ఏపీ వైఫల్యాలను ఎండగట్టడమే తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు వ్యూహమా?
posted on Apr 3, 2023 @ 2:44PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఫల్యాలను చూపి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు వ్యూహాలను పన్నుతోందా? జగన్ సర్కార్ వైఫల్యం వల్లే, కేంద్రాన్ని నిలదీయలేని బలహీనతే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతోందని, కేంద్రానికి జగన్ తొత్తులా మారడం వల్లే ఆ రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చిందని ఎత్తి చూపి రాష్ట్రంలో పరపతి పెంచుకోవాలని తాపత్రేయపడుతోందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషణలు చేస్తున్నారు.
అందుకే కేటీఆర్ తరచుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేమి గురించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ అథారిటీగా అమరావతి అభివృద్ధి చెంది ఉండేదనీ.. కానీ రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారిన తరవాత అమరాతి అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. అదే సమయంలో తెలంగాణలో రూరల్ రింగ్ రోడ్లను సైతం అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పుుకొచ్చారు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్ గళమెత్తారు. ఆంధ్రుల హక్కు ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో గట్టి పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ ఏపీ శాఖకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాల్సిన ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
వైసీపీ ఎంపీలు విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటం లేదన్నారు ఆయన మాటలను ఎవరైనా సరే ఏపీలో సర్కార్ కేంద్రానికి అడుగులకు మడుగులొత్తుతోందనీ, ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కేంద్రాన్ని గట్టిగా ఎదుర్కొటోందనీ, కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలనూ, తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ చేసిన అన్యాయాన్నీ గట్టిగా ప్రశ్నిస్తోందనీ చెప్పుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలంగాణలో పార్టీకి ప్రజాబలం కూడగట్టడంతో పాటు, విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమెత్తడం ద్వారా బీఆర్ఎస్ ఏపీలో కూడా గట్టి పునాది ఏర్పరుచుకునేలా కేటీఆర్ తీరు ఉంది.
ఇప్పటి వరకూ ఎప్పుడో అడపాదడపా తప్ప ఏపీలోని జగన్ సర్కార్ తో సఖ్యత కోసమే ప్రయత్నించిన బీఆర్ఎస్ ఇటీవలి కాలంలో జగన్ వైఫల్యాలే తెలంగాణలో తమకు ప్రయోజనం చేకూరుస్తాయన్న భావనకు వచ్చారు. అందుకే సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏపీలోని జగన్ వైఫల్యాలను తెలంగాణ గడ్డ వేదికగా గట్టిగా ఎండగడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ జగన్ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా, తెలంగాణలో ప్రగతిని ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వ ఘనతను చాటుతున్నారు.