సీఎస్ జవహర్ రెడ్డిపై ఈసీ వేటు తప్పదా?
posted on Apr 4, 2024 @ 10:42AM
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. పాలనా పగ్గాలు చేతిలో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి పై తెలుగుదేశం మొదటి నంచీ ఆరోపణలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఆ ఆరోపణలతో సంబంధం లేకుండా సామాజిక పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఆయన వైఫల్యం, వైసీపీ సర్కార్ కు అనుకూలంగా పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని ఆయన మలచడానికి చేసిన యత్నాలు ఇప్పుడు ఆయన జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేశాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పెన్షనర్లకు ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులివ్వకుండా, సచివాలయాల వద్దకు రప్పించి వారిని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులుగా మార్చేందుకు జవహర్ రెడ్డి ప్రయత్నించిన తీరు పట్ల ఈసీ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇటీవల అంగన్వాడీలు సమ్మె చేసిన సమయంలో జగన్ సర్కారు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ, గ్రామ, వార్డు సిబ్బందిని అంగన్వాడీల సమ్మెవల్ల ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వారిని ఉపయోగించుకుంది. అయితే అత్యంత కీలకంమైన పెన్షన్ల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పట్టించుకోకుండా జవహర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గాఈ అంశాన్ని పెన్షనర్లలో తెలుగుదేశం పట్ల ఆగ్రహం వ్యక్తం అయ్యేందుకు వీలుగా మలచి, తద్వారా జగన్ సర్కార్ కు మేలు చేయాలన్న లక్ష్యంతోనే జవహర్ రెడ్డి నిష్క్రియాపరత్వం ప్రదర్శించారని ఇప్పటికే తెలుగుదేశం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు తరువాతే ఎన్నికల సంఘం వికలాంగులు, వయోవృద్ధులకు మూడు రోజులలో ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది.
ఆ ఆదేశాలను బట్టి చూస్తే జవహర్ రెడ్డిపై వేటు వేసే విషయం ఈసీ పరిశీలనలో ఉందన్న సంగతి అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా ఇన్చార్జి డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమంటే తెలుగుదేశం ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ విషయంకూడా ఈసీ పరిశీలనలో ఉందనీ, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశాలున్నాయనీ అంటున్నారు.