తెలంగాణ కాంగ్రెస్ ఇక ఇంతేనా?
posted on Jan 5, 2023 @ 10:08AM
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో.. అన్న చందంగా తెలంగాణ కాంగ్రెస్ తీరు ఉంది. ఆ పార్టీకి జనంలో ఆదరణ ఉన్నా.. అంతర్గత విభేదాల కారణంగా ఆ ఆదరణను ఓట్ల రూపంలో మార్చుకోలేని దుస్థితి. గత పదేళ్లుగా వరుస పరాజయాలతో ఆ పార్టీ ఎన్నికలంటేనే భయపడే పరిస్థితికి దిగజారింది. ఇక తెలంగాణలో అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలూ విబేదాలను పరిష్కరించుకుని ఏకతాటిపై ఎన్నికల సమరంలో విజయం కోసం పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరయి ఉనికినే కొల్పోయే పరిస్థితికి వచ్చింది.
శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ తీవ్ర అసమ్మతితో, అసంతృప్తితో సతమతమౌతోంది వాస్తవానికి గత ఏడాది కాలంగా కాంగ్రెస్ అసమ్మతి మంటల్లో మగ్గుతూనే ఉంది. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కానీ, సమస్య పరిష్కరించడానికి కానీ ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదు. ఇప్పుడు పుణ్య కాలం కాస్తా ముగిసి పోయిందన్న పరిస్థితి దాపురించిన తరువాత హడావుడిగా పార్టీలో అసమ్మతి సమస్య పరిష్కారానికి హై కమాండ్ చర్యలు ప్రారంభించింది.
రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన దగ్గర నుంచి పార్టీలో సిగపట్లు ప్రారంభమయ్యాయి. పార్టీలో అంతకు ముందు కుమ్ములాటలు, లుకలుకలు ఉన్నప్పటికీ, తెలుగు దేశం పార్టీ నుంచి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిస్థానం పార్టీ పగ్గాలు అప్పగించడం సీనియర్లకు మింగుడు పడలేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాతే.. పార్టీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు నూతనోత్సాహం వచ్చింది.
అయితే తమను కాదని రేవంత్ కు పగ్గాలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకే సీనియర్ల అసమ్మతి కుంపటి రగిల్చారు. రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నాకా.. తెలుగుదేశం పార్టీ నుంచి తన గ్రూపు వారిని పార్టీలోకి తీసుకురావడం వారికి పీసీసీ కమిటీల్లో పెద్ద పీట వేయడంతో బహిరంగంగా అసమ్మతి రాగం ఆలపించారు. దీంతో అధిష్టానం హుటాహుటిన సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను పంపించింది కానీ, ఆయన దౌత్యం పెద్దగా పనిచేసిన దాఖలాలు కనిపించడం లేదు. పార్టీ కమిటీలన్నిటినీ రేవంత్ తన వర్గం వారితోనే నింపేస్తున్నారని, తమను పక్కన పెట్టేస్తున్నారని సీనియర్లు దిగ్విజయ్కు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డి వర్గం కూడా పార్టీ సీనియర్ నాయకుల తీరుతెన్నులను బాహాటంగానే ఎండగడుతోంది పార్టీలో రేవంతు పెరుగుతున్న పట్టు, పలుకుబడిని చూసి సీనియర్లు ఓర్వ లేకపోతున్నారని, సరిగ్గా ఆయన పాదయాత్ర చేయదల చుకున్నప్పుడే వారంతా గొంతెత్తడం ప్రారంభించారని వారు దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. రేవంత్ పాదయాత్ర ద్వారా తన పట్టును పెంచుకోవడం ఈ నాయకులకు ఏమాత్రం గిట్టడం లేదని కూడా వారు ఆయనకు చెప్పారు. నిజానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర ప్రతిప క్షాల కంటే కొద్దిగా మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా, బీజేపీ, తెలుగుదేశం తదితర పార్టీల కంటే పటిష్ఠంగా ఉంది. పాలక పక్షం మీద సంధించడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ ఆ పార్టీ దగ్గర ఉన్నాయి. పాలక పక్షం మీద పోరాటాన్ని ఉధృతం చేయడానికి తమకే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ అధిష్టాన వర్గం సైతం భావిస్తోంది. ఈ దశలో పాత కాపులు, కొత్త కాపుల మిశ్రమంగా పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనడానికి బుధవారం (జనవరి 4)న టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో రేవంత్ ప్రసంగమే నిదర్శనం. పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను టీపీసీసీ పగ్గాలు వీడడానికి సిద్దమని రేవంత్ బేలగా చెప్పడం ఆయనపై సీనియర్లు పై చేయి సాధించారనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే మాణికం ఠాగూర్ లో కలిసి జోడు గుర్రాల్లా రాష్ట్ర పార్టీని పరుగులెట్టించాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్న రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి నుంచి ఠాకూర్ ను తప్పించడం కచ్చితంగా రేవంత్ కు ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.