రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి లీగల్ నోటీస్..
posted on Jul 10, 2021 @ 9:30PM
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. మొదటగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు జారీ చేసింది. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ నుంచి సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు అందింది. రేవంత్ రెడ్డి సూచన మేరకు ఏఐసిసి ఈ నోటీసు మనిక్కం ఠాగూర్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది.
జులై 3వ తేదీన టిఆర్ఎస్ ఎల్పీ లో మీడియాతో మాట్లాడిన సుధీర్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్ష నియామకంలో మనిక్కమ్ ఠాగూర్ 25 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపైనే తన న్యాయవాది ఆర్. అరవిందన్ ద్వారా మానిక్కమ్ ఠాగూర్.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు.
తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశాని, ఎంతో నిజాయితీగా రాజకీయాలలో ప్రతిష్ట పెంచుకున్న తనకు ఆ అబద్ధపు ప్రకటనతో పరువు దెబ్బతిన్నదని నోటీసులో పేర్కోన్నారు ఠాగూర్. ఈ విషయంలో వారం రోజులలో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని లీగల్ నోటీసుల్లో పొందుపరిచారు.లీగల్ నోటీసుకు సుధార్ రెడ్డి ఇచ్చే జవాబును బట్టి న్యాయస్థానాల్లో కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో కొత్త పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చాలా కఠినమైన అభిప్రాయంతో ఉన్నారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వెళ్లిపోయిన వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ ప్రకటనపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగానే స్పందించారు. ఆ వివాదం కొనసాగుతుండగానే లీగల్ నోటీస్ రావడం మరింత కాక రేపుతోంది. ఈ లీగల్ నోటీసుల అంశం సుధీర్ రెడ్డితోనే ఆగిపోతుందా లేద మంత్రి సబితారెడ్డి తో సహా ఇతర ఎమ్మెల్యేలకు సైతం ఇస్తరా అన్నది చర్చగా మారింది.