వైసీపీ ఎమ్మెల్యే పేరు రాసి మహిళ ఆత్మహత్య!!
posted on Dec 18, 2020 @ 3:21PM
తన ఇంటికి నడిచే దారి మూసివేయడంతో తీవ్ర మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరిగింది. అనపర్తిలోని బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో అరుణకుమారి(46) కుటుంబం నివాసం ఉంటోంది. వారు ఉంటున్న ఇంటికి దారి లేకపోవడంతో కొన్నేళ్లుగా పాఠశాల క్రీడా మైదానాన్ని దారిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల పాఠశాలకు ప్రహరీ నిర్మించడంతో దారి మూసుకుపోయింది. దారి మార్గాన్ని ఉంచి మిగిలిన స్థలంలో గోడ నిర్మాణం చేయాలని ఆ ప్రాంత మహిళలంతా స్థానిక ఎమ్మెల్యేను వేడుకున్నారు. అయినప్పటికీ దారి మూసివేస్తూ గోడ నిర్మించారు. దీంతో మనస్తాపానికి గురైన అరుణకుమారి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిని ఉద్దేశిస్తూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
"ఎమ్మెల్యే గారు.. డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా మీ పై అభిమానంతో ఓటు వేసినందుకు తగిన బుద్ధి చెప్పారు." అంటూ అరుణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి.. వేయకపోగా.. ఉన్న దారి కూడా మూసి వేసారని పేర్కొన్నారు. దారి మూసి వేయడంతో కార్తీక మాసంలో గుడికి కూడా వెళ్ళలేక ఇబ్బంది పడ్డామని అన్నారు. సాయం చేయమని వేడుకున్నా ఎమ్మెల్యే దయ లేకుండా వ్యవహరించడంతో చావే శరణ్యమని నిర్ణయించుకున్నానని ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ గా ప్రాణాలు కాపాడాల్సిన ఎమ్మెల్యే, వేధింపులకు గురిచేసి మహిళను బలితీసుకున్నారని మండిపడ్డారు. వారు పంచిన రూ. 2 వేలు తీసుకోకుండా వైసీపీకి ఓటు వేసినందుకు.. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిని మూయించి వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అరుణకుమారి బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. వైసీపీ నాయకులు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.