జగన్ నివాసంలో హెలిప్యాడ్ నిర్మాణానికి రూ.1.89 కోట్టా?.. ఇదేం జీవో జగనన్నా?
posted on Apr 3, 2023 @ 4:40PM
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆదాయన్ని కోల్పోయిందనీ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనీ తరచూ చెప్పే ఏపీ సీఎం జగన్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసమే పన్నులు అనివార్యమయ్యాయని చెప్పుకొస్తోంది. ఆ క్రమంలో చెత్తను సైతం వదలకుండా.. దానిపైనా పన్ను వేసింది. ఈ పన్నుపై సర్వ్రతా విమర్శలు వెల్లువెత్తినా సర్కార్ ఇసుమంతైనా స్పందించలేదు. ఇన్ని విధాలుగా ప్రజలపై పన్నుల భారం మోపుతూ వస్తున్న ప్రభుత్వం.. పొదుపు విషయాన్ని మాత్రం పూర్తిగా మరచిపోయింది. ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనలకు సైతం ప్రభుత్వ వ్యయంతో ప్రత్యేక విమానాలను వినియోగిస్తోంది. తన నివాసానికి కూత వేటు దూరంలో సభలో పాల్గొనేందుకు సైతం రోడ్డు మార్గాన్ని ఎంచుకోరు. వ్యయం తడిసి మోపెడైనా హెలికాప్టర్ వాడాల్సిందే. అంతేనా ఇప్పడు మరో అడుగు ముందుకు వేసి సీఎం జగన్ తన నివాసంలో హెలిప్యాడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1.89 కోట్ల రూపాయిలు మంజూరు చేస్తూ... జీవో జారీ చేసింది.
ఆ సొమ్ములో హెలిప్యాడ్, దాని ఫెన్సింగ్ కోసం 40 లక్షల రూపాయిలు. హెలిపాడ్ వద్ద గార్డ్ రూమ్‌తోపాటు ఇతర సదుపాయాల కోసం 13.50 లక్షల రూపాయిలు.. ఇక సీఎం నివాసం వద్ద పర్మినెంట్ బారికేడింగ్ కోసం 75 లక్షల రూపాయిలు, జగన్ నివాసానికి సమీపంలో పోలీస్ బ్యారెక్, ఇతర సదుపాయాల కోసం 30 లక్షల రూపాయిలు.. సెక్యూరిటీ పోస్ట్, సెక్యూరిటీ గేట్స్, పోర్టబుల్ క్యాబిన్ కోసం 31 లక్షల రూపాయిలు వినియోగించనుంది. అయితే మంజూరుపై వైసీపీలోని ఒక వర్గం తీవ్రవంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకతను పెంచుతుందని ఆ వర్గం అంటోంది.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ గతంలో అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఏపీ విమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో.. అంటే 2016లో కేన్సర్ బారిన పడి వైద్యం కోసం 23 లక్షల రూపాయిలు వ్యయం చేశారు. ఆమె హోదాకు ఆ నగదు మొత్తం ప్రభుత్వమే చెల్లించే వెసులుబాటు ఉన్నా.. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదని భావించి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నివాసంలో హెలీప్యాడ్ నిర్మాణానికి రూ.1.89 కోట్లు మంజూరు చేయడం సబబు కాదనీ, నెటిజన్లు పంచుమర్తి అనూరాథను చూసి నేర్చుకో జగనన్న అంటూ హితవు చెబుతూ సెటైర్లు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీలోని ఒక వర్గం అంటోంది.
మరోవైపు పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే... తన నివాసంలో.. క్యాంపు కార్యాలయంలో.. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం.. అక్షరాలా 64 లక్షల రూపాయిలు ప్రజాధానాన్ని వినియోగించడంపై నాడే విమర్శలు వెల్లువెత్తాయని గుర్తు చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారని.. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ససేమీరా అన్నారంటూ గతంలో మీడియాలో కథనాలు సైతం వచ్చాయనీ గుర్తు చేస్తున్నారు.
అయినా రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో.. ఏ మాసానికి ఆ మాసం.. నిధుల కోసం.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీకి.. తాడేపల్లికి వయా ముంబై ఆర్బీఐ కార్యాలయం చుట్టూ పర్యటిస్తుండడంతో ఆర్థిక శాఖ మంత్రి కాస్తా అప్పుల శాఖ మంత్రిగా మారిపోయిందని, అలాగే తాము దాచుకొన్న నగదు సైతం జగన్ సర్కార్ వాడేసుకుందంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు బహిరంగంగానే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు.
అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెలకు ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకొంటూ.. మరోవైపు ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతున్నారంటూ ఇప్పటికే జగన్ వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర చర్చ గట్టిగానే సాగుతోందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం తన నివాసంలో హెలీప్యాడ్ నిర్మాణానికి భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం ఎంత మాత్రం సబబు కాదనీ, ఆ జీవోను వెనక్కు తీసుకోవాలని సదరు వర్గం ప్రభుత్వంలోని అగ్రనేతలకు సూచిస్తోంది.