తెలుగుదేశం కూటమిదే విజయం.. ఇండియా టుడే సర్వే
posted on Apr 4, 2024 @ 11:10AM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈ సారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదని పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 17 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమై నవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలోఅన్ని దారులూ రోమ్ వైపే అన్నట్లుగా అన్ని సర్వేల ఫలితాలూ తెలుగుదేశం కూటమినే సూచిస్తున్నాయి. తాజాగా మరో జాతీయ మీడియా సర్వేలో కూడా ఆంథ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. ఇండియా టుడే మూడ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం కూటమికి ఏకపక్ష విజయం ఖాయమని తేలినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి 17 నియోజకవర్గాలలో విజయం సాధిస్తుందనీ, జగన్ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుందని పేర్కొంది. ఇటువంటి ఫలితాలే అసెంబ్లీ ఎన్నికలలోనూ వస్తాయని పేర్కొంది. అంటే తెలుగుదేశం కూటమి 119 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే.. తెలుగుదేశం 45శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక వైసీపీకి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని, బీజేపీ2 శాతం, కాంగ్రెస్ 3 శాతం ఓట్లు సాధిస్తాయని ఇండియాటుడే సర్వే పేర్కొంది. ఇతరులకు 9 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది.
ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం బీజేపీ పది స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. మిగిలిన స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో ఉంటారు. వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తున్నది. పోటీ ప్రధానంగా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్యే ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ పార్టీ ఏంత మేర బలోపేతమైతే అంత మేరకు వైసీపీ నష్టపోతుందని సర్వే తేల్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ దే హవా!
ఇక తెలంగాణలోక్ సభ ఎన్నికలపై కూడా ఇండియా టుడే సీఓటర్ తన సర్వే ఫలితాన్ని వెలువరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక బీజేపీ మూడు స్థానాలలో, బీఆర్ఎస్ మూడు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధిస్తుందనీ, బీఆర్ఎస్ కు కేవలం 21శాతం ఓట్లు మాత్రమే వస్తాయనీ సర్వే పేర్కొంది. బీజేపీక 29శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్లు, ఇతరులకు 6శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది.