టిగా ఉంటాడు.. హడావుడిగా తిరుగుతుంటాడు.. అతడితో రూ.50 లక్షల సూట్ కేసు ఇచ్చి పంపించాడు’..అంటూ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో డబ్బులు ఇచ్చి పంపించారని అర్థం వచ్చేలా పేర్ని నాని కామెంట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేసీఆర్, జగన్ కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే పేర్ని నాని కామెంట్లు చేశారని భావిస్తున్నారు.   గత ఆరేండ్లుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం వల్లే అతనికి క్రేజీ వచ్చిందని చెబుతారు. అటు మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేశారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి..  అప్పటి వైఎస్సార్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడే వారు. తర్వాత జగన్ పైనా అదే వైఖరిని అవలంభించారు. దీంతో వైసీపీ నేతలు, కేడర్..  తమ రాష్ట్రం కాకపోయినా రేవంత్ రెడ్డిని తమ ప్రత్యర్థిగానే చూస్తారు. దీంతో తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడిగా టార్గెట్ చేస్తున్నాయని చెబుతున్నారు.   ప్రస్తుతం టీపీసీసీ రేసులో ముందున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అతనికే వస్తాయని కేసీఆర్, జగన్ భావిస్తున్నారట.  రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు వస్తే తమకు మరింత ఇబ్బందిగా మారుతారని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రత్యర్థికి కీలక పోస్టు రావడం వైసీపీకి ఇష్టం లేదు. అందుకే అతన్ని టార్గెట్ చేస్తూ రెండు పార్టీలు వ్యూహం రచిస్తున్నాయని చెబుతున్నారు.  ఇంతకాలం తెలంగాణ రాజకీయాలను శాసించిన రెడ్లు.. కేసీఆర్ పాలనలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావనలో ఉన్నారు. ఎలాగైనా అధికారం సాధించాలనే కసిలో ఉన్నారు.  వారందరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అశాకిరణంలా కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు వస్తే తెలంగాలోని రెడ్లంతా ఒక్కటయ్యే అవకాశం ఉంది. ఇది గ్రహించిన కేసీఆర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కొత్త వ్యూహం రచిస్తున్నారని చెబుతున్నారు.          తెలంగాణలో దివంగత వైఎస్సార్ కు ఇప్పటికి భారీగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న తెలంగాణ రెడ్డి నేతల్లో ఎక్కువ మంది వైఎస్సార్ వల్ల రాజకీయంగా ఎదిగినవారే. వీళ్లంతా ఇప్పుడు జగన్ రెడ్డితోనూ సత్ససంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేస్తే కొందరు రెడ్డి నేతలు.. ఆ పార్టీలోకి వెళతారని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. వైఎస్సార్ సెంటిమెంట్ ను రగిలించి కొందరు రెడ్డి నేతలతో కలిసి వైసీపీని బలోపేతం చేస్తే.. ఆ ప్రభావం రేవంత్ రెడ్డిపైనే ఎక్కువగా పడుతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే కేసీఆర్ సూచనలతో తెలంగాణ రెడ్డి నేతలతో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో  వైసీపీ బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా కేసీఆర్, జగన్ ప్లాన్ లో భాగంగానే జరుగుతున్నాయంటున్నారు.  ఏపీ  సీఎం జగన్ కు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాలున్నాయి. తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత..  జగన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు కేసీఆర్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణ చేస్తూ.. జగన్ ను ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా కేసీఆర్ ను స్వయంగా కలిసి  ధన్యవాదాలు చెప్పారు. తర్వాత కూడా ఇద్దరు సీఎంలు పలు సార్లు సమావేశమయ్యారు. తనకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్న కేసీఆర్ కోసం.. జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయవచ్చని, బలమైన రెడ్డి నేతలంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. తమ నేత టీపీసీసీసీ అధ్యక్షుడిగా కాకుండా చేసేందుకు జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు.  

జగన్ కు రెబల్ ఎంపీ రఘురామరాజు విషెస్.. సీఎంపై నెటిజన్ల సెటైర్లు

వైసీపీ నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు గత కొంతకాలంగా తన సొంత పార్టీపై, అలాగే సీఎం జగన్ పై విరుచుకు పడుతున్న సంగతి తెల్సిందే. అయన సొంత పార్టీ వైసీపీలో విప‌క్ష పాత్ర పోషిస్తున్నారు. ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా జ‌గ‌న్, వైసీపీలను టార్గెట్ చేస్తూ ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఈరోజు సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంపీ రఘురామరాజు బర్త్ డే విషెస్ తెలియ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే, అందులో జ‌గ‌న్ ను ట్యాగ్ చేశారు కానీ గారు అని మాత్రం సంబోధించ‌లేదు. పైగా ఆ ట్వీట్ తో పాటు జ‌త చేసిన ఫోటో పై ఇప్పుడు నెటిజ‌న్లు రకరకాల కామెంట్ లు చేస్తున్నారు. కొంద‌రేమో గారు పోయింద‌ని…, మీరు చేయి వదిలించుకోవాల‌నుకుంటున్నా జ‌గ‌న్ విన‌టం లేదు, ప్రాదేయ‌ప‌డుతున్నారుగా… అని మరికొందరు, హ్యాపీ బర్త్ డే ఫేక్ సీఎం అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

బీజేపీపై ఎమ్మెల్యే సీతక్క అదిరిపోయే సెటైర్లు..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కరోనా కల్లోల సమయంలో గిరిజన ప్రాంతాల ప్రజలను ఆదుకుంటూ సామాన్య ప్రజల మన్ననలను పొందిన సంగతి తెల్సిందే. అదే సమయంలో ఆమె ప్రజల పక్షాన ఉంటూ పలు ఆందోళనలలో కూడా పాల్గొన్నారు. తాజాగా ఆమె మండుతున్న పెట్రోల్ రేట్ల విషయమై బీజేపీ పై అదిరిపోయే సెటైర్లు వేశారు. దీనిపై ఆమె చేసిన తాజా ట్వీట్ అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తూ, ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం పెట్రోల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. దాదాపుగా ప్ర‌తి రోజు పెట్రోల్ రేటు ఎంతో కొంత పెరుగుతుండ‌డంతో సామాన్య జనం బెంబేలెత్తుతోంది. పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై ములుగు ఎమ్మెల్యే సీత‌క్క క్రికెట్ క్విజ్ ప్ర‌శ్న‌ల‌తో క‌లిపి ట్వీట్ చేసింది... 2021వ సంవ‌త్స‌రంలో ఫ‌స్ట్ సెంచ‌రీ కొట్టేది ఎవ‌రు…? అని సీత‌క్క ప్రశ్న సంధించింది‌. దీనికి స‌మాధానంగా 1. విరాట్ కోహ్లి 2. రోహిత్ శ‌ర్మ అని ఆమె అషన్స్ పోస్ట్ చేసింది. అయితే దీనికి తన ఆన్స‌ర్ మాత్రం పెట్రోల్ ధ‌ర‌లు అంటూ సెటైర్ వేసింది. ఎమ్మెల్యే సీత‌క్క తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.  

కొత్త స్ట్రెయిన్‌ కరోనా... మళ్ళీ లాక్ డౌన్ వైవు ప్రపంచం అడుగులు!

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని ప్ర‌పంచం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్రిట‌న్ లో మ‌రోసారి తీవ్ర క‌ల‌వ‌రం మొద‌లైంది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ చాల వేగంగా వ్యాపిస్తోందని, దీని ‌‌పై ఇప్పటికే నియంత్రణ కోల్పోయామని.. పరిస్థితి అదుపు తప్పిందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మాట్ హెన్‌కాక్ వ్యాఖ్యలు చేసారు. ఈ కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్-4ను విధించింది. బ్రిటన్‌తో పాటు దక్షిణాఫ్రికా దేశాల్లో కూడా కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరపడుతున్నాయి. యూకే నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ విమానాలపై భార‌త్ స‌హా యూర‌ప్ దేశాలు విమాన సర్వీసులను వెంటనే నిలిపివేశాయి. ఇది ఇలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన చేసి రోజులు కూడా గడవక ముందే లాక్‌డౌన్ 4ను మరింత కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితి రావడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.   ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. ఈ కొత్త రకం కరోనా ఎంత వేగంగ వ్యాపిస్తోందంటే తాజాగా అమెరికా తర్వాత నిన్న ఎక్కువ కరోనా కేసులు బ్రిటన్‌లోనే నమోదయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ మొదటి పది దేశాలలో అన్నిటికంటే కింద ఉండే బ్రిటన్... ఇప్పుడు టాప్ 2 ప్లేస్ కి వచ్చేసింది. దీంతో ప్రజలు క్రిస్మస్‌కి దూరంగా ఉండాలనీ, ఇళ్లలోనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ తాజా నిబంధనలు కొనసాగుతాయని ఆయన అన్నారు.   కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి... మరణాల రేటు మాత్రం ఇప్పటి కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు కూడా మరికొన్ని నెలలపాటూ కఠిన నిబంధనలను కొనసాగించడం మేలంటున్నారు. ఈ కొత్త వైరస్ డిటైల్స్ పూర్తిగా అర్థం కాలేదనీ... అయితే మున్ముందు దీని వివరాలు పూర్తిగా తెలుస్తాయంటున్నారు.

తిరుపతిలో వైసీపీకి షాకే.. తేల్చేసిన ప్రీపోల్ సర్వే? వామ్మో జగన్  పాలనపై ఇంత వ్యతిరేకతా ! 

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో  జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన సీటుకు జనవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్ని తిరుపతి ఎన్నికపైనే ఫోకస్ చేశాయి.  అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ ప్రచారంపై దృష్టి సారించింది. ఉప ఎన్నిక కోసం సమన్వయ కమిటిని కూడా నియమించిన చంద్రబాబు.. తిరుపతిలో విజయానికి పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే మల్లగుల్లాలు పడుతున్నాయి. సరైన నేతలు లేకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అభ్యర్థి ఎంపికపై ఆలస్యం చేస్తున్నాయని తెలుస్తోంది.   తిరుపతి లో అధికార పార్టీల కంటే టీడీపీలోనే  ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో తెలుగు దేశం పార్టీకే లీడ్ ఉందని తేలిందట.  జగన్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, యువత, రైతులు, దళితులు .. చివరకి మందుబాబులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాకా సామాన్యులపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, అధికార పార్టీ నేతల స్కాములు తప్ప.. ప్రజలకు జరిగిందేమి లేదనే భావనలో మెజార్టీ ప్రజలు ఉన్నారని సర్వే సంస్థలు స్పష్టం చేశాయంటున్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తీరలేదు. గత ఏడాదిన్నరలో కొలువుల భర్తీ కూడా జరగలేదు. దీంతో ఆయా వర్గాలన్ని జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని తేలిందట.  నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన మొదట టీడీపీలో కనిపించింది. వైసీపీకి పట్టున్న ప్రాంతం  కావడం, సిట్టింగ్ ఎంపీ చనిపోవడంతో సహజంగా సానుభూతి కూడా ఉంటుంది. అధికారంలో ఉండటం కూడా వైసీపీకి కలిసివస్తోంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్న తిరుపతిలో పోటీ ఇవ్వగలమా అన్న చర్చ కూడా టీడీపీ నేతల్లో జరిగిందట. తిరుపతిలో వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే తిరుపతిలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనాకు చికిత్స తీసుకుంటూ చెన్నై ఆస్పత్రిలో చనిపోయారు బల్లి దుర్గాప్రసాద్. అయితే దుర్గాప్రసాద్  కుటుంబాన్నిఇంతవరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఇదీ ఇప్పుడు తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ నేత ఇలా వ్యవహరించలేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. పార్టీ నేతలు అనారోగ్యం పాలయితేనే.. వారి యోగక్షేమాల గురించి పార్టీ పెద్దలు టెన్షన్ పడుతుంచారు. అలాంటిది ఒక ఎంపీ చనిపోతే.. ఆయన పార్టీ అధ్యక్షుడు, సీఎం హోదాలో ఉన్న జగన్ వారితో కనీసం మాట్లాడకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.  తిరుపతిలో ఎస్సీ ఓటర్లు  భారీగా  ఉంటారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. చిత్తూరు జిల్లాలోనూ దళితులపై చాలా ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దళితులకు వైసీపీ నేతలు శిరోముండనం వేయించిన ఘటనలు వెలుగుచూశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడికి.. ఇన్‌చార్జి ఎస్సై  ట్రిమ్మర్ తో గుండు చేయించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.  అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. దళిత జడ్జీ ఫ్యామిలీకే రక్షణ లేదంటే.. ఏపీలో  సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. దళితులపై జరిగిన, జరుగుతూనే ఉన్న దాడులతో .. ఆ సామాజిక వర్గంతా వైసీసీపైనా,  సీఎం జగన్ పైనా ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నారని, లోక్ సభ ఉప ఎన్నికల్లో అది చూపించబోతున్నారని చెబుతున్నారు.  మందుబాబులు కూడా జగన్ సర్కార్ పై రగిలిపోతున్నారని తెలుస్తోంది.  కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. లిక్కర్ రేట్లను భారీగా పెంచింది. రేటు పెరిగితే మద్యం తాగడానికి జనాలు భయపడతారని.. అందురే రేట్లు పెంచామనే కవరింగ్ ఇచ్చుకుంది. అయితే ఇప్పుడు లిక్కర్ సేల్స్ నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. పెరిగిన రేట్లతో తాము రోజంతా కష్టపడి సంపాదించినదంతా లిక్కర్ కే పోతుందని మందు బాబులు ఆరోపిస్తున్నారు. సర్కార్ ఆదాయం కోసమ తమను దోచుకుంటుందని వారంతా మండిపోతున్నారు. రైతులు కూడా వైసీపీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. కాని వరదలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంతో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. అంతేకాదు కష్టాల్లో ఉన్న తమను కనీసం పరామర్శించడానికి  కూడా వైసీపీ నేతలు రాలేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఇవన్ని తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని నష్టం కలిగించబోతున్నాయని చెబుతున్నారు.   మొత్తానికి  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై వచ్చిన ప్రీపోల్ సర్వే ఫలితాలతో టీడీపీకి  మరింత బూస్ట్ వచ్చిందని చెబుతున్నారు.  దీంతో తమ్ముళ్లు మరింత ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే టీడీపీ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఎంపీ పనబాక లక్ష్మి కూడా తాను విజయం సాధించడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.  మరోవైపు తాము నిర్వహించిన సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు రావడం వల్లే అభ్యర్థుల ఎంపికలో వైసీపీ, బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అన్ని అనుకూలతలే ఉండటంతో జగన్  రెడ్డి సర్కార్ ఏడాదిన్నర పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుగా తిరుపతి ఉపఎన్నికను మలుచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.