కమలం గూటికి నితీష్?.. ఎప్పుడంటే..?
posted on Apr 3, 2023 @ 11:32AM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్ళీ కమలం గూటికి చేరాలని భావిస్తున్నారా? ఆయన చూపు బీజేపీవైపు మళ్లిందా? అంటే బీహార్ రాజకీయాలను నిశితంగా రాజకీయ పరిశీలకులు వరకు అవుననే అంటున్నారు. కొద్ది నెలల క్రితం కమలం చేయి వదిలి, లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ) సారథ్యంలోని మహా కూటమితో జట్టు కట్టిన జేడీయు అధినేత నితీష్ కుమార్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతున్న నేపధ్యంలో ఆర్జేడీతో కలిసి ప్రయాణం చేయడం కష్టమనే నిర్ణయానికి వచ్చారని అందుకే అసెంబ్లీఎన్నికలలోగా మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి, ఎన్నికల వ్యూహకర్త, బీహార్ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అడుగులు వేస్తున్న, ప్రశాంత్ కిషోర్ అయితే ఎప్పటి నుంచో ఈ మాట చెబుతున్నారు. ఎప్పటికైనా నిరీష్ కుమార్ మళ్ళీ బీజేపీ గూటికి చేరటం ఖాయమని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించారు. కాగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏకంగా బహిరంగ వేదికల నుంచే నితీష్ కుమార్ స్నేహ హస్తం చాచుతూ పంపిన సందేశాలను బయట పెట్టారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో మళ్లీ చేరుతామంటూ జేడీయు నాయకులు తమకు సంకేతాలను పంపిస్తున్నారని అమిత్ షా వెల్లడించారు.
అయితే ఎన్డీఏలో చేరికకు జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని, షా చెప్పారనుకోండి అది వేరే విషయం. అదే సమయంలో అమిత్ షా 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, మోడీనే మూడవసారి ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, 2024 ఎన్నికల తరువాత నితీష్ కుమార్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు.
కాగా బీహార్ లో పర్యటిస్తున్న కేంద్ర ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తాయరైందన్నారు. రెండురోజుల క్రితం శ్రీరామ నవమి పండగ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో అల్లర్లు చెలరేగిన నవడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. శాంతి భధ్రతలను నెలకొల్పే విషయంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చించి ఏ మాత్రం ఉపయోగం లేదని అమిత్ షా అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దించుతున్నామని ప్రకటించారు. అల్లర్లు చెలరేగిన ససారం పట్టణానికి తాను వెళ్లాలేని దురదృష్టకర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పారు.
బిహార్ లో జంగిల్ రాజ్ నడుస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిహార్‌లో శాంతి స్థాపన ఎలా సాధ్యమౌతుందని అమిత్ షా అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధానమంత్రి కావాలని నితీష్ కుమార్ ఇప్పటి నుంచే కలలు కంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు.
నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు. రాజకీయ పరిశీలకులు మాత్రం ఇతర పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, జేడీయు, ఆర్జేడీ మధ్య పొత్తు అసెంబ్లీ ఎన్నికల(2025) వరకు కొనసాగడం కష్టమే అంటున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయని ఆ పరిణామాల నేపధ్యంలో బీహార్ లో ఆర్జేడీ, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలుగా నిలుస్తాయని, అదే విధంగా జేడీయు కనుమరుగై పోతుందని విశ్లేషిస్తున్నారు.