హుజురాబాద్ లో దొంగ ఓట్ల కలకలం!
posted on Jul 10, 2021 @ 8:08PM
తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. సొంత నియోజకవర్గంలో గెలిచి టీఆర్ఎస్ కు షాకివ్వాలని ఈటల రాజేందర్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతున్న రాజేందర్.. జూలై 13, 14 తేదీల్లో పాదయాత్ర చేయబోతున్నారు. ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తమకు తిరుగులేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి హుజురాబాద్ ఉప ఎన్నిక తొలి పరీక్ష కాబోతోంది. అన్ని పార్టీలు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకోవడంతో ఎన్నికల వేడి రాజుకుంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తాజాగా ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక ఇంటి నెంబర్ లో 34 ఓట్లు నమోదు చేసారంటూ జాబితా విడుదల చేశారు. హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని, దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని అన్నారు. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 డొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఆర్డీఓ నేతృత్వంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయన్నారు ఈటల రాజేందర్ , మున్సిపాల్టీలు, పెద్ద గ్రామాల్లో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారన్నారు. తమకు ఓట్లు వేయరనుకున్న వాళ్ల ఓట్లను టీఆర్ఎస్ నేతలు తీసేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ రాధిక ఇంట్లో 34 ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలు చూపెట్టారు ఈటల.
దొంగ ఓట్లపై కార్యకర్తలతో కలిసి ఉద్యమిస్తామన్నారు రాజేందర్. సర్కార్ అధికార దుర్వినియోగం ఎక్కువైందన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులకు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అధికారులు అధికార పార్టీకి బానిసల్లా పనిచేయవద్దని ఆయన హితవు పలికారు. పోల్ మేనేజ్మెంట్‌ను పోలీసులు చూసుకుంటున్నారన్నారు. మఫ్టీ పోలీసులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటున్నారన్నారు. తాను ఒంటరిగా బరిలో దిగనని... ప్రజాస్వామికవాదుల అండతో పోటీ చేస్తున్నానన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు, ఈటలకు మధ్య, అన్యాయానికి, న్యాయానికి మధ్య జరుగుతున్నాయి. ఓటుకు టీఆర్ఎస్ లక్ష ఇచ్చినా.. తనకే వేస్తాం అంటున్నారని ఈటల చెప్పారు.
ఈటల రాజేందర్ చేసిన దొంగ ఓట్ల ఆరోపణలు సంచలనంగా మారాయి.అయితే ఈటలకు వెంటనే కౌంటరిచ్చారు హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు. తన ఇంట్లో దొంగ ఓట్లు నమోదు చేయించారన్న ఈటల ఆరోపణలను హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధిక తీవ్రంగా ఖండించారు. 36 ఓట్లు ఒక్క ఇంటి నెంబర్ పై అంటున్న ఈటెలా... ఈ రిపోర్ట్ కార్డు ఎవ్వరిదంటూ ప్రశ్నించారు. 2018లో నమోదైన ఓటర్ల జాబితాలోనే ఈ ఓట్లన్ని ఉన్నాయన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో కిరాయికి ఉన్నవారికి ఓట్లు ఉన్నాయన్నారు. 2018లో వీళ్లందరి ఓట్ల కోసం వచ్చిన విషయం గుర్తు లేదా ఈటల అంటూ రాధిక నిలదీశారు. ఇవన్ని దొంగ ఓట్లు అయితే నీవు 2018లో గెలిచింది దొంగ ఓట్లతోనేనని అంగీకరిస్తున్నావా అని మున్సిపల్ చైర్మన్ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే రాజేందర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.