వ్యవసాయ చట్టాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి
posted on Dec 18, 2020 @ 3:48PM
నూతన వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధరకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతు ఆందోళనలు కొనసాగుతున్న వేళ, మధ్యప్రదేశ్ రైతులతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రజలు, రైతులు నమ్మకం ఉంచాలని.. ఎవరికైనా అనుమానాలు, ఆందోళనలు ఉంటే వారితో చర్చించి, వారి భయాలు పోగొడతాం అన్నారు. కనీస మద్దతు ధర ఎత్తివేస్తారనేది అతి పెద్ద అబద్ధం అని పేర్కొన్నారు.
వ్యవసాయ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని.. గత 20,30 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం గురించి చర్చించాయని అన్నారు. దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతు సంఘాలు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే.. కొన్ని పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయ సంస్కరణలు జరగడం ప్రతిపక్షాల బాధ కాదని, ఇన్నాళ్ల పాటు తాము చేయని మంచి పని మోదీ చేశారు కాబట్టే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మోదీ అన్నారు. ఇంత మంచి సంస్కరణలు మేం ఎందుకు ప్రవేశపెట్టలేకపోయామని, ఆ ఘనత మోదీకే ఎందుకు దక్కాలని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు అన్నారు. "అలాంటి వాళ్లకు నా సమాధానం ఒక్కటే. నాకు ఎలాంటి క్రెడిట్ వద్దు. మొత్తం మీరే తీసుకోండి. రైతుల అభివృద్ధే మాకు ముఖ్యం. దయచేసి రైతులను తప్పుదోవ పట్టించకండి" అని ప్రధాని మోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.