విపక్షాలను ఏకం చేసిన రాహుల్ అనర్హత వివాదం
posted on Apr 3, 2023 @ 4:13PM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేజేతులా జాతీయ స్థాయిలో హస్తం పార్టీకి అండ దొరికేలా చేస్తోందా? బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరం పాటించలని భావిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ కు మద్దతుగా రోడ్లపైకి వచ్చేలా చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ పడికట్టు మాటలు మాట్లాడుతూ.. అన్యాపదేశంగా తమ వ్యతిరేకుల విషయంలో మాత్రమే చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ, అస్మదీయుల విషయంలో కాదనీ విపక్షాలు భావించేలా బీజేపీ తీరు ఉందనీ అంటున్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశంలో బీజేపీ యేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చింది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటూ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే బీజేపీని ఎంతగా వ్యతిరేకిస్తారో, అంతగా కాంగ్రెస్ నూ వ్యతిరేకించే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ..ఇలా దేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా జట్టు కట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనర్హత రగడలో రాహుల్‌కు దాదాపుగా ప్రతిపక్షా లన్నీ అండగా నిలబడ్డాయి.జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల స్థాయిలో కూడా రాహుల్ కు మద్దతు పెరుగుతోంది. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ వినా, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలన్నీ రాహుల్ కు అండ, మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అయితే ఒక అడుగు ముందుకు వేసి.. విద్యార్హతలను బయటపెడదాం అనే ఉద్యమానికి పిలుపు నిచ్చింది.
నిన్న మొన్నటి వరకూ బీజేపీయేతర పక్షాలుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీలన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీ అనర్హత వేటుకు నిరసనగా ఏకతాటిపైకి వచ్చాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పిలుపు మేరకు గత నెల 27న జరిగిన నిరసన ప్రదర్శనల్లో 17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జాతీయ రాజకీయా ల్లో కాంగ్రెస్ కు దూరంగా ఉండే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నది. దేశంలో రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మొగిలిన పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ దూకుడుగా ఉంటుంది.
అయితే ఒక్క లక్షద్వీప్‌కు చెందిన మహమ్మద్ ఫైజల్ మినహా ఎవరిపైనా ఇటీవలి కాలంలో అనర్హత వేటు పడలేదు. తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో సామాన్య ప్రజల్లో రాహుల్‌పై సానుభూతి పెరి గింది. రాహుల్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ టార్గెట్ చేసిందన్న అభిప్రాయం జనబాహుల్యంలో కలిగింది. దీనిని గుర్తించే సైద్ధాంతికంగా కాంగ్రెస్‌తో విభేదించే రాజకీయ పార్టీలు సైతం రాహుల్‌కు అండగా నిలుస్తున్నాయి. మరో ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అనర్హత వివాదమే కీలకాంశం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.