ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం వెళ్లగా.. మరో ఘోర ప్రమాదం
posted on Dec 19, 2020 @ 9:52AM
తమ కళ్ళ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు సాయం వెళ్లిన ఆ బడుగు జీవుల ఊపిరి తీసింది అటుగా దూసుకొచ్చిన సిమెంట్ లారీ. అనంతపురం జిల్లాలో నిన్న సాయంత్రం పొద్దు వాలాక కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న కూలీలు తమ కళ్ళ ముందే ఒక కారు ఢీకొని ఓ యువకుడు రోడ్డుపై పడి ఉండటం గమనించారు. దీంతో అతడిని కాపాడేందుకు అతడి వద్దకు వెళ్లారు. అయితే ఇంతలో అటుగా దూసుకొచ్చిన లారీ.. గాయపడిన యువకుడితో పాటు అతడిని కాపాడి సపర్యలు చేస్తున్న కూలీల ఊపిరి కూడా తీసింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి వద్ద నిన్న శుక్రవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఆ దుర్ఘటన పూర్తీ వివరాల్లోకి వెళితే.. రాఘవంపల్లికి చెందిన రైతు శ్రీకాంతప్ప ఏకైక కుమారుడు రాజశేఖర్(20). అనంతపురం నుండి బైకు పై తన స్వగ్రామానికి వస్తుండగా రాఘవంపల్లి క్రాస్ వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న ఒక కారు వేగంగా ఆయన బైకును ఢీకొనడంతో రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అదే సమయంలో కూలి పనులు ముగించుకొని తిరిగొస్తున్న కూలీలు ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రుడిని కాపాడడానికి అతడి వద్దకు వెళ్లారు. వారు బాధితుడికి సపర్యలు చేస్తుండగానే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్ లారీ కూలీలపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అప్పటికే గాయపడిన రాజశేఖర్‌తో పాటు నలుగురు కూలీలు కూడా అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు, ముష్టూరుకు చెందిన శివమ్మ, సంజీవపురానికి చెందిన సూరి, వలిలు గా గుర్తించారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజు అనే మరో కూలీ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారు, లారీ డ్రైవర్లు తమ వాహనాలు వదిలేసి పరారయ్యారు. చనిపోయిన వారంతా రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కూలీలు కావడంతోపాటు కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కుగా ఉన్నవారు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు వీధిన పడ్డారు. ఇది ఇలా ఉండగా "ప్రయోజకుడై ముసలి వయస్సులో ఆసరాగా ఉంటావనుకుంటే మమ్మల్ని వదిలేసి పోతివా నాయనా! నీ బదులు మమ్మల్ని తీసుకెళ్లినా బాగుండేది" అంటూ తన ఒక్కగానొక్క కొడుకు రాజశేఖర్ ను పోగొట్టుకున్న తండ్రి శ్రీకాంతప్ప రోదన పలువురిని కంటతడి పెట్టిస్తోంది.