మల్లారెడ్డి, గంగుల ఔట్.. బండా ప్రకాశ్, బాల్కసుమన్ ఇన్.. కేసీఆర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?
posted on Jan 5, 2023 @ 4:55PM
సంక్రాంతి తరువాత ఏ రోజైనా కేసీఆర్ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి తరువాత ప్రారంభం కానున్న కొత్త సచివాలయంలో కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని చెబుతున్నారు. ప్రస్తుత కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులుకు ఉద్వాసన పలికి, కొత్తగా ఇద్దరికి స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొత్తగా కేబినెట్ లోకి తీసుకోనున్న ఇద్దరు మంత్రులకు ఇప్పటికే ఆ మేరకు సమాచారం కూడా పంపించారని చెబుతున్నారు. ఇక ఉద్వాసనకు గురి కానున్న ఇద్దరు మంత్రుల విషయానికి వస్తే వారి తీరు తరచూ వివాదాస్పదం అవుతుండటం, ఆ వివాదాస్పద తీరు కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుండటం కారణమని అంటున్నారు. వీరిద్దరికీ ఉద్వాసన పలకడం ద్వారా అధికారం ఉందనీ, అధిష్ఠానం అండ ఉందనీ ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసన, చేర్పులకు సంబంధించి సీనియర్ నాయకులతో కేసీఆర్ ఇప్పటికే గోప్యంగా చర్చలు జరిపి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. సాధారణంగా కేసీఆర్ కేబినెట్ సహచరులతో, అధికారులతో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తారు, అయితే కట్టు దాటుతున్నారని అనిపిస్తే మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు మాజీ మంత్రులు రాజయ్య, ఈటల ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మంత్రులు మల్లారెడ్డి, గంగులల వ్యవహార శైలి పట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారనీ అందుకే వారికి ఉద్వాసన పలకాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారంటున్నారు. వారి స్థానంలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లకు కేబినెట్ లో చోటు కల్పించనున్నారంటున్నారు.