రాహుల్ కొత్త గురువు ఎవరంటే ?
రాహుల్ గాంధీలో మార్పువచ్చింది. భారథ్ జోడో యాత్ర అయనలో మార్పు తెచ్చింది. గతంలో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా వరకు ఆయన్ని సీరియస్ రాజకీయ నాయకుడిగా గుర్తించలేదు. ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ మిత్ర పక్షాల నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించలేదు.
పార్లమెంట్ లో కన్ను కొట్టడం, హటాత్తుగా లేచి వెళ్లి ప్రధాని మోడీ మీద పడి కౌగిలించుకోవడం వంటి పిల్ల చేష్టలు ఆయన ఇమేజ్ ని మరింతగా పలుచన చేశాయి, ఆలాగే ఎవరికీ చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేయడం, యూపీఎ హాయాంలో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆర్డినెన్సును విలేకరుల సమావేశంలో చించి పడేయడం, వంటి చర్యలు కూడా ఆయన రాజకీయ అపరిపక్వతను దేశం ముందుంచింది. అందుకే ఆయనకు రాజకీయాలు తెలియవని, ఆయన ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని, దేశ, విదేశీ జర్నలిస్టులు, విశ్లేషకులు తీర్పు నిచ్చారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవని నిర్దారించారు. అలాగే, గడచిన ఏడెనిమిది సంవత్సరాలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన డజన్ల కొద్ది సీనియర్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు రాహుల్ గాంధీనే కారణమని, ఆరోపించారు. వెళుతూ వెళుతూ అక్షింతలు వేసి మరీ వెళ్ళారు.
అయితే భారత జోడు యాత్ర తర్వాత రాహుల్ గంధిలో గుణాత్మక మార్పు వచ్చిందని కొందరైనా ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీని, పప్పూ అని అవహేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు తమ మాటను వెనక్కి తీసుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంతటి వాడు భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, రాహుల్ గాంధీలో పెద్దమనిషి లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. నిజానికి, రాజకీయ అనుబంధాలు, అవరోధాల కారణంగా కొందరు రాహుల గాంధీ పెద్దరికాన్ని, నాయకత్వాన్ని ఇంకా గుర్తించలేక పోతున్నారు కానీ రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది. ఆయన నేతగా ఎదిగారు అనే వాళ్ళు లేక పోలేదు.
అదలా ఉంటే భారత్ జోడో యాత్ర నుంచి క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విరామం తీసుకున్న రాహుల్ గాంధీ శనివారం (డిసెంబర్ 31) ఢిల్లీలో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ తనకు గురువు లాంటివని ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏదైనా, ఆయా ఏ బాటలో వెళుతున్నారో ఆ వ్యాఖ్యలు స్పష్టం చేసాయి. నిజానికి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ముందు నుంచి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య విద్వేషం రగిలిస్తోందని, భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రేమను పంచుతూ ..అందరినీ ఏకం చేసే ప్రయత్నం సాగిస్తోందని చెప్పు కున్నారు. నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అదే ట్యాగ్ లైన్ గా చెప్పుకుంటున్నారు.
ఇప్పడు యాత్ర విరామ సమయంలో ఆయన, ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీని తాను గురువులా భావిస్తానని అన్నారు. బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీని చూసే తాను ఎలా ఉండకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తమపై ఎంత దూకుడుగా దాడి చేస్తే.. తమ పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు అంతగా సాయపడుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రను తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక సాధారణ యాత్రగా ప్రారంభించానని.. అయితే అది క్రమంగా ప్రజల గొంతుకగా మారి, వారి భావోద్వేగాలను ప్రతిబింబింస్తోందని రాహుల్ తెలిపారు.
అయితే, రాహుల్ గాంధీ బీజేపీ,ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏదైనా ప్రయోజనం చేకురుతుందా? అంటే ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రవచించే హిందూ జాతీయ వాదం ముందెన్నడూ లేనంతగా ప్రజామోదం పొందుతున్న సమయంలో హిందుత్వ భాజాలానికి వ్యతిరేకంగా సాగడం, ఒక విధంగా ఏటికి ఎదురీదటమే అవుతుందని, కొందరు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా, రాహుల్ గాంధీ చెపుతున్న విషయాలు ప్రవచనంలా వినడానికి బాగుంటాయి కానీ, ఆచరణలో కష్టమని అంటున్నారు.
నిజానికి, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ప్రవచిస్తున్న హిందుత్వ వ్యతిరేక లౌకికవాదానికి, రాహుల గాంధీ చెపుతున్న కొత్త సిద్ధాంతానికి భాషలోనే కానీ, భావనలో పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజలు వ్యతిరేకించిన హిందూ వ్యతిరేక లౌకిక వాదాన్నే రాహుల గాంధీ, లౌకిక వాదం,సెక్యులరిజం పదాలు వాడకుండా కొంత భిన్నంగా ప్రెజెంట్ చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీ కూడా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ, వ్యక్తిగత ఇమేజ్ ని పెంచవచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీకి జరిగేది, ఒరిగేది ఏదీ లేదని, ఏమీ ఉండదని అంటున్నారు.