ధరణి పోర్టల్ పై ఏం చేద్దాం? శనివారం కేసీఆర్ హై లెవల్ మీటింగ్
posted on Dec 18, 2020 @ 12:01PM
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. ప్రభుత్వ నిర్ణయాలతో పోర్టల్ లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్కార్ విధానాలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా ? లేదంటే కొత్త విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖల నిపుణులతో చర్చించి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై గురువారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని హామీ ఇచ్చిన సర్కారు.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడింది. స్వచ్ఛందం అంటూనే.. ఆధార్ తీసుకోవడమంటే కోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించడమేనని ప్రభుత్వానికి తెలియదా? అని నిలదీసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్‌ను నిలిపివేయాలని సూచించింది. పీటీఐఎన్ జారీ చేయడాన్ని కూడా నిలిపివేయాలని తెలిపింది. కులం, కుటుంబసభ్యుల వివరాలు కూడా తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.