రేవంత్ కు పీసీసీ.. సీనియర్లు జంప్? కొత్త పార్టీ రెడీగా ఉందట!
posted on Dec 18, 2020 @ 7:11PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కొత్త బాస్ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. పీసీసీ చీఫ్ పై హైకమాండ్ నుంచి ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పీసీసీ రేసులో ఉన్న నేతలు ఢిల్లీ స్ఠాయిలో చివరి వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ పగ్గాలు దాదాపుగా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ నుంచి ఆయనకు ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు అందాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. టీపీపీసీ చీఫ్ గానే హైదరాబాద్ లో అడుగుపెడతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
టీపీపీసీ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తే కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు ఉంటాయంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా పోరాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వీ హనుమంతరావులు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. వారంతా ఇప్పటికే ప్లాన్ బీగా పక్క పార్టీ ప్లాట్ ఫామ్ సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ రేసులో నిలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటారని గాంధీభవన్ వర్గాల టాక్.
కాంగ్రెస్ నేతల వలసల ప్రచారంపైనా ఆ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చాకా.. సీనియర్లు బయటికి వెళ్లినా పార్టీపై పెద్ద ప్రభావం ఉండదనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. పాత తరం నేతలు పోతే యువ నేతలు వస్తారని, పార్టీకి ఇది మరింత బలం అవుతుందని కొందరు చెబుతున్నారు. పార్టీలో యువనేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ చూస్తున్నారని, రేవంత్ రెడ్డితో ఆ లక్ష్యం నెరవేరుతుందని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఆయనతో కలిసి పని చేసేందుకు యువ నేతలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్లు తనకు సహకరించకపోయినా.. పార్టీని బలోపేతం చేస్తాననే ధీమాలో రేవంత్ రెడ్డి ఉన్నారని, హైకమాండ్ కు కూడా ఆయనపై నమ్మకం ఉందని మల్కాజ్ గిరి ఎంపీ వర్గీయులు చెబుతున్నారు.
మరోవైపు రేవంత్ రెడ్డి గురించే మరో ప్రచారం జోరుగా సాగుతోంది. చివరి నిమిషంలో ఏదైనా జరిగి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకపోతే తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా నియమించకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఒక పార్టీ రిజిస్టర్ అయి ఉందట. ఆ పార్టీ వివరాలు, ఎవరూ రిజిస్టర్ చేయించారన్న వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. రేవంత్ రెడ్డి కోసమే ఆపార్టీని రెడీగా ఉంచారని కొందరు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమిస్తే ఆ పార్టీ బయటికి రాదని, ఆయనకు పీసీసీ రాకుంటే మాత్రం కొత్త పార్టీ తెరపైకి వస్తుందని చెబుతున్నారు. ఆ పార్టీనే రేవంత్ రెడ్డి పార్టీ అవుతుందనే చర్చ జరుగుతోంది.
మొత్తానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇస్తే సీనియర్ నేతలు బయటికి వెళ్లడం జరుగుతుందా.. లేక పీసీసీ పదవి రాకుంటే రేవంత్ రెడ్డే కొత్త పార్టీని నడిపిస్తారా అన్నది ఆసక్తిగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ లో జరుగుతున్న, జరగబోయే పరిణామాలను ఇతర పార్టీలు గమనిస్తున్నాయి. ఈ సస్పెన్స్ పోవాలంటే ఏఐసీసీ నుంచి టీపీసీసీ చీఫ్ ప్రకటన రావాల్సిందే.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే..