ముగ్గురు పెళ్లాలు.. 60 మంది పిల్లలు.. మళ్లీ పెళ్లికి రెడీ
posted on Jan 4, 2023 @ 1:10PM
ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల రావు నూతన్ ప్రసాద్ ని నిత్య పెళ్లి కొడుకా అని పిలుస్తాడు. సమాజంలో అలాంటి నిత్య పెళ్లి కొడుకులను చాలా మందే ఉన్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వారి గురించి వార్తల్లో వింటూనే ఉంటాం. అయితే బహుభార్యలు ఉన్న మొగుళ్ల సంగతీ తెలిసిందే.
పదుల సంఖ్యలో పిల్లల్ని కన్నవారూ ఉన్నారు. అయితే వీరందరికీ భిన్నంగా ఓ వ్యక్తి ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలతో వార్తల్లోకి ఎక్కడమే కాకుండా మరింత మంది పిల్లలు కావాలంటున్నారు. ఇందు కోసం ఇంకా పెళ్లిళ్లు చేసుకుంటానంటున్నారు. అలా చెబుతున్న వ్యక్తి యువకుడేం కాదు.. వృద్ధుడు. ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటే ఇహనో ఇప్పుడో రిటైర్మెంట్ కు సిద్ధంగా ఉండే వయస్సు. అయితే ఆయన 60 మంది పిల్లల్లో ఓ ఐదుగురు మరణించారు.
అతడి పేరు హాజీజాన్ మహ్మద్. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి. మరింత మంది పిల్లలు కావాలన్నది అతని కోరిక. అందుకు అతడి ముగ్గురు భార్యలు సై అన్నారట. అయితే పిల్లల కోసం మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. విశేషమేమిటంటే.. అతడి పెద్ద కూతురుకి ఇప్పడు పెళ్లీడు వచ్చింది.
ఆ అమ్మాయికి పెళ్లి చేయాలన్న విషయాన్ని పట్టించుకోకుండా తాను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతుక్కుంటున్నాడు. మరో పెళ్లితో ఆగుతానని అనడం లేదు. మరింత మంది పిల్లల్ని కనడం కోసం ఇంకా ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవడానికి రెడీ అంటున్నాడు.