చంద్రబాబు సహా తెలుగుదేశం కీలక నేతల అరెస్టుకు రంగం సిద్ధం?
posted on Jan 5, 2023 @ 3:09PM
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నట్లుగా, నిషేధం ఉత్తర్వులు, లాఠీచార్జీలతో తెలుగుదేశం ప్రభంజనాన్ని నిలువరించడంలో విఫలమైన వైసీపీ ఇక ఆ పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధ పడుతోంది. పరిస్థితులు చూస్తుంటే వైసీపీ సర్కార్ అందుకే సిద్ధపడిందని అనిపించక మానదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బయటకు తెలియని అలజడి రేగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్దం కాని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కార్యాలయాలు, కీలక నేతల నివాసాల ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న కుప్పం తెలుగుదేశం కార్యాలయం వద్ద అయితే వేల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. కుప్పంలోకి బయటి వ్యక్తులెవరినీ రానీయడం లేదు. పార్టీ కార్యాలయం చుట్టూ ముళ్ల కంచెలు వేసి దిగ్బంధించారు. దీంతో ఏ క్షణంలోనైనా చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ నేతలందరినీ అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారంతో తెలుగుదేశం శ్రేణులు భారీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. కాగా కుప్పం పార్టీ కార్యాలయం ఎదుట పోలీసులు ముళ్ల కంచెలతో బారికేడ్డు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కార్యాలయం వద్ద మోహరించారు. కుప్పంలోనికి బయట నుంచి ఎవరినీ అడుగు పెట్టనీయకుండా వేల మంది పోలీసులు మోహరించారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ, నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు, నియోజకవర్గ సమస్యలపై నేతలతో చర్చలతో బిజీగా ఉన్నారు. కార్యాలయం బయట కూడా పెద్ద సంఖ్యలో జనం వేచి ఉన్నారు.
అలాగే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించి ఉండటంతో అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ కనిపిస్తోంది. ఇలా ఉండగా చంద్రబాబును అరెస్టు చేయవచ్చన్న ప్రచారంతో కుప్పం పార్టీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు చేరుకుంటున్నాయి. చంద్రబాబును కుప్పంలో ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారానికి బలం చేకూరే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యాలయాలు, నాయకుల ఇళ్ల వద్ధ కూడా పోలీసులు భారీగా మోహరించారు. తెలుగుదేశం అధినేతను అరెస్టు చేస్తే ఎక్కడా ఎవరూ ఆందోళనలకు దిగకుండా తెలుగుదేశం నాయకులను ముందస్తు అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలను, కీలక నేతల నివాసాలను పోలీసులు చుట్టు ముట్టడంతో ఏం జరుగుతోందో, ఎం జరుగుతుందో అర్దం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఆ పార్టీ నేతలందరినీ అరెస్టు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ స్థాయిలో తెలుగుదేశం కార్యాలయాలు, నేతల నివాసాలను పోలీసులు చుట్టుముట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందా అని తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. లేదా మావోయిస్టు పార్టీని నిషేధించినట్లు తెలుగుదేశం పార్టీని కూడా నిషేధించారా అంటూ నిలదీస్తున్నారు. విపక్ష నేతలపై ఇలా పోలీసుల ప్రయోగం ఈ స్థాయిలో ఎమర్జెన్సీ సమయంలో కూడా జరగలేదంటున్నారు. ఇప్పటికే కుప్పంలో బుధవారం పోలీసుల లాఠీ చార్జి నేపథ్యంలో నిషేధం అమలులో ఉన్న చంద్రబాబు రోడ్ షో నిర్వహించడానికి ప్రయత్నించడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదైందని చెబుతున్నారు.
అయితే ఇందుకు సంబంధించి ఎఫ్ ఐఆర్ లను అయితే బయట పెట్టడం లేదు. ఆ కేసు ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయాలన్నది పోలీసులు వ్యూహంగా చెబుతున్నారు. ఇంతే కాకుండా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటలకు సంబంధించి కూడా చంద్రబాబుపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేశారన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న హడావుడి చూస్తుంటూ ఏదో పెద్ద ప్రణాళికే ఉందని తెలుగుదేశం శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సహా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కీలక నేతలందరినీ అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.