ముందస్తు ఎన్నికలు ఖాయమేనా? కేసీఆర్ జనం బాట అందుకేనా?
posted on Jul 10, 2021 @ 11:54AM
ఫాంహౌజ్ ముఖ్యమంత్రి.. ప్రగతి భవన్ ముఖ్యమంత్రి... జనాలకు అసలు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి.. ఇదీ కేసీఆర్ పై చాలా రోజులుగా ఉన్న విమర్శ. విపక్షాల నుంచి కాదు జనాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందుకు కేసీఆర్ వ్యవహార శైలి కూడా కారణమైంది. రెండోసారి అధికారంలోకి వచ్చాకా గత రెండున్నర ఏండ్లలో ఆయన జనాల్లో తిరిగింది లేనే లేదు. ఉంటే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌజ్. సచివాలయంకు వెళ్లే అలవాటు లేని కేసీఆర్.. కొన్ని సార్లు మూడు, నాలుగు వారాల పాటు ఫాంహౌజ్ లోనే ఉన్న సందర్భాలు ఉన్నాయి. జనాలకు కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే మంత్రులకు కూడా ఆయన కలిసే భాగ్యం దక్కలేదని చెబుతారు. ఇటీవలే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల రాజేందర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లి అపాయింట్ మెంట్ దొరక్క ఎన్నోసార్లు అవమానంతో తలదించుకుని వచ్చామని చెప్పారు ఈటల.
ఫాంహౌజ్ ముఖ్యమంత్రిగా ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్.. ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చారు. ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి ప్రజల బాట పట్టారు. జూన్ లో నాలుగైదు జిల్లాలు తిరిగారు. కొత్త కలెక్టరేట్లను ప్రారంభిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ షో చేశారు. యాదాద్రి భవనగిరి జిల్లాలోని వాసాలమర్రిని దత్తత తీసుకుని ఆ గ్రామంలో పర్యటించారు. ప్రగతి భవన్ లోనూ స్పీడ్ పెంచారు కేసీఆర్. వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగేండ్లుగా పెండింగులో ఉన్న కొత్త రేషన్ కార్డుల పంపిణికి ఓకె చెప్పారు. రెండేండ్లుగా హామీగానే ఉన్న 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ కు అతిపెద్ద సమస్యగా ఉన్న ఉద్యోగ కల్పనపైనా కేసీఆర్ ఫోకస్ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. దళితుల అభివృద్ధి కోసమంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.
కేసీఆర్ రూట్ మార్చి జనంలోకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రజాగ్రహం పెరిగిందన్న నివేదికల ఆధారంగానే కేసీఆర్ దిగొచ్చారని కొందరు చెబుతుంటే.. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కొత్త ఎత్తులు వేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. హుజురాబాద్ లో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే భయంలో టీఆర్ఎస్ అధినేత ఉన్నారని అంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం తనకు పదవి వస్తుందన్న సమాచారంతో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చారని చెబుతున్నారు. దాంతో పాటు తాజా మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి. 2022 ఆగష్టు 15 తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికల కు వెళ్తారన్నారు. అందుకోసమే కేసీఆర్ పర్యటనలతో పేరుతో హంగామా చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ముందస్తు ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది. ఇప్పుడంతా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ వ్యూహాలు అలానే ఉంటాయి మరీ. తనపై వ్యతిరేకత పెరిగిందని గుర్తించినా.. ప్రత్యర్థుల ఎత్తులకు అనుగుణంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. మోడీ క్రేజీ బాగా ఉండటంతో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెళితే బీజేపీకి ప్లస్ అవుతుందని అంచనా వేసిన కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆయన అనుకున్నట్లుగానే రెండోసారి అధికారంలోకి వచ్చారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది.
కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు తెలిసినవారంతా ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నిజమే కావచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుండటం, విపక్షాలు దూకుడుగా వెళుతుండటంతో కేసీఆర్ కూడా వ్యూహాలు మార్చుతున్నారని అంటున్నారు. ఆగస్టులో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. వైఎస్సార్ టీపీని ఏర్పాటు చేసిన షర్మిల కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విపక్షాలకు ఎక్కువ సమయం ఉండకుండా చూసేందుకు కేసీఆర్ ముందస్తు ప్లాన్ చేస్తూ ఉండవచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. కేసీఆర్ జనంలోకి వెళుతుండటం కూడా ఇందుకు బలాన్నిస్తోందని వాళ్లు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న కృష్ణా జలాల వివాదం కూడా ఇందులో భాగం కావచ్చనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తూనే ఉంది. కాని దాని గురించి ఎప్పుడు మాట్లాడని కేసీఆర్.. సడెన్ గా రెచ్చిపోయారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు... పవర్ జనరేషన్ చేపట్టారు. శ్రీశైలం , సాగర్ లో సరిపడా నీళ్లు లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయిస్తున్నారు. దీంతో ఇప్పటికే మూడు టీఎంసీలకు పైగా కృష్ణా జలాలు సముద్రం పాలయ్యాయి. కేసీఆర్ అంత మొండిగా ముందుకు వెళ్లడానికి సెంటిమెంట్ రాజకీయాలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. నీళ్ల సెంటిమెంట్ ను రలిగించి ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.