జానా రెడ్డికి గవర్నర్ గిరి.. కొడుకుకు సాగర్ సీటు! బీజేపీలో చేరిక ఖాయమేనా?
posted on Dec 18, 2020 @ 4:50PM
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి కారు పార్టీలో కలవరం రేపిన కమల దళం.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ఫలితాలు సాధించి గులాబీలో మరింత గుబులు రేపింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ జోష్ తో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ గెలుపునకు కార్యాచరణ సిద్దం చేస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉన్న నాగార్జున సాగర్ ను కైవసం చేసుకుంటే తెలంగాణలో తమకు తిరుగేలేదని భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అందుకే సాగర్ కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారట. పార్టీ మారేది లేదు లేదంటూనే బీజేపీ పెద్దల టచ్ లోకి జానా రెడ్డి వెళ్లారని, వారి ముందు పెద్ద ప్రతిపాదనే ఉంచారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ.. జానా రెడ్డితో పార్టీ హైకమాండ్ తరపున సంప్రదింపులు చేస్తున్నారని టాక్. ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా జానారెడ్డితో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. మొదట పార్టీ మారేందుకు ఆసక్తి చూపని జానారెడ్డి.. తర్వాత సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తోంది. తనకు వయసు మీద పడటంతో ఎన్నికల్లో పోటీ చేయలేనని, తన కొడుక్కి నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలని, తనకు గవర్నర్ పోస్టు ఇవ్వాలని బీజేపీ పెద్దల ముందు జానారెడ్డి ఆఫర్ పెట్టారని సమాచారం. జానా రెడ్డి ప్రతిపాదనను బీజేపీ దాదాపుగా అంగీకరించిందని , అతని కొడుకుని నాగార్జున సాగర్ లో నిలబెట్టి గెలిపించుకుంటామని కమలం పెద్దలు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో జానా రెడ్డి త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీతో పోలిస్తే బీజేపీకి నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ కమలం బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు అసెంబ్లీ సీటు గెలవలేదు. నాగార్జున సాగర్ గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేయగా ఏడు సార్లు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడినా ఆయన పట్టు మాత్రం నియోజకవర్గంలో పోలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కే లీడ్ వచ్చింది. నాగార్జున సాగర్ లో బీజేపీ బలం అంతంత మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డికి ఒక్క శాతం ఓట్లే పోలయ్యాయి. నివేదిత కేవలం 2 వేల 675 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
నాగార్జున సాగర్ లో బలహీనంగా ఉన్న బీజేపీ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకే జానారెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని భావిస్తున్నారు. జానారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వెనక బీజేపీకి భారీ వ్యూహమే ఉందంటున్నారు. నాగార్జున సాగర్ లో గెలవడంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయాలని ప్లాన్ చేస్తుందట. జానా రెడ్డి పార్టీ మారితే.. ఆ పార్టీ నుంచి మరి కొంత మంది ముఖ్య నేతలు కూడా కమలం గూటికి వస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ బలహీనం అయితే ప్రజా వ్యతిరేకత ఓటంతా కమలానికే వస్తుందని బీజేపీ నేతల అంచనా.
తర్వాత కేసీఆర్ కు చుక్కలు చూపించే యోచనలో ఉందట కమలం పార్టీ. అందుకే నాగార్జున సాగర్ ను తెలంగాణలో అధికారంలోకి రావడానికి అత్యంత కీలకంగా తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. తమకు ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్ లోనూ గెలిస్తే.. ఆ పార్టీకి తెలంగాణలో ఇక తిరుగు ఉండదని రాజకీయ అనలిస్టులు కూడా చెబుతున్నారు. ఆ దిశగానే కమలనాథులు పక్కా కార్యాచరణతోనే కదులుతున్నట్లు కనిపిస్తోంది.