అమిత్ షా, నడ్డాలతో పవన్ భేటీ.. దేనికి సంకేతం?
posted on Apr 3, 2023 @ 12:37PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెనుమార్పులు జరగనున్నాయా? పొత్తుల విషయంలో ఒక స్పష్టత రానుందా? బీజేపీ అటా ఇటా అన్న డైలమా నుంచి బయటపడుతోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నాయి. అందుకు తార్కానంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలుగుదేశం నేతలతో భేటీని చూపుతున్నారు. అంతే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం (ఏప్రిల్ 3)భేటీ కానుండటం కూడా ఏపీలో పొత్తల విషయంలో బీజేపీలో కదలిక వచ్చిందనడానికి తార్కాణంగా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఆదివారం రాత్రి (ఏప్రిల్ 3) ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన అమిత్ షా, నడ్డాలతో భేటీ అవుతారన్న కన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ, ఏ సమయంలో వారితో బేటీ ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు. ఒకే సారి వారిరువురితో భేటీ అవుతారా? విడివిడిగా భేటీ అవుతారా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. హస్తిన పర్యటనలో పవన్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇలా ఉండగా బీజేపీ పెద్దల పిలుపు మేరకే పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లినట్లుగా చెబుతున్నారు. కుటుంబంతో వెకేషన్ కు రాజస్థాన్ వెళ్ళిన పవన్ కల్యాణ్ అక్కడి నుంచే నేరుగా హస్తిన చేరుకున్నారు.
ఏపీలో తెలుగుదేశంతో జనసేన ఇప్పటికే పొత్తకు నిర్ణయించుకుందన్న వార్తలు బలంగా వినవస్తున్నాయి. అందుకు తగినట్టుగానే పవన్ కల్యాణ్ కూడా పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తనకు పెద్దగా సఖ్యత లేకపోయినా ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వాన్ని ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఒప్పిస్తానని కూడా పవన్ గతంలో ఒకసారి చెప్పారు. ఇప్పుడు స్వయంగా బీజేపీ అధిష్ఠానం ఆయనను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ఏపీలో బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడబోతున్నాయా అన్న చర్చకు తెరలేపింది. అలాగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆ రాష్ట్రంలో తెలుగు వారి ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాలలో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేయాల్సిందిగా కోరేందుకే బీజేపీ అగ్రనాయకత్వం పవన్ కల్యాణ్ తో భేటీ అవుతోందన్న చర్చ కూడా వినవస్తోంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో అమిత్ షా, నడ్డాలతో భేటీ కానుండటం కచ్చితంగా ఏపీ రాజకీయాలలో కీలక మలుపునకు, పరిణామానికి సంకేతమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధమవుతోందని ఇప్పటికే అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలను పవన్ కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో జనసేన, బీజేపీల మధ్య ప్రస్తుతం పొత్తు ఉన్నప్పటికీ, రెండు పార్టీలు కలిసి పనిచేయడం మాత్రం జరగడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి జనసేన అభిమానులు ఓటు వేయలేదని బీజేపీ నేత మాధవ్ బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే భేటీలతో ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే ఆసక్తి నెలకొంది.