చలి చంపేస్తోంది.. హస్తినలో ఆరెంజ్ అలర్ట్
posted on Jan 5, 2023 @ 1:04PM
దేశ రాజధాని నగరం ఢిల్లీని చలి వణికించేస్తోంది. నైనిటాల్ తో పోటీ పడేలా న్యూఢిల్లీ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తాజాగా హస్తినలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది. విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. కంటి ముందున్నవి కూడా కనిపించని స్థాయిలో దట్టమైన మంచు దుప్పటి ఢిల్లీ నగరాన్ని కప్పేసింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి ఈదురు గాలులతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోఢి రోడ్ వంటి ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు ఏకంగా 2.2 డిగ్రీలకు పడిపోవటం విశేషం. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ సెక్టర్ అంతా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
వాతావరణ శాఖ కోడ్ లాంగ్వేజ్ లో ఆరెంజ్ అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్ అని అర్థం. ఇక ఢిల్లీ నగరంలోని వీధులు సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున చాలావరకు నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.