కుప్పం రణరంగం.. పోలీసుల దాష్టీకం.. బాబు చంద్ర నిప్పులు
posted on Jan 4, 2023 @ 10:34PM
చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం రణరంగంగా మారింది. చంద్ర కుప్పం పర్యటనను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ సర్వ విలువలకూ, నిబంధనలకూ తిలోదకాలిచ్చేసింది. పోలీసుల అత్యుత్సాహం కారణంగా కుప్పం యుద్ధ భూమిగా మారిపోయింది. చంద్రబాబు కుప్పం పర్యటన సీఎం జగన్ కు ఇష్టం లేదు కనుక.. ఎవరూ ఆయనకు స్వాగతం చెప్పడానికి వీళ్లేదు, ఆయన ప్రసంగం వినడానికి వీళ్లేదు అన్న రీతిలో పోలీసులు వ్యవహరించారు. దీంతో వైసీపీ చీకటి జీవో లక్ష్యమేమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. కుప్పం పర్యటనకు ముందు చంద్రబాబు ప్రచార రథం డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రచార రథాన్ని సైతం సీజ్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తిరగడానికి అవకాశం లేకుండా చేయడం కోసమే జగన్ సర్కార్ ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించిందన్నది దీనితో తేలిపోయింది. చంద్రబాబు పర్యటన సాగిస్తే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడం తథ్యమన్నసమాచారంతోనే.. రోడ్ షోకు చంద్రబాబు వెళ్లే అవకాశం లేకుండా చేయాలన్నఉద్దేశంతోనే వైసీపీ నిషేధం విధించిందని తేటతెల్లమైపోయింది.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే. కందుకూరులో జరిగిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ సంఘటనలను సాకుగా తీసుకుని ఏపీలో సభలు, ర్యాలీ లు, రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించింది. నిషేధం అమలులోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ రాజమండ్రి, ఉత్తరాంధ్రలో వేలాది మందిలో కార్యక్రమాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు కుప్పం పర్యటన కు మాత్రమే నిషేధం విషయం పోలీసులకు గుర్తు వచ్చింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు చూపిన అత్యుత్సాహం కారణంగానే కుప్పం రణరంగమైంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన ప్రచార రధాన్ని సీజ్ చేశారు. ఆ రథం డ్రైవర్ ను అదుపులోనికి తీసుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. సభా వేదికను కూల్చేశారు. దీంతో జనం పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు.
ఈ లాఠీ చార్జిలో పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్ఫృహ తప్పి పడిపోయారు. కుప్పం నియోజకవర్గంలో బాబు అడుగుపెట్టీ పెట్టగానే అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే నోటీసు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరో రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గంలోని పెద్దూరు చేరుకున్న చంద్రబాబును అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తన సొంత నియోజకవర్గంలో ప్రవేశించవద్దనడానికి పోలీసులు ఎవరని నిలదీశారు. రాజమహేంద్రవరంలో రోడ్లు బ్లాక్ చేశారు. విద్యా సంస్థలు మూసేశారు. ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు. జగన్‌కు ఓ రూలు.. నాకు ఓ రూలా? అని ప్రశ్నించారు.
ఈ నెల2నజీవో తెచ్చారు, ఆ జీవో ఈనెల 1 నుంచే అమలులో ఉందని పలమనేరు డీఎస్పీ చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏ చట్టం కింద తనను తన సొంత నియోజకవర్గానికి రానీయకుండా అడ్డుకుంటున్నారని నిలదీశారు.
ప్రచార వాహనం తీసుకు రాకుంటే ఇక్కడే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ప్రచార రథం తెచ్చే వరకు పెద్దూరులో పాదయాత్ర చేస్తానని అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్లారు. అయితే ఇక్కడ తప్పని సరిగా గుర్తించాల్సిన అంశమేమిటంటే.. చంద్రబాబు రోడ్ షోలలో తొక్కిసలాటలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం ఆ తొక్కిసలాటలు జరిగిన సభలలో పోలీసుల వైఫల్యం గురించి మాట్లాడటం లేదు. తొక్కిసలాట జరిగిన రెండు సందర్భాలలోనూ కూడా పోలీసుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. అయితే కుప్పం పర్యటనను అడ్డుకోవడానికి మాత్రం జిల్లా మొత్తం పోలీసు యంత్రాంగమంతా ఇక్కడే ఉందా అన్నట్లుగా వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రత్యేక బలగాల్ని తరలించారు. ఒక విధంగా చెప్పాలంటే గత ఏడాది ఆగస్టులో చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తించారో..ఇప్పుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు అదే విధంగా వ్యవహరించారు.
కాగా చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందన్నారు. జీవో నంబర్ 1 జగన్ కు వర్తించదా అని ప్రశ్నించారు. మంగళవారం (జనవరి 3) రాజమహేంద్రవరంలో పర్యటించిన జగన్ చేసిన షోకు నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. చీకటి జీవోలతో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.