నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు
posted on Apr 3, 2023 7:30AM
తెలుగు రాష్ట్రాలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు సోమవారం (ఏప్రిల్ 3) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏపీలో ఈ నెల 15వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు , 17, 18 తేదీల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలుంటాయి. టెన్త్ పరీక్షలకు 6,09,070 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కానున్నారు.
వారిలో బాలురు 3,11,329 మంది, బాలికలు 2,97,741 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు 53,140 మంది కాగా, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 1,525 మంది ఉన్నారు. వీరి కోసం 3,349 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గత ఏడాది వరకూ ఏడు పేపర్ల విధానం అమల్లో ఉండగా, ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరుగుతున్నాయి.
సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్‌కు ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి విద్యార్థులతో పాటు సెంటర్ సూపరింటెండెంట్ సహా టీచర్లెవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకుండా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రశ్నపత్రాలు లీకైతే ఎక్కడినుంచి బయటికొచ్చాయో కనిపెట్టే విధానాన్ని అమలుచేస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.