కేబినెట్ పునర్వ్యవస్థీకరణేనా? ఎవరు ఇన్.. ఎవరు ఔట్?
posted on Apr 3, 2023 @ 12:01PM
వైసీపీ అధినేత తాను టెన్షన్ పడటమే కాకుండా, పార్టీ మొత్తాన్నీ టెన్షన్ లో పడేశారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయంతో కంగుతిన్న జగన్ ఇక పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల నాటికి బలమైన టీమ్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. కొందరేమో క్యాబినెట్ పునరవ్యవస్థీకరణ అంటున్నారు.
మరి కొందరేమో ఏకంగా అసెంబ్లీ రద్దే అంటున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలతో సోమవారం (ఏప్రిల్ 3) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలలోనే కాదు, పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర టెన్షన్ ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ శ్రేణుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అన్న టెన్షన్ లో ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం లేదనీ, తన కేబినెట్ పునర్వ్యవస్థీకరించి.. నష్ట నివారణ చర్యలను చేపడతారని జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు అంటున్నారు.
అందులో భాగంగా కొందరు మంత్రులకు, శాఖాపరంగా పట్టు సాధించడంలో విఫలమైన వారూ, అలాగే పార్టీ పరంగా సమన్వయం చేసుకోవడంలో పెద్దగా శ్రద్ధ పెట్టని వారిని తొలగించి, వారి స్థానంలో కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చే ఉద్దేశంలో జగన్ ఉన్నారని అంటున్నారు. అలాగే సామాజిక న్యాయం విషయంలో కూడా ఈ సారి జగన్ పెద్ద కసరత్తే చేశారని అంటున్నారు. తన కేబినెట్ లో ఇప్పటి వరకూ అవకాశం లభించని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. కొత్త కేబినెట్ లోకి చేరే వారిలో పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. గోదావరి జిల్లాలలో గట్టి పట్టు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, అలాగే నెల్లూరు జిల్లాలో రెడ్డి సమాజిక వర్గంలో అసంతృప్తిని తగ్గించేందుకు అదే జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అవకాశం కల్పించాలని జగన్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
ఇక గత కేబినెట్ లో కీలకంగా వ్యవహరించి ఈ తరువాత ఉద్వాసనకు గురైన బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నానిలకు మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు. ఇక ఉద్వాసనకు గురికాబోతున్న వారిలో పని తీరు సంతృప్తికరంగా లేని కాకాణి, సురేష్, మేరుగ నాగార్జున, తానేటి వనిత, గుమ్మలూరు జయరాం, తదితరుల పేర్లు వినవస్తున్నాయి. మొత్తానికి జగన్ ఎమ్మెల్యేలూ, సమన్వయకర్తల సమావేశం పార్టీలో టెన్షన్ కు కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.