జర భద్రం.. తెలంగాణాలో బయటపడ్డ రెండు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు 

బ్రిట‌న్ లో కొత్తగా వెలుగు చూసిన రూపాంతరం చెందిన క‌రోనా వైర‌స్ కేసులు తాజాగా భారత్ లోనూ న‌మోద‌వుతున్నాయి. బ్రిట‌న్ లో కొత్త స్ట్రెయిన్ మొదలైందని ప్ర‌క‌టించ‌గానే ఆ దేశం నుండి వ‌చ్చే విమానాల‌పై భార‌త్ నిషేధం విధించిన‌ప్ప‌టికీ… కేంద్రం రియాక్ట్ అయ్యే లోపే వైర‌స్ భారత్ లో ఎంట‌ర్ అయిపోయింది. తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్రకటించింది.   దేశ‌వ్యాప్తంగా ఈ కొత్త స్ట్రెయిన్ వైర‌స్ కేసులు 6 న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు వెల్ల‌డించింది. ఇందులో బెంగ‌ళూరులో 3, హైద‌రాబాద్ లో 2, పుణేలో ఒక‌రికి కొత్త స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు బులిటెన్ వెల్ల‌డించింది. బ్రిట‌న్ నుండి వ‌చ్చిన మొత్తం 33వేల మందిని ప‌రీక్షించ‌గా 114మందికి వైర‌స్ ఉన్న‌ట్ల నిర్ధార‌ణ అయ్యింద‌ని, అందులో 6గురికి ఈ కొత్త స్ట్రెయిన్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింద‌ని తెలిపింది.   ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, వైర‌స్ ఉన్న వారిని ప్రత్యేక గ‌దిలో ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. బ్రిటన్ లో గుర్తించిన ఈ కొత్త స్ట్రెయిన్ వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించిన సంగతి తెల్సిందే. ఈ క‌రోనా స్ట్రెయిన్ తో యువ‌త‌, పిల్ల‌ల్లోనూ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతాయని హెచ్చ‌రించింది.   ఇది ఇలా ఉండగా ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి (49)లో దీనిని గుర్తించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది. అయితే ఆమెకు సోకింది కొత్త కరోనానా? కాదా? అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. అయితే యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం ఫలితాల నివేదికను ఆదివారమే సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అందులోనే వరంగల్‌ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను నిర్ధారించినట్లు సమాచారం. ఇతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.   మరోపక్క రాష్ట్రంలో బ్రిటన్ నుండి వచ్చి ట్రేస్‌ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 21 మందిలో హైదరాబాద్ ‌వారు నలుగురు, మేడ్చల్‌వారు 9 మంది, జగిత్యాల జిల్లావాసులు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

వైసీపీలో తిరుపతి బైపోల్ భయం! 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక భయం పట్టుకుందా? ప్రభుత్వ వ్యతిరేకత తమ కొంప ముంచబోతోందని గ్రహించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో అధికారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. ఎంపీ చనిపోవడంతో సానుభూతి కూడా ఉంటుంది. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నా తిరుపతి ఉపఎన్నికపై వైసీపీలో భయం కనిపిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సర్కార్ చేయించుకున్న సర్వేలే కారణమని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికపై ఇప్పటికే  రెండు, మూడు సార్లు సర్వే చేయించారట సీఎం జగన్. అయితే అన్ని సర్వేల్లోనూ టీడీపీకి లీడ్ వచ్చిందట. మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువత,  దళితులు .. చివరకి మందుబాబులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాకా సామాన్యులపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, అధికార పార్టీ నేతల స్కాములు తప్ప.. ప్రజలకు జరిగిందేమి లేదనే భావనలో మెజార్టీ ప్రజలు ఉన్నారని సర్వే సంస్థలు స్పష్టం చేశాయంటున్నారు. అందుకే ఉప ఎన్నికపై వైసీపీలో ఆందోళన ఉందని తెలుస్తోంది.  ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై వైసీపీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందు కోసం తిరుపతి లోక్ సభ పరిధిలో సంక్షేమ పథకాలను మరింతగా అమలు చేయాలని అధికార పార్టీ భావిస్తుందట. అందుకే పేదలందరికి ఇండ్ల పథకాన్ని తిరుపతి లోక్ సభ పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ప్రారంభించారని చెబుతున్నారు. డిసెంబర్ 25న ఇండ్ల పట్టాల పంపిణి ప్రారంభించింది ప్రభుత్వం. అయితే రెండు రోజుల్లోనే వెంటనే ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు తిరుపతినే వేదికగా మార్చుకుంది. ఉప ఎన్నిక కోసమే తిరుపతి నియోజకవర్గంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉన్నందునే ఇక్కడే ఈ కార్యక్రమం పెట్టారని చెబుతున్నారు. ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించడమే కాదు.. తిరుపతి లోక్ సభ పరిధిలో వెంటనే నిర్మాణ పనులు చేపట్టేలా జగన్ సర్కార్ చర్యలు చేపడుతుందని చెబుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల భూ పట్టాల పంపిణి లక్ష్యంగా పెట్టుకుంది జగన్ ప్రభుత్వం. అంటే ఒక్కో లోక్ సభ పరిధిలో లక్ష 35 వేల వరకు వస్తాయి. కాని ఉప ఎన్నిక ఉన్న తిరుపతి పార్లమెంట్ పరిధిలో మాత్రం రెండున్నర లక్షలకు పైగా పట్టాలు ఇవ్వనున్నారట. ఇండ్ల నిర్మాణం కూడా తిరుపతి పరిధిలోనే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని లక్ష్యంగా పెట్టుకోగా... అందులో తిరుపతి ఎంపీ పరిధిలోని లక్షకు పైగా ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు వేశారట. ఇంతే  కాదు తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల్లో వేగం పెంచాలని నిర్ణయించారట. అంటే పెండింగులో ఉన్న రేషన్ కార్డులను వెంటనే ఇవ్వడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం.. అమ్మ ఒడిలో కొత్త వారిని చేర్చడం.. ఇలా సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గం పరిధిలో మరింత మందికి ఇచ్చేలా స్థానిక వైసీపీ నేతలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట.  తిరుపతి ఉప ఎన్నికకు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. గతంలో పోటీ చేసిన పనబాక లక్ష్మినే బరిలోకి దింపి ప్రచారం కూడా చేసేస్తోంది. జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ బాగా పుంజుకోవడంతో అభ్యర్థి ఎంపికపై వైసీపీ తీవ్ర తర్జనభర్జనలు పడుతుందని చెబుతున్నారు. మొదట దివంగత ఎంపీ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి ఖరారయ్యారని చెప్పారు. కాని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మొదట తిరుపతి తమకు ఈజీగానే ఉంటుందని భావించిన వైసీపీ.. సర్వే ఫలితాలతో బెంబెలెత్తి అభ్యర్థి ఎంపికకై ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. జిల్లా ఇంచార్జ్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి... తిరుపతి లోక్ సభ పరిధిలోని పార్టీ నేతలతో మూడు, నాలుగు సార్లు చర్చలు జరిపినా.. క్యాండిడేట్ పై క్లారిటీ రాలేదంటే... వైసీపీకి ఎంతగా భయపడుతుందో అర్ధం చేసుకోవచ్చు.      తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1984, 1998 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతా మోహన్ ఎంపీగా గెలిచారు. 2014, 2019లో వైసీపీ విజయం సాధించింది. 1999లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నందిపాకు వెంకట స్వామి తిరుపతి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.  2019 ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద రావు  2 లక్షల 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో  విజయం సాధించారు. ఇక్కడ అనూహ్యంగా నోటా మూడో స్థానంలో నిలిచింది.  కాంగ్రెస్ నాలుగు,  బీఎస్పీ ఐదో స్థానం దక్కించుకోగా.. కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే సాధించి  బీజేపీ  ఆరో స్థానానికి పడిపోయింది.  టీడీపీ కంటే వైసీపీకి దాదాపు 17 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.

ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు! సీఎం, డీజీపీలకు చంద్రబాబు లేఖ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు భయానక పరిస్థితులు నెలకొల్పారని చంద్రబాబు నాయుడు  ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. తాడిపత్రిలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరగకుండా చూడాలని ఆయన కోరారు. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు నాయుడు అన్నారు.  జేసీ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వాటిల్లినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో జేసీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.  

రెచ్చిపోయిన వైసీపీ నేత.. 6 నెలలుగా కరెంటు బిల్లు కట్టకపోగా.. లైన్‌మ్యాన్‌పై దాడి!

ఆరునెలలుగా కరెంటు బిల్లు కట్టలేదు.. బిల్లు కట్టమన్న అధికారులను అధికార పార్టీ అంటూ బెదిరించాడు.. ఆరు నెలలు ఓపిక పట్టిన అధికారులు.. ఇక చేసేది లేక కరెంట్ ఫ్యూజ్ తొలగించారు. ఇంకేం సదరు అధికార పార్టీ నేత రెచ్చిపోయాడు. లైన్ మైన్ తన ఇంటికి పిలిపించి దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు.. అంతేకాదు లైన్ మెన్ కేసు పెట్టినా తీసుకోవద్దంటూ పోలీసులకు కూడా హుకుం జారీ చేశాడు.. దీంతో పోలీసులు లైన్ మెన్ పై జరిగిన దాడి లైట్ తీసుకున్నారు... ఇదీ జరిగింది రౌడీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచో  బీహార్ లో కాదు.. అరాచకాల్లో బీహార్ ను దాటేస్తున్న.. జగన్ రెడ్డి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో..   గుంటూరు శివారులోని నల్లపాడుకు చెందిన వైసీపీ నేత గాదె నాగిరెడ్డి ఆరు నెలలుగా తన ఇంటి కరెంటు బిల్లు కట్టడంలేదు. ఎవరైనా అడిగితే అధికార పార్టీ పేరు చెప్పి బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఆ ఏరియా లైన్‌మ్యాన్‌ పట్నాయక్‌.. నాగిరెడ్డి ఇంటికి వెళ్లి ఆరు నెలలుగా బిల్లు కట్టనందున ‘డీ-లిస్టు’లో పేరు వచ్చిందంటూ ఫ్యూజు తొలగించారు. ఆ సమయంలో నాగిరెడ్డి ఇంట్లో లేరు. ఆ తర్వాత కాసేపటికి పట్నాయక్‌ కు ఫోన్ చేసిన నాగిరెడ్డి.. 'బిల్లు చెల్లించాం. వస్తే రశీదు చూపిస్తాం. ఫ్యూజు మళ్లీ పెట్టి వెళ్లు' అంటూ నమ్మబలికారు. దీంతో పట్నాయక్‌ తోటి సిబ్బందితో కలిసి నాగిరెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే, పట్నాయక్‌ వచ్చీ రాగానే ‘నా ఇంటికే కరెంట్‌ కనెక్షన్‌ పీకేస్తావా.. ఎంత ధైర్యంరా’ అంటూ నాగిరెడ్డి మరో వ్యక్తితో కలిసి ఆయనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దాడిని అడ్డుకునేందుకు తోటి సిబ్బంది ప్రయత్నించినా వారు ఆగలేదు. దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయిన పట్నాయక్‌ ను తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.   తమ లైన్‌మ్యాన్‌ పై దాడి జరిగిందని ఏఈ కిరణ్‌ కుమార్‌ అదేరోజు ఫిర్యాదు చేసినా.. పోలీసులు దానిని స్వీకరించలేదు. అంతేకాదు, కొందరు వైసీపీ నేతలు ఏఈకి ఫోన్‌ చేసి‌ కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించినట్లు సమాచారం. చివరికి విద్యుత్‌ అధికారులు, యూనియన్‌ ఒత్తిడితో ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే, ఇంత జరిగినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. కాగా, సోమవారం డి-లిస్టులో ఉన్న బకాయిదారుల విద్యుత్‌ కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలోని విద్యుత్‌ సిబ్బంది బహిష్కరించి, నిరసన వ్యక్తం చేయడంతో ఈ దాడి విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్‌ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేస్తేనే తాము విధులకు హాజరవుతామని విద్యుత్‌ సిబ్బంది తేల్చిచెప్పారు. నాగిరెడ్డిపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కొందరు నేతల ఒత్తిళ్ల కారణంగానే అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య.. కారణం అదేనా..! 

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ నిన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం ధర్మెగౌడ తన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే తాను ఎక్కడికి వెళ్తున్నదీ ఎవరికీ చెప్పలేదు. అలా వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగి రాకపోవడంతో.. ఎమ్మెల్సీ గన్​మెన్, పోలీసులు ఆయన కోసం గాలించారు. అయినా ఎక్కడా అయన జాడ కనిపించలేదు.   అయితే ఈ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సూయిసైడ్ లెటర్ ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ఘటన కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది. ధర్మెగౌడ ఆత్మహత్య విషయం తెలిసి మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.   ఈ నెల 16న శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా తీవ్ర స్థాయిలో రభస జరిగింది. అప్పుడు సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లడం అప్పట్లో దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఆ ఘటనతో ఆయన తీవ్ర మనస్థాపం చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకోవడం తాజాగా కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతోంది.

బీజేపీకి  ప్రత్యామ్నాయంగా  బలమైన కూటమి! తమిళనాడు ఎన్నికలే కీలకం! 

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ బలహీన పడింది. బీజేపీ మాత్రం రోజురోజుకు మరింత బలపడుతోంది. బీజేపీకి ధీటుగా పోరాడే శక్తి కాంగ్రెస్ కు లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా  బలమైన కూటమి కోసం  ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.  కొత్త కూటమి అయితే సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడున్న  యూపీఏనే బలోపేతం చేసే యోచనలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వేదిక కాబోతున్నాయని సమాచారం.            తమిళనాడులో మేలో  కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అంటే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఇప్పటికే తమిళనాడులో రాజకీయాలు  వేడెక్కాయి. తమిళనాడులో పాగా కోసం బీజేపీ శ్రమిస్తున్నా.. వారికి ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు. రజనీకాంత్ పార్టీ పెడితే... బీజేపీతో కలిసి పోటీ చేయవచ్చని భావించారు. కాని హైదరాబాద్ లో  అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన రజనీకాంత్.. హాస్పిటల్ నుంచి డాశ్చార్జ్ అయినా ... ఆయన ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో డిసెంబర్ 31న చేస్తానన్న రజనీకాంత్ రాజకీయ ప్రకటన లేనట్టేనని తెలుస్తోంది.  ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కేంద్ర సర్కార్ తో సఖ్యతగానే ఉన్నా... తమిళనాడుకు వచ్చే సరికి మాత్రం ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో బీజేపీతో కలిసి సర్కార్ పంచుకునే అవకాశం లేదని అన్నాడీంకే స్పష్టం చేసింది. డీఎంకే ఎలాగూ బీజేపీకి బద్ద వ్యతిరేకమే.     జనవరి తొలి వారంలోనే చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదల కాబోతోంది. శశికళ ఎంట్రీ తర్వాత తమిళ పాలిటిక్స్ మరింత రంజుగా మారిపోనున్నాయి.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017లో శశికళను దోషిగా తేల్చిన కోర్టు నాలుగేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. అప్పటి నుంచి ఆమె బెంగళూరులోని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జనవరిలో జైలు నుంచి రానున్న శశికళ.. రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఆమె అనుచరులు పార్టీ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారంటున్నారు. శశికళ పార్టీ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తాను జైలుకు వెళ్లడానికి బీజేపీనే కారణమనే భావనలో శశికళ ఉన్నారని ఆమె అనుచరుల వాదన.  తమిళనాడులో ఏ విధంగా చూసినా బీజేపీకి కలిసి వచ్చే పార్టీలు కనిపించడం లేదు.అవసరమైతే బీజేపీని ఎదుర్కొనేందుకు.. అన్నాడీఎంకే మినహా మిగితా పార్టీలు ఏకమయ్యే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   తమిళనాడు రాజకీయ పరిణామాల తరహాలోనే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి బలమైన శక్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూపీఏ కూటమికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను చీఫ్ గా నియమించి.. ఆ దిశగా అడుగులు వేయవచ్చని చెబుతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని, ప్రాంతీయ పార్టీలతో ఆమె సమావేశం జరిపింది కూడా ఇందు కోసమేనని చెబుతున్నారు. రైతు సమస్యలపై మాట్లాడుకున్నామని మమత చెబుతున్నా అంతర్గతంగా జరిగింది మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి బలోపేతం పైనేనని పక్కాగా తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి శివసేన కూడా అంగీకరిస్తోంది. ఆ పార్టీ పత్రిక సామ్నాలో శరద్ పవార్ ను ప్రశంసిస్తూ సంపాదకీయం వచ్చింది. పవార్ ఆ పదవిని స్వీకరిస్తానంటే తమకే అభ్యంతరం లేదని.. పవార్ ఆ పదవికి అన్ని విధాలా అర్హులని మిత్రపక్షం శివసేన అందులో  స్పష్టం చేసింది.    మొత్తంగా పశ్చిమ బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, బెంగాల్ లో టీఎంసీ విజయం సాధిస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా  బలమైన కూటమి ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టేనని  చెబుతున్నారు. మమత, స్టాలిన్, శివసేనల డైరెక్షన్ లోనే శరద్ పవార్ నేతృత్వంలో బలమైన కూటమి రావచ్చంటున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించడం వల్లే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ.. తమ చేతుల్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తోందని, అందుకే కేసీఆర్, జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు సాగించిందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత గతంలో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని రాజకీయ అనలిస్టులు ఉదాహరణగా చూపుతున్నారు.

మీరు ఎక్కడంటే అక్కడికి వస్తాం.. అసెంబ్లీని ముట్టడిస్తాం.. జగన్ సర్కార్ కు పవన్ సవాల్  

ఏపీలో కొద్ది రోజుల క్రితం వచ్చిన నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయలు పరిహారం ఇవ్వకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను తమ పార్టీ అడ్డుకుంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏపీ సర్కార్ ను హెచ్చరించారు. మీరు కనుక రైతులను ఆదుకోకపోతే అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తామని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు గుడివాడలో పర్యటన చేస్తున్న పవన్.. రైతుల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. భూమి హక్కు లేక కౌలు రైతులు నష్టపోతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. "కౌలు రైతులు బాధలు పడుతుంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే.. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వొచ్చు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినా వస్తాం. మీరు సై అంటే మేమూ సై.. అమరావతిలో పెట్టుకుంటారా, వైజాగ్‌లో పెట్టుకుంటారా, పులివెందులలో పెట్టుకుంటారా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వచ్చి.. అసెంబ్లీని ముట్టడిస్తాం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడో లేడో తెలియని జనసేనను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారు. మాట్లాడితే చాలు సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నా అంటున్నారు. సీఎం జగన్‌కు మాత్రం ఏ వ్యాపారాలు లేవా? అయన కేవలం రాజకీయాలు చేస్తున్నారా? సీఎం సాబ్‌కు చెబుతా ఉన్నాం. పదివేల రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు 35వేల రూపాయలు విడుదల చేయకపోతే... రైతులు, నిరుద్యోగులు అందరూ కదలిరండి. మంచి మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. మేము అయ్యా, బాబు, సీఎం గారు అంటే ఏమాత్రం వినడం లేదు. రైతుల కోసం జనసేన పార్టీ ఉంది" అని పవన్ ఇటు సీఎం అటు వైసీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

వర్మ డైరెక్షన్ లో 'అల వైయస్ అవినీతిపురములో'! జగన్ పాత్ర పోషిస్తానన్న టీడీపీ నేత 

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కామన్.. కానీ రాజకీయ నాయకుడు సినీ నటుడు అవ్వాలనుకోవడం వెరైటీ. అందులోనూ ఒక నాయకుడు తమ ప్రత్యర్థి పార్టీ నాయకుడి పాత్రలో నటించాలనుకోవడం డబుల్ వెరైటీ. తాజాగా ఓ టీడీపీ నేత అలాంటి కోరికనే బయటపెట్టారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రలో నటించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, ఆయన స్టొరీ లైన్ ఇచ్చారు, డైరెక్టర్ ని కూడా ఎంపిక చేశారు. అలాగే, ఈ సినిమాకి అదిరిపోయే టైటిల్ ని కూడా పెట్టారు. ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురములో' స్ఫూర్తితో ఆ సినిమాకి 'అల వైయస్ అవినీతిపురములో' అని పేరు పెట్టారు.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఇళ్ల పట్టాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని చెప్పారు. సీఎం జగన్ పేదల పేరు చెప్పి 7 వేల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల్లో జరిగిన అవినీతిపై బొత్స చర్చకు రావాలన్నారు. తన ఆరోపణలు అవాస్తం అని తేలితే... రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బండారు సవాల్ విసిరారు. 31 లక్షల పట్టాలు ఇస్తామని వైసీపీ నేతలు అంటుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్‌లో 60 గదులు ఉంటే.. ఒక సెంటు‌లో పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని టీడీపీ నేత  ప్రశ్నించారు.     ఇళ్ల పట్టాల పంపిణి విషయంలోనే  వివాదాస్పద, సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బండారు సత్యనారాయణ మూర్తి  ఒక కోరిక కోరారు. ఇళ్ల స్థలాల అంశం ఆధారంగా వర్మ ఒక సినిమాను తీయాలన్నారు. ఆ సినిమాలో జగన్ పాత్రను తానే పోషిస్తానని చెప్పారు బండారు. ఆ చిత్రానికి 'అల వైయస్ అవినీతిపురములో' అని టైటిల్ పెట్టాలని సూచించారు. జగన్ అవినీతి మొత్తం తనకు తెలుసన్న బండారు..  తాను కూడా మంచి నటుడినే అని... అందుకే జగన్ పాత్రను తానే పోషించాలనుకుంటున్నానని చెప్పారు. వర్మ తనకు అవకాశాన్ని ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు బండారు సత్యనారాయణ మూర్తి.     టీడీపీ ప్రభుత్వంలో  నిర్మించిన ఇళ్లను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని చెప్పారు బండారు.  చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చామో.. అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జగన్ రెడ్డి సర్కార్  ఇళ్ల దోపిడీని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆపాలన్నారు. జగన్ ఒక మూర్ఖుడు, అహంకారి  అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండారు సత్యనారాయణ మూర్తి.  ఇళ్ల పట్టాల్లో జరుగుతున్న అనినీతిని దారి మళ్లించడానికే వైసీపీ నేతలు సవాళ్ల పేరిట డ్రామాలు ఆడుతున్నారని బండారు సత్యనారాయణమూర్తి  మండిపడ్డారు.

బండిపై కులం పేరు ఉంటే సీజ్! 

కుల రక్కసికి చెక్ పెట్టేందుకు ఉత్తర్ ప్రదేశ్ రవాణా శాఖ  వినూత్న నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కులం  తెలిపే స్టిక్కర్లు ఉంటే ఆ  వాహనాలను సీజ్ చేస్తోంది. కొందరు తమ వాహనాలపై తమ కులాన్ని ప్రతిబింబించే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. యూపీలో అయితే వాహనాల నెంబర్ ప్లేట్లు, అద్దాలు, బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఈ స్టిక్కర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. యాదవ్, జాట్, గుజ్జర్, బ్రాహ్మణ్, పండిట్, క్షత్రియ, లోధి, మౌర్య వంటి సామాజిక వర్గాల స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోతుండటాన్ని మహారాష్ట్రకు చెందిన హర్షల్ ప్రభు అనే టీచర్ గమనించాడు. ఇలా తమ సామాజిక వర్గాన్ని బహిరంగంగా ప్రదర్శించడం సరికాదని, ఇది సమాజంలో విభజనను తీసుకొస్తుందని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు లెటర్ రాశాడు.  హర్షల్ ప్రభు లేఖపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం యూపీ రవాణా శాఖకు పలు నిబంధనలు రూపొందించి పంపించింది. ఇలాంటి వెహికల్స్ ట్రాక్ చేయడం కోసం ఓ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది.  పీఎంఓ సూచనల మేరకు యూపీ రవాణాశాఖ   స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. స్టిక్కర్ల ద్వారా కులాన్ని ప్రదర్శించే వాహనాలను సీజ్ చేస్తోంది. తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ తనిఖీలో ప్రతి 20 వాహనాల్లో ఒకదానిపై స్టిక్కర్ ఉంటోందని, వెహికల్స్‌పై కులం తెలిపే స్టిక్కర్లు అంటించొద్దని కాన్పూర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి తెలిపారు. 

జడ్జిగా పాల వ్యాపారి కూతురు! తొలి ప్రయత్నంలోనే సాధించిన సోనాల్ 

పట్టుదల ఉంటే సాధించలేనిమి ఏదీ ఉండదంటారు. గతంలోనూ ఇది చాలా సార్లు రుజువైంది. ఎందరో పేదలు కష్టపడి తమ లక్ష్యాలను చేరుకున్నారు. ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరికొందరు వ్యాపార రంగంలో రాణించి దిగ్గజాలయ్యారు.  రాజస్థాన్  ఉదయ్‌పూర్‌కు చెందిన  సోనాల్ శర్మ  కూడా పట్టుదలగా చదివి అద్భుతాలు చేసింది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. వెనుకంజ వేయకుండా విజేతగా నిలిచి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. దూద్‌వాలా కూతురిగా తండ్రికి సాయం చేస్తూనే, మొదటి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికైంది.  పట్టుదల, సంకల్పం ముందు కొండంత లక్ష్యం చిన్నబోతుందనేందుకు  నిదర్శనంగా నిలిచింది సోనాల్ శర్మ.   సోనాల్ శర్మ తండ్రి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. తండ్రితో కలిసి సోనాల్  కూడా పశువుల పాకలో నిరంతరం శ్రమించేది. పశువుల కొట్టాన్ని క్లీన్ చేయడం, పేడ ఎత్తడం, పాలు పితకడం, పాలు పోయడం వంటి పనులన్నీ చేస్తూ.. అదే పాకలో తన లక్ష్యం కోసం కష్టపడి చదివేది. ఆ క్రమంలోనే 26 ఏళ్ల సోనాల్.. బీఏ, ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి మూడు బంగారు పతకాలు సాధించింది. ఎల్‌ఎల్ఎమ్ పూర్తి చేసిన తర్వాత రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీస్ కు సొంతంగా ప్రిపేర్ అయింది.  పరీక్ష కోసం బుక్స్ కొనే స్థోమత లేకపోవడంతో సైకిల్ మీద కాలేజ్‌కు వెళ్లి లైబ్రరీలో చదువుకునేది. చివరకు ఆమె అనుకున్నది సాధించింది.  తొలి ప్రయత్నంలోనే ఆర్‌జేఎస్ క్రాక్ చేసి రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా నియమితురాలైంది.   మొదటి ప్రయత్నంలోనే జడ్జిగా ఎన్నికైన సోనాల్ శర్మ ఇప్పుడు ఎందరికో స్పూర్తిగా నిలుస్తోంది. నలుగురు పిల్లలమైన మమ్మల్ని చదివించడానికి నాన్న ఎంతగానో కష్టపడ్డారని చెబుతోంది సోనాల్ శర్మ.   తమ చదువుల కోసం లోన్లు కూడా తీసుకున్నారని తెలిపింది. చిన్నప్పుడు స్కూల్లో తమది  పాల వ్యాపారం చేసే కుటుంబం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేదాన్ని..  కానీ నేడు మా నాన్న ఓ దూద్‌వాలా అని గర్వంగా చెప్పుకుంటానని చెప్పింది.  తన  విజయం నాన్నకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చిందని,  ఇక నుండి  నాన్నకు ఏ కష్టం రాకుండా చాలా సంతోషంగా చూసుకుంటానని సంతోషంగా చెబుతోంది   సోనాల్ శర్మ.  

డాక్టర్‌ సుధాకర్‌ కేసు.. సీబీఐకి ఏపీ హైకోర్ట్ షాక్!

విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ కేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నివేదికను సమర్పించింది. అయితే, సీబీఐ దాఖలు చేసిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరింత లోతైన విచారణ జరపాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ మొదటివారానికి వాయిదా వేసింది.

ప్రజలకంటే పేకాట క్లబ్‌లే ముఖ్యం ! కొడాలి నానికి పవన్ పంచ్ 

కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధికార పార్టీని టార్గెట్ చేశారు.  గుడివాడ రాగానే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానిపై పంచ్‌లు వేశారు. పేకాట క్లబ్‌లపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని విమర్శించారు. గుడివాడలో రోడ్లు అధ్వన్నంగా ఉన్నాయని ప్రజలు రహదారులను బాగుచేయాలని ఎమ్మెల్యేను నిలదీయాలన్నారు.  పేకాట క్లబ్‌లు నిర్వహించడంలో ఉన్న సమర్థత.. ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్లడంలో మంత్రికి లేదని మండిపడ్డారు పవన్ కల్యాణ్.  ఒక వర్గానికి చెందిన మీడియా సంస్థల్లో ఇష్టమొచ్చినట్లు దురుసుగా మాట్లాడితే కుదరదని పవన్ హెచ్చరించారు. నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని  స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే భరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు జనసేనాని. రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయన్నారు. మార్పు రావాలని, అందరికీ న్యాయం జరగాలన్నారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. 

ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీలో ఫ్లెక్సీ కలకలం!

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ ఆయన పేరు తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన తాతగారి లాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో రాణించగలరని, ఆయన తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణమని పలువురు అభిప్రాయపడుతుంటారు. అయితే, తాజాగా ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒకటి టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.   ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చకు దారి తీసింది. ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో మున్సిపల్ కమిషనర్ పై లైంగిక ఆరోపణలు.. దాడి చేసిన పారిశుధ్య సిబ్బంది

ఏపీలోని కృష్ణా జిల్లా పెడనలో మున్సిపల్ కమిషనర్‌పైనే పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా పారిశుద్య కార్మికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. మహిళా పారిశుద్య కార్మికురాలు లంకేశ్వరి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత వారు మున్సిపల్ కమిషనర్ అంజయ్యపై పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు.   ఇది ఇలా ఉండగా పారిశుద్య కార్మికులు చేస్తున్న ఆరోపణలను కమిషనర్ అంజయ్య ఖండించారు. తనపై కార్మికులు ఎందుకు దాడి చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను మార్నింగ్ చేస్తుండగా వారు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అంజయ్య పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై పెడన పోలీసులు విచారణ జరుపుతున్నారు.   మరోపక్క మున్సిపల్ కమిషనర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పెడన మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళా కార్మికులు ధర్నాకు దిగారు. అధికారి వేధింపుల నుండి తమను కాపాడాలని... తక్షణమే కీచక కమిషనర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్ !  

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కొన్ని రోజులుగా కారు పార్టీకి కమలం పార్టీ షాకులు ఇస్తుండగా.. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ  ఝలక్ ఇచ్చింది. ఆదిబాట్ల మున్సిపల్ చైర్మన్  కొత్త ఆర్ధిక అధికార పార్టీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోని ఉంది కొత్త ఆర్ధిక. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించారు. అయితే మున్సిపల్ చైర్మెన్ సీటును అధికార పార్టీ ఆఫర్ చేయడంతో ఆమె రాత్రికి రాత్రే గులాబీ పార్టీలో చేరిపోయారు. ఆదిబట్ల మున్సిపాలిటీగా తొలి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.  అధికార పార్టీలో చేరి ఆదిబట్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఆమె  మొదటి నుంచి సంతృప్తిగా లేదని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేనే పూర్తి పెత్తనం చలాయిస్తుండటంతో తాను విదులు నిర్వహించలోకపోతున్నానని ఇటీవల ఆమె బహిరంగంగానే కామెంట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇంతలోనే టీఆర్ఎస్ కు గుజ్ బై చెప్పి సొంత పార్టీలో చేరిపోయారు కొత్త ఆర్ధిక. ఆదిబట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ లో చేరడంతో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేతలు షాకవుతున్నారు. 

జైలు భయంతోనే కేసీఆర్ యూ టర్న్!  

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకోవడం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. తాను జైలుకు వెళ్లకుండా ఉండేందుకు . కేసీఆర్ రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారని  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు.  కేసీఆర్ తుగ్లక్‌ను మరిపిస్తున్నారని  ఆయన విరుచుకుపడ్డారు.  తెలంగాణలో ఒకటి మాట్లాడుతూ  ఢిల్లీకి వెళ్లి మరొకటి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలపైనా మల్లు రవి మండిపడ్డారు. బండి సంజయ్ చెప్పినట్లు కేసీఆర్‌ను జైల్‌కు ఎప్పుడు పంపిస్తారో  బీజేపీ నేతలు చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు.  విత్తన సబ్సిడీ, ఇన్సూరెన్స్‌లు తీసేసి రైతుల జీవితాలతో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని  ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ దరిద్రపు పాలన కొనసాగిస్తున్నారని  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతులను నట్టేట ముంచి మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్పీ ఇవ్వాల్సిన ప్రభుత్వం.. లాభ నష్టాల గురించి ఆలోచిస్తుందని మండిపడ్డారు. దేశంలో మొదటగా జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదం కాంగ్రెస్ తీసుకొచ్చింది అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.  మరోవైపు  నియంత్రిత సాగును ఎత్తివేస్తూ, పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై  రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద శ్రీధర్ రెడ్డి అనే రైతు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా  ధర్నా చేపట్టారు.  కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతుల పంటలు ఎవరు కొనాలని.. వారికి గిట్టుబాటు ధర ఎవరు ప్రకటించాలని రైతు శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రకటనను ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకు తాను  ధర్నా కొనసాగిస్తానని తెలిపారు. అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేయడానికి వీలు లేదంటూ  శ్రీధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

సంచయిత మరో వివాదాస్పద నిర్ణయం.. మాన్సాస్ కార్యాలయం తరలింపు!

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఆమె.. తాజాగా మరో వివాదానికి తెరతీశారు. ఇప్పటివరకూ విజయనగరం మహారాజ కోటలో ఉన్న మాన్సాస్ రెవిన్యూ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయం తరలింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. ఛైర్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ల సంతకాలతో కార్యాలయం మార్పు నిర్ణయం మోమో విడుదలైంది. 1958 లో పివిజి రాజు స్థాపించిన మాన్సాస్ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కార్యాలయాన్ని తరలించాలని మాన్సాస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంచయిత నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్ పై వీహెచ్ సంచలనం!  పీజేఆర్ ను వదిలేయమని ఆఫర్  

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. దివంగత మాజీ మంత్రి పీజేఆర్‌ గురించి ప్రస్తావన తెస్తూ వైఎస్‌పై వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.  పీజేఆర్‌కు  తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని అప్పట్లో వైఎస్ ప్రయత్నాలు చేశారని చెప్పారు వీహెచ్. అంతేకాదు పీజేఆర్‌ను వదిలేస్తే ఏ సహాయమైనా చేస్తానని వైఎస్  తనకు ఆఫర్ చేశారని తెలిపారు. అయితే  వైఎస్సార్  ఆఫర్‌ను తాను తిరస్కరించానని..  ఒకవేళ అప్పట్లో వైఎస్‌ ఆఫర్‌ను అంగీకరించి ఉంటే  తాను ఎంతో సంపాందించేవాడినని చెప్పారు హనుమంతరావు.  కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ఇవాళే పీజేఆర్ వర్ధంతి కూడా కావడంతో .. ఆ సమావేశంలో ఆయన గురించి పలు వ్యాఖ్యలు చేశారు వీహెచ్.   కాంగ్రెస్ ఉన్నంత కాలం పీజేఆర్‌ను ప్రజలు మరువరని తెలిపారు. తాగునీటి కోసం పోరాటం చేశారని, ఎంతోమంది పేదలకు ఇళ్లు ఇప్పించారని చెప్పారు.  తెలంగాణ కోసం మొదట పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని వీహెచ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ గురించి వీహెచ్  చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలను ఆఫర్ల ద్వారానే వైఎస్సార్ తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

ఆగని రైతు ఉద్యమం... వందల సంఖ్యలో జియో సెల్ టవర్ల ధ్వంసం

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు తాజాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీపై యుద్ధానికి దిగారు. రిలయన్స్‌ జియోకు చెందిన 1338 సిగ్నల్‌ టవర్ల సైట్లను ధ్వంసం చేశారు. గడచిన 24 గంటలలోనే 151 టవర్లను, అవి ఉన్న సైట్లను కొంత మంది ఆందోళనకారులు నాశనం చేసినట్లు పంజాబ్ ప్రభుత్వమే ప్రకటించింది. "ఢిల్లీ శివార్లలో, పంజాబ్‌లోని చాలా చోట్ల నిరసనల్లో రైతులు సంయమనం పాటిస్తున్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. మీ చర్యల వల్ల ఫోన్‌ కనెక్టివిటీ పోతోంది.. ఫలితంగా ప్రజల దైనందిన జీవితానికి ఆటంకం కలుగుతోంది. పిల్లల చదవుకు.. ఇంటి నుంచి పని చేసే టెకీలకు ఈ చర్యలతో నష్టం వాటిల్లుతుంది. అంతేకాక కొవిడ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో ఇలాంటివి అవాంఛనీయం" అని సీఎం అమరిందర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. ఎక్కడికక్కడ టెలికాం లైన్లను, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే వీరంతా రైతులేనని చెప్పలేమని, వీరిలో కొందరు అరాచకవాదులు కూడా కలిసి ఈ అరాచకానికి పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. వీరు ముఖ్యంగా రాత్రివేళల్లో ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కత్తిరించేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు.   పంట ఉత్పత్తుల సేకరణ, పంపిణీ మొదలైన విషయాలతో దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ గ్రూపులకు ఎలాంటి సంబంధమూ లేకపోయినా.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల ఆ ఇద్దరి కంపెనీలకూ భారీగా లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయాలతో కొందరు వ్యక్తులు ఈ విధ్వంసకాండకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ చట్టాల సహకారంతో కార్పొరేట్లు తమ భూములను లాగేసుకుంటాయని ఆందోళన చెందుతున్న రైతులు ఆ కార్పొరేట్లకు ప్రతినిధులుగా అంబానీ, అదానీలను భావిస్తున్నారు.   మరోపక్క ఒక్క రోజులో 200 కు పైగా ప్రదేశాలలో నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడం వల్ల కనెక్టివిటీ తెగిపోయిందని, ఈ సైట్లలో సుమారు రూ.40కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రిలయన్స్‌ జియో పేర్కొంది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో రైతుల పేరిట కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, తగిన భద్రతనివ్వాలని రిలయన్స్ అధికారులు 23వ తేదీనే పంజాబ్‌ డీజీపీకి లేఖ రాయడంతో ఆయన పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేశారు.   ఇది ఇలా ఉండగా రైతుల ముసుగులో కొంత మంది అరాచకవాదులు ఈ దురాగతాలు చేస్తున్నారని పంజాబ్‌లో అతి పెద్ద రైతు సంఘం భారతీయ కిసాన్‌ యూనియన్ ‌(ఉగ్రహాన్‌) పేర్కొంది. "జియోను బహిష్కరించాలని, ఆ సిమ్‌లు వాడవద్దని మాత్రమే పిలుపునిచ్చాం తప్ప నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయమని కోరలేదని, రైతులు కూడా అలా చేయరని" పేర్కొంది.   మరోపక్క నిన్న ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమం ప్రసారమవుతున్నపుడు రైతులు తాము భోజనం చేసే పళ్లాలను మోగిస్తూ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినదించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరానికి చివరిసారిగా మోదీ తన మన్‌కీ బాత్‌ను వినిపించినా అందులో అయన రైతుల గురించిన ఎటువంటి ప్రస్తావన చేయలేదు. మరోపక్క రైతులు మాత్రం "మోదీ తన మనసులో మాటల్ని చెప్పడం కాదు... మా మనసుల్లో మాట వినాలి" అని రైతు నేతలు వ్యాఖ్యానించారు. "మోదీ మాటలు వినీ వినీ రైతులు విసిగెత్తి పోయారు. చెప్పిన మాటలే చెప్పడం, రైతులపై అభాండాలు వేయడం ఆయనకు పరిపాటయ్యింది. అందుకే ఈ నిరసన" అని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ అన్నారు.