మరో కొత్త వైరస్.. పేరు జికా.. మదర్ టంగ్ ఉగాండా..
posted on Jul 10, 2021 @ 10:20AM
ఒకవైపు కరోనా సెకండ్‌వేవ్ శాంతించలేదు ఇంకా తగ్గనే లేదు. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు విరుచుకుపడనుందని నిపుణుల వార్నింగ్ బెల్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రపంచాన్ని, దేశాన్ని గుల్ల గుల్ల చేసిన నేపథ్యంలో ఇవి చాలదు అన్నట్లు.. తాజాగా మరో మహమ్మారి పురుడుపోసుకుంది. కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేరళ ప్రజలను వణికిస్తున్నది.. తిరువనంతపురంలో జికా వైరస్ కేసులు దాదాపు 15 కేసులు వెలుగులోకి వచ్చాయి.
అది కేరళలోని తిరువనంతపురం జిల్లా. పరస్సలైన్ ప్రాంతానికి చెందిన గర్భిణి. జూన్ 28న జ్వరం, తలనొప్పి, దద్దుర్లతో ఆస్పత్రిలో చేరింది.అక్కడి డాక్టర్స్ కు అంతు పట్టలేదు. ఆమె శాంపిల్స్‌ను పుణెలోని ఎన్‌ఐవీకి పంపించిన తర్వాత.. శాంపిల్ రిపోర్ట్స్ వచ్నిన తర్వాత ఆమెకు జికా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. అంతే కాదు జూలై 7వ తేదీన ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతానికి ప్రమాదం ఏమిలేదని వైద్యులు తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వైద్యులు చెప్పారు. అయితే వారం రోజుల క్రితం ఆమె తల్లికి కూడా ఇలాంటి లక్షణాలే కనిపించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, బాధితురాలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జికా వైరస్ కలకలంతో వెంటనే కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తిరువనంతపురం జిల్లాలో జికా వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు. వైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈడెస్ జాతుల దోమల నమూనాలను సేకరించి చర్యలు తీసుకున్నారు. ఇది దోమ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తోంది. దీని గురించి అన్ని జిల్లాలను అప్రమత్తం చేశామన్నారు. కేరళ ప్రజలకు అవగాహనా పరుస్తున్నారు.
కాగా, కేరళ ప్రభుత్వం అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు రంగంలోకి దిగి బాధితుల ట్రావెల్ హిస్టరీపై ఆరా తీస్తున్నారు. వారి కాంట్రాక్ట్‌ను ఛేదించే పనిలో పడ్డారు. ఇదిలావుంటే, తిరువనంతపురం జిల్లాలో అనుమానంగా ఉన్న మరో 19 శాంపిల్స్‌కు టెస్టులు నిర్వహించారు. వాటిలో 15 కేసులు జికా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. అప్పటితో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కోవిడ్ -19 రెండవ వేవ్‌తో పోరాడుతున్న కేరళకు ఇప్పుడు అదనపు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వెలుగుచూసిన జికా వైరస్‌తో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా పంపినట్లు ఉమ్మడి ఆరోగ్య కార్యదర్శి లావ్ అగర్వాల్ శుక్రవారం తెలిపారు. ఇంతకుముందు 2016-17లో గుజరాత్‌లో జికా వైరస్ కేసులు గుర్తించారు.
జికా వైరస్ అంటే ఏమిటి?
జికా వైరస్ అనేది దోమల ద్వారా పుట్టుకొచ్చే ఫ్లేవి వైరస్ అని , దీనిని ఉగాండాలో 1947 లో కోతులలో గుర్తించారు. ఇది తరువాత 1952 లో ఉగాండాతో పాటు యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో మానవులలో గుర్తించబడింది. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, పసిఫిక్ దేశాలలో జికా వైరస్ వ్యాప్తి చెందింది. 1960 నుండి 1980 వరకు, ఆఫ్రికా, ఆసియా అంతటా మానవ అంటువ్యాధుల అరుదైన కేసులుగా గుర్తించారు. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గిపోవడంతో పాటు గిలన్ బరె సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్(రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని కణాలపైనే దాడి చేయడం) వ్యాధి వచ్చే అవకాశమూ ఉంటుంది.
పగటిపూట సంచరించే ఈడెస్ దోమల నుంచి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కక్షణాలు జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, అనారోగ్యం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా 2నుంచి 7 రోజుల పాటు ఉంటాయి. దోమ కాటు ద్వారానే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఐతే ఈ వైరస్ వాళ్ళ ఎక్కవ ప్రమాదం ఏం ఉండదని. ఈ జికా వైరస్‌తో సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవని..విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని అంటున్నారు వైద్యులు. అయితే, వైరస్ లో కొత్త చిక్కు ఉంది అది ఏంటంటే గర్భిణీ స్త్రీలకు సోకితే, పుట్టే పిల్లలపై ప్రభావం చూపిస్తుందని..వారిలో అనేక లోపాలకు దారితీయవచ్చని చెబుతున్నారు.