ఏపీ కమలంలో కాక.. తెలంగాణపైనా ప్రభావం?
posted on Jan 5, 2023 @ 9:58AM
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు లేకపోయినా.. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కమలం ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి సానుకూల వాతావరణంలో కూడా ఏపీలో బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకొనే పరిస్థితులను చేజార్చుకుంటోంది. అంతర్గత కుమ్ములాటలతో పరిస్థితిని మరింత దిగజార్చుకుంటోంది.
రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రయోజనం చేకూరే విధంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు అటు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా బీజేపీ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఏపీ బీజేపీలో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకి ఏపీకి చెందిన వారిని చేర్చుకోవడం.. అలా చేరిన వారిలో అత్యధికులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం వెనుక ఏపీ బీజేపీలోని కీలక నేత ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆ కీలక నేత వేరెవరో కాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజేనని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండగా నియమించిన పార్టీ జిల్లాల అధ్యక్షులను ఒక్కరొక్కరిగా సోము వీర్రాజు తొలగించి, ఆ స్థానంలో వేరే వారిని నియమించడం పై కన్నా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు కూడా ఉండటాన్ని ఎత్తి చూపుతూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో దుమారం లేపుతున్నాయి. ఒక్క కన్నా వ్యాఖ్యలనే కాకుండా ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరికల వెనుక సోము వీర్రాజు ఉన్నారన్న అనుమానాలు పార్టీలోని పలువురు నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జగన్ కు మేలు చేకూరేలా సోము వీర్రాజే ఏపీలో బీఆర్ఎస్ లోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారని కూడా పలువురు ఏపీ బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఏపీలో జనసేనాని పవన్ కల్యాణ్ కు నష్టం చేకూరే విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను బీఆర్ఎస్ లో చేరే విధంగా సోము పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్నే కన్నా పలు సందర్భాలలో కుండ బద్దలు కొట్టారు. అదలా ఉంచితే.. జిల్లా అధ్యక్షుల తొలగింపు విషయంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలపై ఏపీ బీజేపీలో నిరసన వ్యక్తమౌతోంది. కన్నా వర్గీయులను టార్గెట్ చేసే ఈ తొలగింపులు ఉంటున్నాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ ఏకపక్ష తొలగింపులకు నిరసనగా ఏపీ బీజేపీకి పలువురు రాజీనామాలు చేస్తూ ఆ రాజీనామా లేఖలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు. అదే సమయంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో పార్టీ పరంగా చేపట్టిన రాజకీయ కార్యక్రమం ఒక్కటీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే కన్నా ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభుత్వంపై.. అవినీతిపై క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారని అంటున్నారు.
ఇప్పుడు సోము ఏకైక అజెండా పార్టీలో కన్నాను ఏకాకిని చేసి ఆయన బయటకు వెళ్లేలా చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతారు, జనసేనలో చేరుతారు అని జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్నది కూడా సోము వీర్రాజు వర్గమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నా తన మౌనాన్ని వీడి సోముపై విమర్శలు చేస్తున్నారనీ, అధిష్ఠానం సూచనతో కొద్ది రోజులు మౌనంగా ఉన్నా.. సోము వీర్రాజు వర్గం తనపై దుష్ప్రచారం కొనసాగిస్తుండటంతో మళ్లీ నిరసన గళం ఎత్తారని చెబుతున్నారు. దీంతో కన్నా కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా తమ పార్టీ పోటీ చేయనుందని ప్రకటించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీలో ముసలానికి కారణాలపై ఒక స్పష్టత వస్తోందన్న విశ్లేషణలూ జోరందుకున్నాయి.
ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం అంటే ... ఎవరి కోసం అనే ప్రశ్న సహజంగానే తెరపై కొచ్చింది. వాస్తవానికి ఏపీలో బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నా.. ఎవరి దారిలో వారు పోతున్నారు. ఈ మైత్రీ బంధం ఉండీ లేనట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రా యపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక ఉన్నది సోము వీర్రాజు అన్న అనుమానాలను కన్నా వర్గం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని చేరుకున్న కన్నా, గత కొంత కాలంగా పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న మాట వాస్తవమే. ఆ కారణంగానే కన్నా పార్టీ మార్పు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.
వీటికి తోడు గత ఏడాది నవంబర్ లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నా నివాసానికి వెళ్లి మరీ భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ భేటీకి కొద్ది రోజుల ముందు పార్టీని నడిపే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని, మిత్రపక్షమైన జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుపై పరోక్షంగానైనా ఘాటు విమర్శలు చేశారు. అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించాలని హై కమాండ్ కు సూచించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయనతో నాదెండ్ల భేటీ కావడంతో కన్నా పార్టీ మార్పు తథ్యమని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అయితే కన్నా అదేం లేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చినా ఊహాగానాలు ఆగలేదు.
అయితే కన్నా పార్టీ మారడం విషయం పక్కన పెడితే ఏపీలో బీఆర్ఎస్ అడుగు పెట్టడం జనసేనను బలహీన పరిచేందుకు కేసేఅర్, జగన్ రెడ్డి పన్నిన ఉమ్మడి వ్యూహమేనన్న అనుమానాలకు మాత్రం తాజాగా బీజేపీలో సంభవిస్తున్న పరిణామాలు తావిస్తున్నాయి. ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఈ పరిణామాలు ఏ మంత మేలు చేయవు సరికదా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ప్రయోజనాలకు గండి కొడతాయనడంలో సందేహం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఏపీలో పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడానికి బీజేపీ హై కమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.